Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్ని భర్తీ చేసింది. 37 మంది నాయకులకు పదవులు ఇచ్చి బాధ్యతలను అప్పగించింది. సాధారణ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు… పార్టీ కోసం పనిచేసిన అనుబంధ సంఘాల చైర్మన్ లకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులను కట్టబెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్‌గా ఆయనే ఉండడంతో… పనిచేసిన వాళ్లందర్నీగుర్తించి మొదటి విడతలోనే పదవులు ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం చాలామంది కార్పొరేషన్ చైర్మన్స్ పనితీరుపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. పదవులు దక్కాక పార్టీ కోసం గానీ… ప్రభుత్వం కోసం గానీ పనిచేసిన కార్పొరేషన్ ఛైర్మన్స్ చాలా తక్కువ. నలుగురైదుగురు తప్ప… మిగిలిన వాళ్ళు ఎవరూ… అప్పగించిన పనిని సరిగా నిర్వర్తించడం లేదన్నది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ.
Read Also: 7800mAh బ్యాటరీ, క్రేజీ ఫీచర్స్, IP66/68/69/69K రేటింగ్స్ తో OnePlus Ace 6 లాంచ్.!
ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు దీటుగా సమాధానం చెప్పే విషయంలో కానీ… పార్టీ అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహించడంలోగానీ… మెరుగైన పనితీరును ప్రదర్శించడం లేదనేది ప్రధానమైన అభియోగం. ప్రస్తుతం కార్పొరేషన్ ఛైర్మన్స్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మరో టాస్క్‌గా నిలవబోతున్నాయి. ఏడు డివిజన్స్‌ను ఒకరికి అప్పగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అక్కడ కూడా కొందరు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నా…మరి కొందరు మాత్రం… పైపైగా సమావేశాలతో మమ అనిపిస్తున్నారని ప్రభుత్వ పెద్దలకు నివేదిక అందిందట. ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి అంశాలను గుర్తు చేశారు. పని చేయకుంటే పక్కన పెడతామంటూ గతంలో కూడా హెచ్చరికలు వచ్చాయి కూడా. కొందరు మార్చుకున్నారు… మరికొందరు అలాగే కంటిన్యూ అవుతున్నారు. మరో ఐదారు నెలల్లో పదవీకాలం ముగియబోతున్న టైంలో…తమకు రెన్యువల్ అవుతుందని చాలామంది ఛైర్మన్స్ భావిస్తున్నారు. కానీ… అధినాయకత్వం ఆలోచన మాత్రం వేరేలా ఉందట. మూకుమ్మడి రెన్యువల్స్ కాకుండా… పనితీరును బేస్ చేసుకుని కొనసాగించాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ లెక్కన చూసుకుంటే… నలుగురు లేదా ఐదుగురు కార్పొరేషన్ చైర్మన్ లకే తిరిగి అవకాశం దక్కే పరిస్థితి కనపడుతోందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పదవుల కోసం పార్టీలో ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి…. రెన్యువల్ లిస్ట్‌లో పేర్లు అతి తక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఏదైనాసరే…పదవి వచ్చాక పని మానేసి టైంపాస్ చేసిన వాళ్ళు మాత్రం ఇంటిదారి పట్టాల్సిందేనన్నది కాంగ్రెస్ టాక్.