Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణలో కచ్చితంగా అవకాశం దక్కి తీరుతుందని అనుకున్న వాళ్ళు ఐదుగురు. అవకాశం దక్కింది ముగ్గురికి. కానీ… ఈ ఆశించిన ఐదుగురిలో ఎవరూ ఆ ముగ్గురిలో లేరు. దీంతో ఇప్పుడు పార్టీలో కొత్త చర్చ మొదలైంది. వాళ్ళంతా… తాత్కాలికంగా సైలెంట్ అయ్యారా..? వాళ్ళకు ఏ పదవులు ఇచ్చి నచ్చచెప్తారంటూ తెగ గుసగుసలాడేసుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రి పదవులు ఆశించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు.. మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లాంటి వాళ్ళంతా ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారట. తమకు పదవులు రావడం ఖాయమని అనుకున్నా…. ఏ ఒక్కరికీ టిక్ పడకపోవడం ఏంటో అర్ధంగాక సతమతం అవుతున్నారట. అయితే… ఖాళీగా ఉన్న మంత్రి పదవులు ఆరు. పోటీ పడుతున్న వాళ్లేమో డజన్‌కు పైగా ఉన్నారు. అది కూడా.. ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉండటం పార్టీకి సమస్యగా మారినట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Dil Raju: నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్!
సామాజిక సమీకరణాల కూర్పులో రెడ్లకు ఇప్పటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు కూడా ఆ సామాజిక వర్గం నుండే పోటీ దారులు పెరిగిపోవడంతో… అధిష్టానం ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి ఉండవచ్చన్న విశ్లేషణలున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యామ్నాయ పదవి కోసం పార్టీ ఆలోచన చేసినా… అందుకు ఆయన అంగీకరించే పరిస్థితి లేదు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు కోసం ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డికి వచ్చే క్యాబినెట్ విస్తరణలో అయినా… అవకాశం దక్కుతుందా అన్న క్లారిటీ లేదు. కానీ… మిగిలిన మూడు మంత్రుల పదవుల భర్తీలో ఒకటి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డి విషయంలో నల్గొండ జిల్లాకి అవకాశం ఇవ్వాల్సి వచ్చినా… ఇప్పటికే అక్కడ ఉన్న మంత్రులు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం వారే. తిరిగి అదే సామాజిక వర్గం నుంచి మరో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువని అంటున్నారు. జిల్లా నుంచి ఎవరినో ఒకరిని తప్పిస్తే తప్ప… ఆయనకు వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉండకపోవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం.
Read Also: Extramarital Affair: ప్రియుడితోనే ఉంటా, నువ్ చచ్చిపో అన్న భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!
ఇక మరో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి విషయానికొస్తే…. ఆయనకి చీఫ్ విప్ పదవి ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కానీ అందుకు ఆయన సుముఖంగా లేరట. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఆ జిల్లా నుంచి వివేక్‌కి అవకాశం కల్పించడంతో… తీవ్రంగా రగిలిపోతున్నారట ప్రేమ్ సాగర్‌రావు. మంత్రి పదవి తప్ప ఇంకేది ఇచ్చినా నాకొద్దని ఆయన సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. అయితే ఆయన భార్యకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ…అట్నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ఇక మిగిలింది బాలు నాయక్. క్యాబినెట్లో చోటు దక్కుతుందని ఎంతో ఆశగా ఉన్నారు దేవరకొండ ఎమ్మెల్యే. కానీ… ఒకే జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ ఇద్దరూ పోటీ పడడంతో క్యాబినెట్ కూర్పు కష్టంగా మారినట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Nadendla Manohar: కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్‌ది కీలక పాత్ర.. జనసేనకు ఎక్కువ బాధ్యత ఉంది..!
ఈ క్రమంలో ఇటీవల ఎస్టీ ఎమ్మెల్యేలంతా రహస్యంగా భేటీ అయి… మంత్రివర్గంలో గిరిజనులు అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేయాలని కూడా నిర్ణయించుకున్నారట. బాలు నాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టాలని జరిగిన ప్రయత్నంపై గిరిజన నేతలంతా అసంతృప్తిగా ఉన్నారట. దీంతో మిగిలిన మూడు పదవుల్లోనైనా బాలుకు ఛాన్స్ దక్కుతుందా అన్న చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి బాలు నాయక్ కాస్త సన్నిహితంగానే ఉంటారు. కానీ… ఆయనకు పదవిపై జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం ఉంది. అయితే సీఎం అనుకుంటే గిరిజన కోటాలో తనకు మంత్రి పదవి రావడం ఖాయమన్న ఫీలింగ్‌లో ఉన్నారు బాలు నాయక్. ఈ పరిస్థితుల్లో రకరకాల ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచిస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. విప్..చీఫ్ విప్ పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో… ఎవరికి ఏం ఆఫర్స్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.