తెలంగాణ మొత్తం ఒక రూల్, మునుగోడు నియోజకవర్గంలో మాత్రం మరో రూలా? ఏ… బిడ్డా… ఇది నా అడ్డా…. ఇక్కడ నా మాటే శాసనం అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారా? ఏ విషయంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విధానాన్నే సవాల్ చేస్తున్నారు? అందుకు ఆయన చెబుతున్న రీజన్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ లీడర్స్‌లో ఒకరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సరికొత్త వివాదానికి తెర లేపారు. తన నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ నిబంధనలకు బదులుగా… సొంత రూల్స్ అప్లయ్ చేయాలనుకుంటున్నారట. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలోని బెల్ట్ షాపుల మీద ఉక్కు పాదం మోపుతున్న రాజగోపాల్ రెడ్డి… తాజాగా మద్యం టెండర్ల మీద కూడా దృష్టి పెట్టారట.రెండు సంవత్సరాల కాలపరిమితితో తాజాగా వైన్స్ టెండర్లను పిలిచింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే…మునుగోడు నియోజకవర్గానికి నయా ఎక్సైజ్ టెండర్ రూల్స్ ప్రకటించేశారు ఎమ్మెల్యే. స్థానికులు మాత్రమే వైన్స్ షాపులకు టెండర్స్ వేయాలన్నది ఆయన ఫస్ట్ రూల్.. ఏ మండలం వారు… ఆ మండలంలో మాత్రమే టెండర్లు వేయాలని, ఖచ్చితంగా ఆ జాగ్రత్త పాటించాలని చెప్పారట. స్థానికులు మాత్రమే టెండర్లు వేస్తే… నిర్వహణ తాను చెప్పినట్లుగా నడుస్తుందనేది రాజగోపాల్ రెడ్డి ప్లాన్‌గా తెలుస్తోంది. ఇక డ్రాలో ఎవరు షాప్‌ని దక్కించుకున్నా… ఊరికి దూరంగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిస్తున్నారాయన.
అంతేనా….టైమింగ్ రూల్ కూడా పెట్టేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు షాప్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ… తన ఓన్ రూల్ బుక్‌లో దీన్ని మార్చేశారు రాజగోపాల్‌రెడ్డి. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వైన్స్ షాపులను సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరవాలంటూ రూల్ పాస్ చేస్తున్నారట. ఇక వైన్ షాప్ లకు అనుబంధంగా పర్మిట్ రూంలకు నోఛాన్స్. అలాగే… సిండికేట్‌ను సహించేది లేదని…. తన రూల్స్ జాగ్రత్తగా అమలయ్యే బాధ్యత క్యాడర్ తీసుకోవాలని చెప్పారట మునుగోడు ఎమ్మెల్యే. అంతేనా… ఇంకో అడుగు ముందుకేసి హస్తం పార్టీ నేతలు ఎవరూ మద్యం టెండర్ల జోలికి వెళ్లొద్దని సూటిగా చెప్పేయడం కలకలం రేపుతోంది. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 26 మద్యం దుకాణాలున్నాయి. ఒకొక్క షాప్ నుంచి రెండు సంవత్సరాలకు కలిపి ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు కింద 1 కోటీ 10లక్షలు చెల్లిస్తారు.
అలా.. 28 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇక టెండర్లు దాఖలు చేసే సమయంలో ధరఖాస్తు ఫీజు కింద దాదాపు 4 కోట్లకు పైగా అదనపు ఆదాయం ఉంటుందన్నది ఓ లెక్క. అయితే…రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన మునుగోడు రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోందట ఎక్సైజ్ శాఖ అధికారుల్లో. ఒకవైపు రాష్ట్ర ఖజానా నింపేందుకు పడరాని పాట్లు పడుతుంటే.. రాజగోపాల్ రెడ్డి తాజా కండిషన్స్‌తో పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయ్యిందట ఎక్సైజ్ అధికారుల పరిస్థితి.. మరోవైపు ఇప్పటికే వైన్స్ షాపులకు టెండర్లు దాఖలు చేసిన నాన్ లోకల్స్ రాజగోపాల్ రెడ్డి తాజా నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. పైగా… నా రూల్స్ నా ఇష్టం అంటున్నది కూడా గట్టినేతే కావడంతో… ఎక్సైజ్ అధికారులు కూడా ప్రభుత్వ పెద్దవైపే చూస్తున్నారట.