జమ్మలమడుగు రాజకీయం ఈసారి కొత్త పుంతలు తొక్కబోతోందా? దేవగుడి దంగల్‌లో బాబాయ్, అబ్బాయ్ పరస్పరం తలపడబోతున్నారా? నువ్వా… నేనా అన్న రేంజ్‌లో హీట్ పెంచబోతున్నారా? దీనిపై ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు ఏమంటున్నారు? ఆ ఫ్యామిలీలో గొడవలు పెరిగితే లాభం ఎవరికి? లెట్స్ వాచ్.
టీడీపీలోనే ఉన్న ఆదినారాయణరెడ్డి అన్న నారాయణరెడ్డి
కడప జిల్లా జమ్మలమడుగులో మొదట్నుంచీ డిఫరెంట్ పాలిటిక్స్ ఉన్నాయి. ఇక్కడ రాజకీయ ఆధిపత్యం కోసమే మూడు దశాబ్దాలకు పైగా దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య పోరు నడిచింది. 2014 ఎన్నికల తర్వాత దేవగుడి కుటుంబం వైసీపీ నుంచి టీడీపీలో చేరింది. పాత వైరాన్ని పక్కనబెట్టి రెండు కుటుంబాలు చేతులు కలపడంతో ..ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు అంతా. కానీ… 2019 ఎన్నికల తర్వాత పొలిటికల్ సీన్ మారిపోయింది. రాజీ చేసుకున్నాక టీడీపీలోనే ఉన్న మాజీ మంత్రులు దేవగుడి ఆదినారాయణరెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పార్టీలు మారిపోయారు. పి.రామసుబ్బారెడ్డి కుటుంబం వైసీపీలోకి వెళితే.. ఆదినారాయణరెడ్డి బీజేపీ పంచన చేరారు. ఆయన అన్న, మాజీ ఎమ్మెల్యే దేవగుడి నారాయణరెడ్డి మాత్రం టీడీపీలోనే ఉండిపోయారు. ఈ ఈక్వేషన్సే ఇప్పుడు ఆసక్తికరంగా మారి కొత్త రాజకీయానికి తెరలేపబోతున్నాయి.
జమ్మలమడుగులో దేవగుడి కుటుంబ సభ్యులే తలపడబోతున్నారా?
ఒకరు బీజేపీలో, మరొకరు టీడీపీలో ఉన్నా…దేవగుడి బ్రదర్స్ మధ్య విభేదాలు లేవని అనుకున్నారు అంతా. కానీ… అంత సీన్ లేదన్న విషయం తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్ధం అవుతోంది. ఈసారి జమ్మలమడుగు టీడీపీ టిక్కెట్‌ను నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌కు ఇవ్వాలని నిర్ణయించింది అధినాయకత్వం. ఈ మేరకు క్లారిటీ కూడా ఇచ్చేసింది. బీజేపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి సైతం అప్పట్లో ఈ నిర్ణయంపై పాజిటివ్‌గానే స్పందించారు. కానీ… ఈసారి భూపేష్ టీడీపీ నుంచి పోటీ చేస్తే.. తాను బీజేపీ తరపున బరిలో ఉంటానని ఆయన చేసిన తాజా ప్రకటన ఉత్కంఠ పెంచుతోంది. ఏడాది నుంచే తన పోటీకి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ జనంలో ఉంటున్నారు భూపేష్. దీంతో బాబాయ్ ఆదినారాయణరెడ్డి సైలెంట్ అయి అబ్బాయికి సహకరిస్తారని అనుకున్నారు అంతా. కానీ… ఒక్క ప్రకటనతో సీన్ మొత్తం మారిపోయింది. దేవగుడి కుటుంబ సభ్యుల మధ్యనే పోటీ తప్పదన్న అంచనాలు పెరుగుతున్నాయి.
ఎవరికి మద్దతివ్వాలో అర్ధంగాక దేవగుడి అభిమానులు సతమతం
నారాయణరెడ్డి అయినా…. ఆదినారాయణరెడ్డి అయినా ఒకటేనని అనుకున్నారు ఇన్నాళ్ళు ఆ కుటుంబాన్ని అభిమానించే వారంతా. నియోజకవర్గంలో వాళ్ళ అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. దీంతో ఇప్పుడు ఎవర్ని సపోర్ట్ చేయాలో అర్ధంగాక బుర్రలు గొక్కుంటున్నారట అనుచరగణం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని స్వయంగా ఆదినారాయణరెడ్డే తనకు దగ్గరగా ఉండేవారితో చెబుతున్నారట. నిజంగా అదే జరిగితే.. పొత్తులో సీటు బాబాయ్ తీసుకుంటారా? అబ్బాయ్ తీసుకుంటారా అన్నది మరో ప్రశ్న అట. అదెలా ఉన్నా.. ప్రస్తుతం దేవగుడి ఫ్యామిలీలో ఏర్పడ్డ విభేదాలు వైసీపికి లాభించే అవకాశం లేకపోలేదన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. మొత్తంగా ఈ రాజకీయ కుటుంబంలో ఏర్పడ్డ చిచ్చు చల్లారుతుందా? లేక పెరిగి పెద్దదవుతుందా? అన్నదాన్ని బట్టి జమ్మలమడుగు పొలిటికల్ ముఖ చిత్రం మారుతుందన్నది మాత్రం ఖాయం.