తమది క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెబుతారు బీజేపీ నేతలు. ఒకరిపై ఒకరు ఓపెన్‌గా ఎలాంటి విమర్శలు చేసుకోరు. ఏదైనా నాలుగు గోడల మధ్యే.. లేకపోతే ఢిల్లీ పెద్దల ఎదుట చెప్పాల్సింది చెప్పేస్తారు. కానీ.. తెలంగాణ బీజేపీలో ఈ లక్ష్మణ రేఖ చెరిగిపోయిందని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిని కార్నర్ చేయడానికీ కొందరు కీలక నాయకులు వెనుకాడటం లేదు. ఎందుకలా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
టీ బీజేపీలో ఐక్యత నీటి మీద గీతలేనా?
తెలంగాణలో బీజేపీ బలపడుతోందని.. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తామని ఢిల్లీ నుంచి గల్లీ వరకు లీడర్ల వరకు ఒకే శ్రుతిలో సౌండ్ చేస్తున్నారు. పార్టీలో అంతా కలిసే ఉన్నారని బిల్డప్ ఇస్తున్నారు కూడా. కానీ ఈ ఐక్యతా రాగం నీటి మీద గీతలేననే టాక్ బీజేపీ వర్గాల్లో ఉంది. BRS MLC కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్‌ను బీజేపీ MP ధర్మపురి అరవింద్ ఓపెన్‌గా ఖండించడం.. మరికొందరు నేతలు అరవింద్‌కు శ్రుతి కల్పడం చూస్తుంటే టీబీజేపీలో నేతల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలోనే ఉన్నాయని కాషాయ శిబిరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదన్న అరవింద్
బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించడంతోపాటు.. అరవింద్ చేసిన మరికొన్ని కామెంట్స్ ప్రస్తుతం బీజేపీలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. అధ్యక్ష పదవి అనేది పవర్ సెంటర్ కాదని.. కోఆర్డినేషన్ సెంటర్ అని విశ్లేషించారు అరవింద్. ఈ మాటలే ఇప్పుడు కాషాయ శిబిరంలో వేడి పుట్టించాయి. సంజయ్‌పై అరవింద్ ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడారు? ఇద్దరికి ఎక్కడ గ్యాప్ వచ్చింది? అని కేడర్ ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. బీజేపీలోని విశ్వసనీయ వర్గాల ప్రకారం.. కొంతకాలంగా ఇద్దరికీ పడటం లేదట. పలు అంశాలపై ఒకరు ఎస్ అంటే.. మరొకరు నో అంటున్నారట. బీజేపీలో చేరికల విషయంలోనూ ఇద్దరికీ పడటం లేదని సమాచారం.
బాల్కొండలో సునీల్‌రెడ్డి చేరికపై అరవింద్ అభ్యంతరం..?
బాల్కొండ నియోజకవర్గానికి చెందిన సునీల్‌రెడ్డి చేరికపై సంజయ్, అరవింద్ మధ్య పేచీ నడుస్తోందట. సునీల్‌రెడ్డిని చేర్చుకోవాలని సంజయ్ పట్టుబడితే.. వద్దని ముఖం మీదే చెప్పేశారట అరవింద్. అలాగే జిల్లా బీజేపీ అధ్యక్షుడితోనూ అరవింద్‌కు పడటం లేదట. జిల్లా అధ్యక్షుడిని మార్చాలని సంజయ్‌పై ఒత్తిడి చేస్తున్నారట. జిల్లా ఇంఛార్జ్‌ను మార్చాలని ఎంపీ కోరుతున్నారట. వీటికి తోడు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు ప్రాధాన్యం ఇవ్వడం అరవింద్‌కు నచ్చడం లేదని చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సంజయ్‌పై అరవింద్ ఆ విధంగా మాట్లాడారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అరవింద్ కామెంట్స్‌కు శ్రుతి కలుపుతున్న మరికొందరు బీజేపీ నేతలు
క్రమశిక్షణతో ఉంటారని చెప్పుకొనే బీజేపీలోనే.. పార్టీ నేతలు కట్టు తప్పుతున్నారా అనే అనుమానాలు కేడర్‌లో ఉన్నాయట. అరవిందే ఓపెన్‌గా సంజయ్‌పై విమర్శలు చేయడంతో.. మరికొందరు టోన్ పెంచేశారు. విజయశాంతి లాంటి వాళ్లు మాత్రం ఈ అంశంపై పార్టీ సమావేశాల్లోనే మాట్లాడతానని చెప్పుకొచ్చారు. మొత్తానికి రాష్ట్ర నేతలతో అమిత్ షా మాట్లాడి వెళ్లిన రోజునే బీజేపీలో కలకలం రేగింది. ఇటీవల ఢిల్లీ సమావేశంలో అమిత్ షా కొందరికి వార్నింగ్ ఇచ్చారని ప్రచారం సాగింది. అయినప్పటికీ నేతలు గీత దాటడంపై ఢిల్లీ పెద్దల రియాక్షన్ ఏంటో కాలమే చెప్పాలి.