ఆ నియోజకవర్గంలో కచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుందని బీఆర్ఎస్ నమ్ముతోందా? అందుకే ఘర్ వాపసీ అంటూ పాత నేతను తిరిగి ఆహ్వానిస్తోందా? ఇప్పుడున్న ఇన్ఛార్జ్కంటే ఆ నాయకుడే సూపర్ అని పార్టీ పెద్దలు ఫీలవుతున్నారా? డాక్టర్ రాసింది, రోగి కోరుకున్నది ఒకటే మందు అన్నట్టు సదరు నేత కూడా సై అంటూ చేరికకు సిద్ధమైపోయారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా ఘర్ వాపసీ లీడర్? మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పట్టు నిలుపుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలు ఒక ఎత్తయితే…. సత్తా చాటాలన్న టార్గెట్‌తో ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే…. నాయకులెవ్వరూ తమ పార్టీని విడిచిపెట్టి వెళ్లకుండా జాగ్రత్త పడటంతో పాటు…. గతంలో వెళ్లిన వాళ్ళకు కూడా ఘర్ వాపసీ అంటూ ఆహ్వానాలు పలుకుతోంది. ఈ క్రమంలోనే… ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు ఆరూరి రమేష్ తిరిగి కారెక్కడానికి సిద్ధమైనట్టు చెబుతున్నారు. గతంలో గులాబీ దళంలోనే ఉన్న ఆరూరి 2014 , 2018 ఎన్నికల్లో వరుసగా ఆ పార్టీ తరఫున వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2023లో మాత్రం ఓటమి తప్పలేదు.
పార్టీ, తాను ఓడిపోయాక కూడా….నమ్మకంగానే ఉన్న ఆరూరి రమేష్…. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ టిక్కెట్ ఆశించారు. కానీ… బీఆర్ఎస్ అధిష్టానం నో చెప్పడంతో…బీజేపీలోకి వెళ్ళి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాతి నుంచి బీజేపీతో కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే. ఇక ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఒక్క బీజేపీ సర్పంచ్‌ని కూడా గెలిపించుకోలేకపోయారాయన. అయితే…. అప్పటికే బ్యాక్ టు హోమ్ మూడ్‌లో ఉన్నారని, బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైనందునే ఆ ఎన్నికల్ని సరిగా పట్టించుకోలేదన్న టాక్ కూడా నడిచింది. తిరిగి కారెక్కాలని ఇన్నాళ్ళు ఆరూరి తహతహలాడితే…. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం కూడా రెడీ అంటూ డోర్ తెరిచేసిందట. అందుకు ప్రత్యేక కారణం ఉందని అంటున్నారు.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్నారు కడియం శ్రీహరి. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందన్నది గులాబీ అధిష్టానం అంచనా. అందుకే ఆరూరి రమేష్‌ను తిరిగి తీసుకుని ఘన్పూర్ బరిలో దించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఘన్పూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తాటికొండ రాజయ్యను కాకుండా కొత్తగా ఆరూరిని కడియం మీద పోటీకి దింపడమే కరెక్ట్ అని ఆలోచిస్తోందట బీఆర్ఎస్ అధిష్టానం. అందుకే ఆయనకు కమ్..కమ్…. వెల్కమ్ అంటూ స్వాగతం పలికినట్టు సమాచారం. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నందున ఈ టైంలో మాజీ ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకుంటే…. ఇటు మున్సిపల్ ఎన్నికలకు, అటు స్టేషన్ ఘన్పూర్ బైపోల్‌కి కూడా ఉపయోగపడుతుందని లెక్కలేసుకుంటున్నట్టు తెలిసింది. వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా ఇప్పటికే మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నియమించింది పార్టీ. ప్రస్తుతానికి మునిసిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించినప్పటికీ… భవిష్యత్తులో డీలిమిటేషన్ తర్వాత వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావే రంగంలోకి దిగుతారన్న ప్రచారం ఉంది.
అందుకోసమే ఆ నియోజకవర్గానికి చెందిన ఆరూరి రమేష్ మళ్లీ పార్టీలోకి వస్తున్నప్పటికీ ఆయనకు స్టేషన్ ఘన్పూర్ బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. పార్టీనుంచి వెళ్లిన వాళ్ళని వెనక్కి తీసుకోబోమని గతంలో చెప్పారు బీఆర్ఎస్ పెద్దలు. కానీ…. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారినందున ఎవరొచ్చినా ఆహ్వానిస్తామంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే…. లోక్‌సభ ఎన్నికల టైంలో పార్టీని వదిలి వెళ్ళి బీజేపీలో చేరిన ఆ/రూరికి సాదర స్వాగతం పలుకుతున్నారన్న విశ్లేషణలున్నాయి. అంతా ఓకే అయినందునే రమేష్ కూడా తాను బీజేపీని వీడి తన ఇంటి పార్టీలోకి వెళ్తున్నట్టు ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. దాన్ని బట్టి చూస్తుంటే…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చాలా మార్పులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.