ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు…పులివెందులలో జగన్ తర్వాత భారీ మెజార్టీతో గెలిచారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. కొన్నాళ్లకు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలతో పేచీలు వచ్చాయి.. దీంతో ఆ నియోజక వర్గంలో ఎమ్మెల్యే అన్నా అనుకూల, వ్యతిరేక గ్రూపులుగా వైసీపీ కేడర్ విడిపోయింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా రాంబాబు…ముందుగా ప్రారంభించలేకపోయారు. అధిష్టానం జోక్యంతో ఎట్టకేలకు ప్రారంభించారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారిని కాదని…తన వెంట టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనేది వ్యతిరేకవర్గం ఆరోపణ.
Read Also: Off The Record: వంగవీటి చుట్టూ బెజవాడ రాజకీయం.. మళ్లీ సేమ్ సీన్..!
మండలాల్లో తమకు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని… కనీసం తమను సంప్రదించకుండా అన్నీ పనులు తనకు నచ్చిన వారి ద్వారా చక్కబెట్టుకుంటున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఎమ్మెల్యే వైఖరితో విసిగిపోయి…ఇప్పటికే కొందరు టీడీపీలో చేరారు. ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ వారిని…బూతులు తిడుతూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసుకుంటున్నారు. గతంలో రోడ్డు బాగాలేదని చెప్పేందుకు వచ్చిన ఓ జనసేన కార్తకర్తను బూతులు తిట్టడం.. ఆ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడటం.. చిన్న విషయం కాస్తా నానా రచ్చ కావటంతో వైసీపీ అధిష్టానంతో అక్షింతలు వేయించుకున్నారు. ఇంటాబయట అసంతృప్తి, అసమ్మతితో సహనం కోల్పోయిన ఎమ్మెల్యేలు…ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లుంది.
సొంత పార్టీలోని ప్రత్యర్దులను ఉద్దేశించి…అన్నా మాట్లాడిన బూతు పంచాంగం వైరల్ కావటంతో కొత్త చిక్కులు తీసుకు వచ్చాయట. బేస్తవారిపేటలో వాలంటీర్లు, పార్టీ కన్వీనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో…పార్టీలోని అసమ్మతివాదులను హెచ్చరిస్తూ చేసిన ప్రసంగం సంచలనం సృష్ట్టించిందట. తనను వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతల అంతు చూస్తానని… పబ్లిక్ మీటింగ్‌లో వార్నింగ్ ఇచ్చారు. తన సామాజికవర్గాన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని.. అసమ్మతి పేరుతో హడావుడి చేస్తున్న వారంతా తన కాలిగోటికి కూడా సరిపోరని అంటూ అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. నాకు మీసం…రోషం… తేల్చుకుందాం కొడకల్లారా అంటూ అసభ్య పదజాలంతో విచక్షణ కోల్పోయి మాట్లాడారు. దీంతో ఈ వ్యవహారం కాస్త రచ్చ రచ్చగా మారిందట.
అసలు అన్నా రాంబాబు ఆగ్రహం ఎవరి మీద.. ఎందుకు ఆయన అంతలా ఫైర్ అయ్యారు.. అంతలా ఆయన్ను ఇబ్బంది పెట్టింది ఎవరు.. ఎవరికి ఆయన ఆ వార్నింగ్ ఇచ్చారని ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ లా మారిందట. కొందరు వైసీపీ అసమ్మతి నేతలు ఓ రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారట.. గిద్దలూరు, కొమరోలు, బేస్తవారిపేటకు చెందిన పలు పదవుల్లో ఉన్న వైసీపీ అసమ్మతి నేతలు 20 మంది వరకూ ఈ సమావేశానికి హాజరయ్యారట. ఎమ్మెల్యే వైఖరి మారే అవకాశం లేనందున ఆయనతో కలసి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే చాలా మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి వెళ్లారని.. పరిస్దితి ఇలాగే కొనసాగితే తాము పార్టీ మారేందుకు వెనుకాడేది లేదని ఫిక్సయ్యారట. ఇదే విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. ఎమ్మెల్యే రాంబాబు విషయంలో అధిష్ఠానం ఏదో ఒకటి తేల్చాలని…స్పష్టత రాకుంటే మూకుమ్మడి నిర్ణయాలు తీసుకుంటామని రాయబారం పంపారట. అందుకే ఎమ్మెల్యే మండిందట. ఓ వైపు అసమ్మతి నేతల హడావుడి.. మరోవైపు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వార్నింగ్‌లతో నియోజకవర్గంలో వైసీపీ పరిస్దితి గందరగోళంగా తయారైందట. అన్నా రాంబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి ? గిద్దలూరులో పట్టునిలుపుకోవడానికి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.