Off The Record: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ లీడర్స్ చేసిన తాజా కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. తాము తిరిగి అధికారంలోకి వస్తే… జగన్ అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారంటూ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.. సజ్జల లాంటి నాయకుడు మాట్లాడారంటే.. అవి పార్టీ అధినేత జగన్ నోటి నుంచి వచ్చిన మాటల్లాగే భావించాల్సి ఉంటుందన్నదన్న అభిప్రాయం ఉంది. సజ్జల వ్యాఖ్యల ద్వారా… తాము మొదటి నుంచి అమరావతికి వ్యతిరేకం కాదు, రాజధాని నిర్మాణాల పేరిట లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి జనం మీద ఆర్దిక భారం వేయటాన్నే వ్యతిరేకిస్తున్నామన్న ఇండికేషన్ ఇచ్చింది వైసీపీ. నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్దితిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే మూడు రాజధానుల ప్రతిపాదన చేశామని కూడా పార్టీ అధిష్టానం స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు రాజధానిని నిర్మించాలనుకుంటున్నారా.. లేక ఒక మహానగరాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా అంటూ క్వశ్చన్ రైజ్ చేసిన వైసీపీ… గుంటూరు, విజయవాడ మధ్యలో రాజధాని నిర్మాణం జరిగితే ఖర్చు కూడా తగ్గుతుందని వాదిస్తోంది. అప్పు చేసి పప్పుకూడు కాకుండా… కేంద్రం నుంచి గ్రాంట్ తెచ్చుకుని రాజధాని నిర్మించడానికి మేం వ్యతిరేకం కాదని క్లారిటీ ఇస్తోంది ఫ్యాన్ పార్టీ.
Read Also: Moolakona Mystery: ఆస్తి కోసమా.. పరువు కోసమా? మూలకోన అటవీ ప్రాంతంలో మిస్టరీ డెత్స్ కలకలం..
మీకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది కాబట్టి ప్రజలపై భారం పడకుండా రాజధాని నిర్మాణం చేపడితే మాకు మరో ఆలోచన ఉండదంటూ… బాల్‌ను టీడీపీ కోర్ట్ లోకి నెట్టింది వైసీపీ. తొలి విడత పనులు 2036 లో పూర్తవుతాయని చెప్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమల పేరు చెప్పి మరోసారి 44 వేల భూ సమీకరణకు సిద్ధమవుతోందని, కొత్తగా సమీకరించే భూముల్లో కూడా కలిపి అభివృద్ది పనులు చేయాటంటే ఖర్చు 3 లక్షల కోట్లకు చేరి ప్రజలపై పెనుభారం పడుతుందన్నది ప్రతిపక్షం వాదన. దీంతో… వైసీపీ పాడుతున్న కొత్త పాట ఆ పార్టీకి లాభమా? నష్టమా? అన్న చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. ఎన్నికలకు ముందు మూడు రాజధానుల పేరుతో డ్యామేజ్ అయిన పార్టీ…. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఈసారి అమరావతి విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండవచ్చని భావిస్తున్నారు. అమరావతి ఇలాగే ఉంటే… కేవలం ఒక మునిసిపాలిటీగా మిగిలి పోతుందని, విజయవాడ, గుంటూరు, తెనాలిని కలిపి మహా నగరాన్ని నిర్మించాలంటూ ఇటీవల తరచూ సీఎం చెబుతున్నారంటూ గుర్తు చేస్తున్నారు వైసీపీ లీడర్స్. ఆ పేరుతో లక్షల కోట్ల అప్పు చేస్తే… చివరికి ఆ బరువు పన్నుల రూపంలో ప్రజలపైనే పడుతుందన్నది ఫ్యాన్ పార్టీ వాదన. దానికి బదులు ఇప్పటికే కొంతమేర మౌలిక వసతులున్న గుంటూరు, విజయవాడల మధ్య రాజధానిని కొనసాగిస్తే వ్యయభారం గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు అపోజిషన్ పెద్దలు.
Read Also: Hamas Leadership: అజ్ఞాతంలోకి హమాస్ అగ్రనాయకత్వం.. ఆ ముగ్గురు ఎక్కడ?..
అమరావతి అన్నప్పుడల్లా… టీడీపీ తమను బూచిగా చూపిస్తోందని, ఇప్పుడు విజయవాడ-గుంటూరు మధ్య అని ప్రతిపాదించడం ద్వారా ఇక దానికి చెక్ పెట్టాలని కూడా భావిస్తున్నారట వైసీపీ పెద్దలు. భారీగా అప్పులు చేసి.. రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడంకంటే.. ఇప్పటికే ఉన్న వసతులతో ముందుకు వెళ్ళడం మేలని, సీఎం దీనిపై దృష్టి పెట్టాలని చెప్పటం ద్వారా.. రేపు జరగబోయే పరిణామాలకు టీడీపీనే బాధ్యత తీసుకోవాలని క్లారిటీ ఇచ్చేసినట్టయిందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే… ఇందులో మిగతా వ్యవహారాల మాట ఎలా ఉన్నా… ప్రతిపక్ష పార్టీ మాత్రం డ్యామేజ్ కంట్రోల్ పాలిటిక్స్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. అటు టీడీపీ సైడ్ నుంచి కూడా వైసీపీకి గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. అమరావతి విషయంలో మభ్యపెట్టే మాటలు చెబుతోందంటూ ఫైర్ అవుతున్నారు అధికార పార్టీ నాయకులు. రాజధాని మీద ఇప్పటికీ వైసీపీ కుట్రలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు టీడీపీ లీడర్స్. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. మరి అమరావతి విషయంలో వైసీపీ తీసుకున్న కొత్త స్టాండ్ ఆ పార్టీకి పొలిటికల్‌గా కలసి వస్తుందా..? లేక మభ్యపెట్టే మాటలన్న టీడీపీ ప్రచారాన్నే జనం నమ్ముతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.