Off The Record: సంగారెడ్డి జిల్లా నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ పోస్ట్ మొన్న మే 31న ఖాళీ అయింది. అప్పటిదాకా ఎస్ఈగా పని చేసిన యేసయ్య పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది కుర్చీ. అదేం పెద్ద విషయం కాదుగానీ… అందులో కూర్చునేందుకు ఆఫీసర్స్ అంతా భయపడటమే ఇప్పుడు అసలు సమస్య. పిలిచి ఎస్‌ఈ పోస్ట్ ఇస్తామన్నా… ఆసక్తి చూపడం లేదట అధికారులు. మాకొద్దు బాబోయ్…. ఆ సీటు అంటున్నట్టు తెలుస్తోంది. చివరికి ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకోమన్నా… దండం పెట్టేస్తున్నట్టు సమాచారం. ఇదే ఆఫీస్‌లో పనిచేస్తున్న ఓ అధికారిని ఇన్ఛార్జ్‌గా నియమించాలని భావించినా… ఆయన కూడా ఆ సీట్లో కూర్చుని పనిచేసేందుకు ఆసక్తి చూపలేదంటున్నారు. కాదు కూడదు… బాధ్యత తీసుకోవాల్సిందేనని వత్తిడి చేస్తే మాత్రం… నేను సెలవు పెట్టి వెళ్లిపోతానని అన్నారట సదరు అదికారి. దీంతో ప్రస్తుతం జిల్లాలోని వివిధ డివిజన్లలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. సంగారెడ్డి, నారాయణఖేడ్ డివిజన్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లలో ఒకరికి ఈ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు.
Read Also: Minister Nara Lokesh: అర్థమైందా రాజా..? మంత్రి లోకేష్ కౌంటర్ ట్వీట్..
అయితే ఈ విషయం తెలిసిన అధికారులు హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ చేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో వీళ్ళంతా అసలెందుకు అంతలా భయపడుతున్నారు? సంగారెడ్డి ఎస్‌ఈ కుర్చీలో అసలేముందన్న చర్చ మొదలైంది. నీటి పారుదల శాఖలోనే ఎస్ఈ అంటే పెద్ద పోస్ట్. అలాంటి పోస్ట్‌ని ఆఫీసర్స్ ఎందుకు వద్దంటున్నారని అంటే… రాజకీయ ఒత్తిళ్ళేనన్నది ఉద్యోగ వర్గాల మాట. జిల్లాలో చెరువులు, కుంటలు ఎక్కువగా ఉన్నాయి. పటాన్ చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో వీటితో పాటు నాలాల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టే విషయంలో… నీటిపారుదలశాఖ అధికారుల మీద తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయట. ప్రధానంగా చెరువులు, కుంటలకు ఎన్ఓసీల జారీల విషయంలో ఒత్తిళ్లు తీవ్రమవుతున్నట్టు సమాచారం. మరోవైపు చెరువుల్లో మట్టి తవ్వకాల అనుమతుల కోసం కూడా ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు వస్తుంటాయి. గుమ్మడిదల ఏఈగా పనిచేస్తున్న అధికారిని ఇటీవల ఏసీబీ ట్రాప్ చేసింది. ఓ నిర్మాణానికి ఎన్ఎసీ జారీ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరో అధికారిపై ఆరోపణలు రావడంతో బదిలీ వేటు పడింది.
Read Also: Health Tips: అవసరానికి మించి నడుస్తున్నారా?.. ఈ సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే!
ఇలా నీటిపా రుదల శాఖలో అధికారుల తీరు చర్చనీయాంశంగా మారుతున్న క్రమంలో… ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ… ఎస్ఈ పోస్టులోకి వచ్చేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఓ వైపు అధికారులపై చర్యలు, మరో వైపు రాజకీయ ఒత్తిళ్ళతో ఆ పోస్ట్ అంటేనే అమ్మో బాబోయ్ అంటున్నారట. దీంతో మళ్ళీ జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళకే బాధ్యతలు ఇస్తారా..? లేదా పక్క జిల్లాలో పనిచేస్తున్న అధికారిని ఇక్కడికి బదిలీ చేస్తారా అని చూస్తున్నాయి అధికార వర్గాలు. ప్రస్తుతం నీటి పారుదల శాఖలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సింగూరు కాలువల ఆధునికీకరణ పనులు నడుస్తున్నాయి. వీటిని ఎస్ఈ ఎప్పటికప్పుడు పర్య వేక్షించాల్సి ఉంటుంది. ఇలా రకరకాల ప్రాధఆన్యతలు ఉన్న దృష్ట్యా ఎస్ఈ పోస్ట్ కి పట్టిన గ్రహణం ఎప్పుడు వీడుతుందో చూడాలి.