Off The Record: గులాబీ పార్టీ అధినేతగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్ర వెళ్లినా.. కర్నాటకలో పర్యటించినా ప్రధాన ఆకర్షణగా నిలిచారు నటుడు ప్రకాష్‌రాజ్. పైగా కేసీఆర్‌తో చాలా చనువుగా కనిపించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పొలిటికల్ వ్యూహరచనల్లోనూ పాల్గొన్నారు ఈ నటుడు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసే క్రమంలో సీఎం కేసీఆర్‌కు మద్దతు ప్రకటిస్తూ వచ్చారు కూడా. అయితే BRS జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కాబోతున్న తరుణంలో ప్రకాష్‌రాజ్ యాక్టివ్‌గా లేకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ప్రధాని మోడీ విధానాలను తీవ్రంగానే వ్యతిరేకిస్తారు ప్రకాష్‌రాజ్. సమకాలీన రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ విధానాలకు ఓపెన్ సపోర్టర్ కూడా. అప్పట్లో కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండటం చూసిన వాళ్లు.. ఈ నటుడికి పదవీయోగం ఖాయమని భావించారు. దానికి తగ్గట్టుగానే ప్రకాష్‌రాజ్‌ను రాజ్యసభకు పంపుతారనే చర్చా సాగింది. కేసీఆర్.. కర్నాటక, మహారాష్ట్ర వెళ్లితే కీలక పాత్ర పోషించడంతో ఆ చర్చకు బలం చేకూరింది. కానీ.. ప్రకాష్‌రాజ్‌కు ఎలాంటి పదవీయోగం పట్టలేదు. మరి.. ఆయన కూడా అలాంటి పదవి ఏదైనా ఆశించి భంగ పడ్డారో ఏమో.. తర్వాత గులాబీ పార్టీ కార్యక్రమాల్లో.. పార్టీ పెద్దల పర్యటనల్లోనూ కనిపించలేదు.
బీఆర్ఎస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో చేరికల వేగం పెంచారు.. కొందరికి ఆయా రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైనా ప్రత్యేక ఫోకస్ పెట్టారు గులాబీ పార్టీ బాస్. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కర్నాటక కూడా ఉంది. గతంలో కర్నాటకలో పోటీ చేసి ఓడిపోయారు ప్రకాష్‌రాజ్. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఇంకా పార్టీ విధానం ప్రకటించ లేదు. దాంతో ప్రకాష్‌రాజ్ ఏం చేస్తారు అనేది ప్రశ్న. బీఆర్ఎస్‌తో టచ్‌లోనే ఉంటే.. ఆయన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేక వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు వేచి ఉండి.. లోక్‌సభ బరిలో ఉంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ లోక్‌సభకే అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఉత్కంఠే. ఎన్నికల్లో పోటీ ఎలా ఉన్నా.. బీఆర్ఎస్‌లో ప్రకాష్‌రాజ్ పాత్ర ఏంటన్నది ముందుగా క్లారిటీ రావాల్సి ఉందన్నది కొందరి వాదన. ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో ఈ నటుడు పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారా లేదా అనేది తెలియాలి.