Off The Record: వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇటీవల తరచూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్నారు. రెగ్యులర్‌గా జరుగుతున్న పరామర్శ యాత్రల్లో భద్రతా వైఫల్యాలు బయటపడటం, వాటిని వైసీపీ శ్రేణులు హైలైట్ చేసి చూపడం కామన్ అవుతోంది. గుంటూరు, రాప్తాడు, పొదిలి, సత్తెనపల్లి పర్యటనలన్నీ వివాదాస్పదం అవడంపై ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఆ సందర్భాల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగాయంటూ పోలీసులు కేసులు నమోదు చేయటం.. అసలు ఓ మాజీ సీఎం స్థాయిలో ఇవ్వాల్సిన జడ్ ప్లస్ సెక్యూరిటీని ఇవ్వకపోవడం వల్లే అలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైసీపీ కౌంటర్స్ ఇవ్వటం షరా మామూలు అన్నట్టుగా మారిపోయింది. ఈ పరిణామ క్రమంలోనే.. జగన్ సత్తెనపల్లి పర్యటన అత్యంత వివాదాస్పదమైంది. ఆయన ఉన్న కారు కిందపడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడంటూ… ఆ కేసులో వైసీపీ అధ్యక్షుడిని నిందితుడిగా చేర్చడం పొలిటికల్ కలకలం రేపుతోంది. దీంతో తమ అధినేతకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించక పోవడం వల్లే అలా జరిగిందని వైసీపీ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. జగన్ కూడా తన పర్యటనలలో భద్రతా వైఫల్యాలపై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నిస్తూ ఎక్స్‌లో మెసేజ్ పెట్టారు.
Read Also: Manchu Vishnu : పవన్ కు కన్నప్ప అప్పుడే చూపిస్తా.. విష్ణు కామెంట్స్..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా తన భద్రత తగ్గించారని ఆరోపిస్తున్నారు జగన్. తన పర్యటనల సమయంలో కేంద్ర భద్రతా సంస్థలైన ఎన్‌ఎస్‌జీ, సీఆర్పీఎఫ్‌లతో జడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరుతూ మొన్న మేలో కోర్ట్‌కు వెళ్ళారు మాజీ సీఎం. ఆయనకు తగినంత భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే… రాష్ట్ర ప్రభుత్వం జగన్‌కు భద్రత కల్పించలేదన్న వాదనలో నిజం లేదని కోర్ట్‌కు తెలిపారు ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది. ప్రస్తుతం ఆయనకు 58 మందితో భద్రత కల్పిస్తున్నామని వివరించారు. అప్పట్లో ఇరువర్గాల వాదనలు విన్న కోర్ట్ విచారణను వాయిదా వేసింది. అదే కేసుకు సంబంధించి తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక నివేదిక ఇచ్చింది. జగన్ భద్రతకు ఎలాంటి ముప్పు లేదన్నది ఆ నివేదిక సారాంశం. కేంద్ర ప్రభుత్వ కౌంటర్ తో పాటు ఐబి నివేదికను కూడా జత చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి… ఈ కేసు విచారణను జులై 15కు వాయిదా వేశారు. అదలా ఉంటే…. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.
Read Also: Fake Gold Scam: తక్కువ ధరికే బంగారం ఇప్పిస్తామని భారీ మోసం.. ఏకంగా రూ. 65 లక్షలు స్వాహా..!
తాడేపల్లిలోని జగన్ ఇంటి దగ్గర తరచూ ఏదో ఒక ఘటన జరుగుతుండటాన్ని కూడా ప్రస్తావిస్తున్నారట వాళ్ళు. గతంలో అక్కడ వరుసగా జరిగిన అగ్ని ప్రమాదాలు సహా… తాజాగా ఇద్దరు యువకులు ఆ ఇంటి మీదికి తాటికాయలు విసిరిన ఘటనలను కూడా ఉదహరిస్తున్నారట. అటు క్షేత్రస్థాయి పర్యటనల సమయంలోభారీగా వస్తున్న క్రౌడ్‌లో అసాంఘిక శక్తులు కలిస్తే జగన్ ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందన్నది వైసీపీ కేడర్ ఆందోళనగా చెప్పుకుంటున్నారు. అందుకే ఆయనకు జడ్ ప్లస్ భద్రత కల్పించాలన్నది వాళ్ళ డిమాండ్ అట. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి కూటమి ప్రభుత్వం జగన్ పర్యటనలకు సంబంధించి వ్యతిరేక నివేదికలు పంపటం వల్లే కేంద్రం నుంచి అంతా బాగుందన్న రిపోర్ట్ వచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారట. అందుకే తమ పార్టీ అధ్యక్షుడి పర్యటనల్లో భద్రతాలోపాల ఆధారాలతో ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించే అవకాశాలను పరిశీలిస్తున్నారట వైసీపీ కీలక నాయకులు. రాష్ట్రంలోని పరిణమాలను నేరుగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్తే… ప్రయోజనం ఉంటుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అలా నేరుగా వెళ్తే కేంద్రం రియాక్షన్ ఎలా ఉంటుంది? కోర్ట్ తీర్పు ఎలా రాబోతోందని ఉత్కంఠగా చూస్తున్నాయి వైసీపీ శ్రేణులు.