రెండు దశాబ్దాలుగా అక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. బలమైన నాయకులు ఉన్నా.. డీలా పడింది పార్టీ. ఎప్పటికప్పుడు అభ్యర్థుల మార్పు కూడా మైనస్ అవుతోందనే వాదన ఉంది. ఇప్పుడు కొత్తవాళ్లు రావడంతో పాతవాళ్లు మింగిల్ కావడం లేదు. దీంతో ఇంకా రచ్చ రచ్చ అవుతోంది.
రైల్వేకోడూరు టీడీపీలో గ్రూపుల గోల
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం టీడీపీలో ముఠామేస్త్రిలు ఎక్కువయ్యారు. ఇక్కడ టీడీపీ ఇంఛార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడికి కూడా ఇక్కడ బలగం ఉంది. ఇద్దరికీ అస్సలు పడదు. గత ఎన్నికల్లో ఇక్కడ మాజీ ఎంపీ శివప్రసాద్ అల్లుడు పంతగాని నరసింహప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయనే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా దుద్దెల అనితాదీప్తి అనే మహిళా నేత టీడీపీ టికెట్ కోసం కర్చీఫ్ వేస్తున్నారు. ఆ మధ్య టీడీపీ అధినేతకు అవమానం జరిగిందంటూ.. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ టీడీపీ కండువా కప్పుకొన్నారు అనితా దీప్తి. ఇప్పటికే మూడు గ్రూపులు ఆరు పంచాయితీలు అన్నట్టు ఉన్న రైల్వేకోడూరు టీడీపీలో అనితాదీప్తి రాకతో నాలుగు స్తంభాలాటగా మారిపోయింది.
కీలక నేతల మధ్య తారస్థాయిలో విభేదాలు
1999 తర్వాత రైల్వే కోడూరులో టీడీపీ గెలిచింది లేదు. ఆ తర్వాత ప్రతి ఎన్నికలో అభ్యర్థిని మార్చేస్తున్నారు. దీనికితోడు నేతల మధ్య విభేదాలు మైనస్‌గా మారుతున్నాయనేది తమ్ముళ్ల వాదన. ఇంఛార్జ్ విశ్వనాథనాయుడు వెంటే అంతా నడుస్తున్నా.. ఎన్నికల సమయంలో ఆయన పాచికలు పారడం లేదనే టాక్ ఉంది. గత ఎన్నికల్లో ఓడిన నరసింహ ప్రసాద్ టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీలో ఉన్న పలుకుబడితో టికెట్ తెచ్చుకుంటాననే ధీమా ఆయనలో కనిపిస్తోంది. అయితే స్థానికంగా ఉన్న విభేదాలతో ఆయన దూకుడికి బ్రేకులు పడుతున్నాయి. కిందటి ఎన్నికల్లో విశ్వనాథనాయుడు, నరసింహ ప్రసాద్ ఇద్దరూ కలిసి మెలిసి తిరిగారు. ఆ ఎన్నికల తర్వాత ఇద్దరు బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. పైగా నరసింహ ప్రసాద్‌ను దూరం పెడుతున్నారట విశ్వనాథనాయుడు. ఇప్పుడు ఇంఛార్జ్ మద్దతు అనితా దీప్తికే అని ప్రచారం సాగుతోంది.
చిట్వేలులో ఆశావహుల మధ్య ఘర్షణ
తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రైల్వేకోడూరులో టీడీపీ నేతల తీరు పార్టీ వర్గాల్లో చర్చగా మారింది. నియోజకవర్గంలోని చిట్వేలులో ఆశావహుల మధ్య ఘర్షణ పార్టీలోని విభేదాలను రోడ్డుకీడ్చింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసే విషయంలో విశ్వనాథనాయుడు, నరసింహప్రసాద్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. రెండు వర్గాలకు సర్ది చెప్పడానికి పోలీసులు తంటాలు పడ్డారు. పనిలో పనిగా నరసింహప్రసాద్‌పై విరుచుకుపడ్డారు అనితా దీప్తి. ప్రతిగా నరసింహ ప్రసాద్ గట్టిగా కేకలు వేయడం కేడర్‌ను విస్మయ పరిచింది. నేతల మధ్య ఆధిపత్యపోరు తెలుగు తమ్ముళ్లను కలవర పెడుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే ఈ గొడవలేంటి? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. కీలక సమయంలో కలిసి నడిచి.. ఎలక్షన్స్‌లో గట్టిగా పనిచేయకపోతే మళ్లీ గుండు సున్నాయేనని నిట్టూరుస్తోంది టీడీపీ కేడర్.