ఆ ఇద్దరూ.. బీజేపీ నేతలే… కానీ వారి మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.కమలం పార్టీ ఎంపీ,ఎమ్మెల్యే మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా?కాంట్రాక్టు పనుల కోసం ఇద్దరు నేతల వర్గీయుల మధ్య మళ్లీ వివాదం మొదలైందా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే వర్గీయుల ఆగ్రహానికి కారణం ఏమిటి ? కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గండికోట పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కేంద్రమంత్రి చొరవతో సాస్కి పథకం కింద 80 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.అందులో భాగంగా 50 కోట్ల రూపాయలకు టెండర్లను పిలిచింది పురావస్తు శాఖ. ఆ టెండర్లను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ దక్కించుకుంది. రెండు నెలల క్రితం జమ్మలమడుగు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండికోటలో సాస్కి నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఆ తరువాత రిత్విక్ సంస్థ పనులు మొదలుపెట్టింది.కానీ గత వారం రోజుల నుంచి రిత్విక్ సంస్థ ప్రతినిధులకు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు మధ్య వాదోపవాదాలు జరుగుతూ వస్తున్నాయి. స్మశాన స్థలం లో రిత్విక్ సంస్థ నిర్మాణాలు చేపడుతొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ సంస్థ చేపడుతున్న పనులను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుంటున్నారని ఆ సంస్థ ప్రతినిధులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే వర్గీయులు రిత్విక్ సంస్థ కార్యాలయంపై ఎటాక్ చేశారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట గ్రామంలో చేపడుతున్న సాస్కి పనులను నిలిపివేయలని గ్రామస్తులు డిమాండ్ చేశారట.కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు పనులు చేయవద్దని వారు అంటున్నారట… ఎంత చెప్పినా వినకుండా రిత్విక్ సంస్థ పనులు చేపడుతున్నారనేది వారి ఆరోపణ.దీంతో రిత్విక్ సంస్థ కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ ద్వంసం చేశారు. అంతేకాకుండా అడ్డు వచ్చిన సిబ్బందిపై కూడా ఎటాక్ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పనులు అడ్డుకోవడం కోసం తమ సంస్థ పై దాడి చేశారని రిత్విక్ సంస్థకు చెందిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఆదాని సంస్థ కు చెందిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పనులను రిత్విక్ సంస్థ చేపట్టింది. అక్కడ తమ వర్గీయులకు కాకుండా వేరే వాళ్లకు పనులు ఎలా ఇస్తారంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఆ సంస్థ కార్యాలయం పై దాడి చేశారు. ఈ ఘటన మరవకమునుపే మరోసారి రిత్విక్ సంస్థ కార్యాలయం పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేయడంతో కాంట్రాక్టు పనుల కోసమే ఇలా చేసి ఉంటారనేది ఎంపీ వర్గీయుల వెర్షన్. ఏది ఏమైనా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు, అదే పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ సంస్థకు మధ్య వార్ మొదలైంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇది ఎక్కడిదాకా వెళ్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.