అంతా తూచ్ తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని ఆ ఇద్దరు నేతలు ప్రకటించారు. అంతా సోషల్ మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. పార్టీ కోసం పని చేస్తున్నామని అన్నారు. ఎందుకు ఆ ఇద్దరు నాయకులు ఇంతలా చెబుతున్నారు? నిప్పు లేందే పొగరాదా?.
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలంగాణ భారతీయ జనతా పార్టీలోనూ నేతల ప్రచ్చన్నయుద్దాలు కొత్తేమీ కాదు. లుకలుకలు…లకలకలు అప్పుడప్పుడు కేక పెడుతుంటాయి. కొంతమంది ముఖ్య నేతల మధ్య అసలేమాత్రం పొసగడం లేదని పార్టీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న టాక్. నేతల మధ్య సమన్వయం లేదు, సమిష్టి తత్వం లేదని పార్టీ వర్గాలే అంటుంటాయి. పైకి బాగా మాట్లాడినా..లోపల మాత్రం అంతా ఓకే కాదని గుసగుసలాడుతుంటాయి. ఎంపీ ఈటెల రాజేందర్‌కు, కేంద్రమంత్రి బండి సంజయ్ కు మధ్య గ్యాప్ ఉందని… ఇద్దరికీ అస్సలు పడటం లేదన్నది బహిరంగ రహస్యమే. గతంలో డైరెక్టుగానో, ఇండైరెక్ట్ గానో ఒకరిపై ఒకరు కామెంట్స్ కూడా చేసుకున్నారు. రీసెంట్ గా తెలంగాణలో మతం, కులం పరంగా విభజన రాజకీయాలు నడవవు అని ఈటెల రాజేందర్ అంటే… హిందువుల కోసం నా చివరి శ్వాస వరకు పోరాటం చేస్తానని…బీజేపీ మూల సిద్ధాంతమే హిందుత్వ అని బండి సంజయ్ అన్నారు. ఒకరిపై మరొకరు కౌంటర్ ఇచ్చుకున్నారని అందరూ అనుకున్నారు. మరోసారి ఇరువురి విభేదాలు రచ్చకెక్కాయని కూడా మాట్లాడుకున్నారు.
ఈటల రాజేందర్, బండి కామెంట్ల యాక్షన్, రియాక్షన్ పరిణామాలపై స్వయంగా వారినే అడిగితే..తూచ్ తమ మధ్య విభేదాలేం లేవని ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పని చేసి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ఈటెల రాజేందర్ చెప్పారు. హుజూరాబాద్ సమావేశానికి తనకు సమాచారం వుందని…వ్యక్తిగత కారణాలతో రాలేకపోయానని వివరణ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య విభేధాలు సోషల్ మీడియా సృష్టేనని బదులిచ్చారు ఈటల రాజేందర్.
బండి సంజయ్ కూడా ఇదే మాట అన్నారు. తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాల్లేవని ప్రకటించారు. అవ్వన్నీ ఒట్టి పుకార్లని కొట్టివేశారు. పార్టీ బలోపేతం కోసం పని చేస్తామని చెప్పారు. తన మీద అలాంటి అభిప్రాయం ఉంటే మార్చుకోవాలన్నారు. వినడానికి ఇద్దరి వివరణలు, ప్రకటనలు బాగానే వున్నాయి. మరి అప్పుడప్పుడు కామెంట్లు, కౌంటర్‌లు ఎందుకని కార్యకర్తలు అంటున్నారు. ఒకవేళ వీరు చెప్పేదే నిజమనుకున్నా…ఈ సఖ్యత మాటలకే పరిమితం అవుతుందా…చేతల్లో కూడా కనిపిస్తుందా అన్నది చూడాలంటున్నారు పార్టీ నేతలు.