Off The Record: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం కంటే ఎక్కువగా… వలసల మీదే ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోందట. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక వన్ బై వన్ కీలక నేతలు సైతం బైబై చెబుతుండటం, అందుకు అధిష్టానం నుంచి కనీస స్పందన లేకపోవడం గురించి నాయకులంతా తెగ చెవులు కొరికేసుకుంటున్నట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాని, మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు లాంటి ముఖ్య నాయకులతోపాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా పదవులకు రాజీనామా చేసి మరీ గుడ్‌బై కొట్టేశారు. తాజాగా అదే లిస్ట్‌లో మర్రి రాజశేఖర్ చేరటంతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. అటు ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్స్ జంప్‌అయిపోతూ మున్సిపాలిటీలు చేజారుతుండగా… ఇటు ఎమ్మెల్సీలు కూడా క్యూ కట్టడం పార్టీ వర్గాలను కలవర పెడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో విజయసాయిరెడ్డి, బాలినేని, మోపిదేవి, ఆళ్లనాని వంటి నేతలు బయటకు వెళ్లిన సందర్బంలో కూడా పార్టీ అధినేత జగన్ సైలెంట్‌గానే ఉన్నారు. అయితే… అప్పట్లోనే వాళ్లని పిలిచి బుజ్జగిస్తే బాగుండేదన్న చర్చ జరిగిందట పార్టీలో. బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వెళ్లినప్పుడైతే… వెళ్లేవాళ్లను వెళ్లనీయండబ్బా… ఉన్న వాళ్లతోనే రాజకీయం చేసుకుంటానని జగన్ అన్నట్టు ప్రచారం జరిగింది.
తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామాపై కూడా ఇదే తరహా చర్చ జరుగుతోందంటున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పేట నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారాయన. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2010లో వైసీపీ జెండా పట్టుకుని 14లో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు మర్రి. ఆ తరువాత ఉమ్మడి గుంటూరు జిల్లా వైసిపి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత మారిపోయిన సమీకరణాలతో…2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు విడదల రజని. అప్పుడు రజనీకి టికెట్ ఇవ్వడాన్ని మర్రి రాజశేఖర్ తీవ్రంగా వ్యతిరేకించడంతో… ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు జగన్. ఆ ప్రకారమే అవకాశం దక్కింది. ఇక 2024 ఎన్నికల ప్రయోగాల్లో భాగంగా విడదల రజనీని గుంటూరు పంపడం, అక్కడ ఆమె, రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడం, తర్వాత రజనీకి తిరిగి పేట ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం వరుసగా జరిగిన పరిణామాలు. ఇక్కడే మర్రికి మండిపోయిందట. చిలకలూరిపేట వైసీపీలో తనకు ఇబ్బందికరంగా మారిన రజనీ వెళ్ళిపోయారని అనుకుంటున్న టైంలో… ఆమెను తిరిగి అక్కడికే తీసుకురావడంపై మర్రి తీవ్ర అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి పార్టీ మార్పు ప్రచారం మొదలైనా…. చివరికి ఇప్పుడు నిజమైంది. వైసీపీకి రాజీనామా చేసిన మరుసటి రోజే తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు రాజశేఖర్.
అయితే.. పార్టీలో మొదట్నుంచి ఉన్న నాయకుడు రాజీనామా చేసినా సరే… అధిష్టానం తరపున ఆయన ఇబ్బంది ఏంటని అడిగినవారే లేరంటూ అసెంబ్లీ ఆవరణలో కొందరు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు మాట్లాడుకున్నట్లు సమాచారం. రాజీనామా చేస్తున్న.. చేసినవారితో అధిష్ఠాన పెద్దలు మాట్లాడరు, కనీసం వాళ్ళకు పార్టీలో ఎవరితో సాన్నిహిత్యం ఉందో చూసి మాట్లాడించే ప్రయత్నమూ చేయరు, ఇంట్లో ఒకరు ఇబ్బంది పడుతుంటే… ఏమైందని మిగతా వాళ్ళం తెలుసుకుంటాం…. పరిష్కరిం చుకుంటాం. కానీ.. పార్టీని మన అని భావించే వాళ్ళకు కష్టం కలిగి వెళ్ళిపోతామంటే… కనీసం మాట్లాడించి ఎందుకని అడిగే దిక్కు లేకపోవడం దారుణమని చర్చించుకువన్నారట సదరు వైసీపీ ఎమ్మెల్సీలు. అయితే… మర్రి రాజశేఖర్ విషయంలో అధిష్టానంతో సంబంధం లేకుండా ఒకరిద్దరు నాయకులు మాట్లాడి చూసినా… ఇక ఉండబోనని ఆయన చెప్పినట్టు సమాచారం.
విడదల రజనీ రీఎంట్రీతో పార్టీపై అసంతృప్తిగా ఉన్న మర్రి తన వ్యూహం మార్చుకున్నారట. 2029 ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలన్న టార్గెట్‌తో.. టీడీపీతో సంప్రదింపులు జరిపి అట్నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమల్లో పెట్టినట్టు తెలిసింది. ఇక్కడే వైసీపీ అదిష్టానం కూడా తన వాదన వినిపిస్తోందట. మొత్తం క్లారిటీ తెచ్చుకున్నాకే వాళ్ళు పార్టీ వదిలి వెళ్తున్నారని, పూర్తిగా డిసైడైన వాళ్ళను ఆపితే మాత్రం ఆగుతారా అన్నది ఫ్యాన్ పెద్దల క్వశ్చన్ అట. అటు అధినేత జగన్ కూడా… పార్టీలో వారికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇచ్చామని.. అధికారం లేకపోవటంతో ఏరు దాటాక ఏవో మాటలు మాట్లాడి.. బయటకు వెళ్తున్నారే తప్ప ప్రాధాన్యత లేక కాదన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. మరి పార్టీ నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలోఅధినేత వైఖరిలో మార్పు వస్తుందా.. వైసీపీలో కూడా బుజ్జగింపులు చూడొచ్చా అన్నది తెలియాలంటే… ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.