Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో MLC ఎన్నికల కోలాహలం నెలకొంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల సమరం రంజుగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు ప్రధాన పార్టీలకు ఛాలెంజ్ విసురుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటరు నాడిని పసిగట్టేందుకు ఈ పోటీ చాలా కీలకంగా భావిస్తున్నాయి పార్టీలు. అందుకే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఉత్తరాంధ్ర పట్టభద్రుల సీటు. తొలిసారి ఈ ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ పోటీ చేస్తోంది. గత సంప్రదాయాలకు భిన్నంగా 6 నెలల ముందే అభ్యర్థిని ప్రకటించింది కూడా. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ అభ్యర్థి. పెద్దఎత్తున ఓటర్ల నమోదు చేసింది వైసీపీ. ముఖ్య నాయకులు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ.. గెలుపు అనుకున్నంత ఈజీ కాదనేది మారుతున్న పరిణామాలతో తెలుస్తోంది. బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి రావడమే దీనికి కారణం.
Read Also: Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌ను అధిష్టానం పక్కన పెట్టిందా..? నేతల్లో అసంతృప్తి అందుకేనా..!
టీచర్లలో పట్టున్న వేపాడ చిరంజీవిని టీడీపీ తెరమీదకు తెచ్చింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది. వామపక్ష, ప్రజాసంఘాల మద్దతుతో పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు బలమైన ఓట్ బ్యాంక్ కనిపిస్తోంది. సిట్టింగ్ సీట్‌పై ఆశ పెట్టుకున్న బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి పీవీఎన్ మాధవ్ ఫోకస్ సాంప్రదాయ ఓటర్లపై ఉంది. వైసీపీ అభ్యర్థి సీతంరాజుకు సొంత ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. సుమారు 2 లక్షల 80 వేల ఓటర్లు ఉంటే.. వీరిలో మొదటి ప్రాధాన్యం ఓటును ఆకర్షించడమే కీలకం. ఇందుకు పెద్ద కసరత్తు అవసరమనేది నేతల భావన. ఫలితం సానుకూలంగా లేకపోతే సహించేది లేదని హైకమాండ్ స్పష్టంగా చెప్పడంతో అలర్ట్ అయ్యారు వైసీపీ నేతలు.
Read Also: Off The Record: తెలంగాణ బీజేపీలో అలజడి..? ఆపరేషన్ వికర్ష్ వలలో బీజేపీ నేతలు?
ఉత్తరాంధ్ర వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల చాలా కీలకంగా మారిపోయింది. వైసీపీ ఉమ్మడి జిల్లాల సమన్వకర్తగా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టాక ఇక్కడ జరుగుతున్న ఎన్నిక. అప్పట్లో సమన్వయంతోనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పాగా వేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలను ఏకపక్షం చేయాలనేది ఆలోచన. గతంలో సమస్యలపై చర్చించేందుకు కొన్ని గంటలు మహా అయితే ఒకటి రెండు రోజులు వైజాగ్‌లో ఉండేవారు వైవీ. MLC ఎన్నికలు కావడంతో ఎక్కువ రోజులు ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు. కీలక నేతలు మోహరిస్తుండటంతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల MLC స్థానానికి వైసీపీ హైకమాండ్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. దీంతో వైసీపీ MLC అభ్యర్థిని గెలిపించే విషయంలో ఈ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల్లో ఎవరికెన్ని మార్కులు పడతాయో అనే చర్చ సాగుతోంది.