Off The Record: నిమ్మకాయల చినరాజప్ప. పెద్దాపురం ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచినా.. మూడోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తారని టీడీపీ అధినేత ప్రకటించినా.. ఆయనకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది పార్టీలోని వ్యతిరేకవర్గం. ఏకంగా టీడీపీ అధినేత ఎదుటే చినరాజప్పకు యాంటీగా స్లోగన్స్ ఇవ్వడంతో సీన్ రసవత్తరంగా మారింది. చికిత్స చేయడానికి అధిష్ఠానం మరో మాజీ మంత్రికి బాధ్యతలు అప్పగించడంతో పెద్దాపురం టీడీపీలో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కేడర్‌లో నెలకొంది. చినరాజప్పది పెద్దాపురం కాదు.. ఆయన సొంత నియోజకవర్గం అమలాపురం. అది SC రిజర్వ్డ్ కావడంతో ప్లేస్ మారింది. పెద్దాపురంలో 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి బొడ్డు భాస్కర రామారావు ఎమ్మెల్యే. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు భాస్కర రామారావు. 2014 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలోకి వెళ్లిపోవడంతో చినరాజప్పను పెద్దాపురం బరిలో దించింది అధిష్ఠానం. చినరాజప్ప గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. హోంశాఖ బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో భాస్కర రామారావు కుమారుడు అనంత వెంకటరమణ చౌదరి వైసీపీ నుంచి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసినా ఓడిపోయారు. ఇంతలో భాస్కర రామారావు చనిపోవడంతో ఆ ఫ్యామిలీ యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమైంది. 2019 ఎన్నికలకు ముందు వెంకటరమణ టీడీపీలోకి వచ్చారు.
Read Also: MLA Sayanna : ఉద్రిక్తతల మధ్య ముగిసిన సాయన్న అంత్యక్రియలు
ప్రస్తుతం పెద్దాపురంలో చినరాజప్పకు వెంకటరమణతోపాటు.. మరో టీడీపీ నేత గుణ్ణం చంద్రమౌళిల నుంచి సెగ తప్పడం లేదు. పెద్దాపురం సీటు కమ్మ సామాజికవర్గానిదని.. మారిన పరిణామాలతో చినరాజప్పను ఇక్కడకు తీసుకొచ్చారని వాదిస్తున్నారు చంద్రమౌళి. టీడీపీ అధినేత జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎక్కడా ఎమ్మెల్యే చినరాజప్ప ఫొటో పెట్టలేదు. పైగా పెద్దాపురం బహిరంగ సభలో చినరాజప్పను ముచ్చటగా మూడోసారి గెలిపించాలని పార్టీ అధినేత చెప్పడంతో వ్యతిరేకవర్గం అవాక్కైంది. చినరాజప్పను గెలిపించాలని టీడీపీ అధినేత ప్రకటించిన మర్నాడే.. పార్టీ ప్రోగ్రామ్‌లో సీన్ క్రియేట్ చేసింది వ్యతిరేకవర్గం. చినరాజప్పకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నాయకులు. ఆయన వేదిక దిగిపోవాలని.. వలస నేతలు తమకు అవసరం లేదని అధినేత ముందే పంచాయితీ పెట్టారు తెలుగు తమ్ముళ్లు. ఈ పరిణామంతో చిన్నబోవడం చినరాజప్ప వంతైంది. పనిలో పనిగా పార్టీలోని కమ్మ సామాజికవర్గం కొత్త ఈక్వేషన్‌ను తెరపైకి తీసుకొస్తోందట. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఒక అసెంబ్లీ సీటు బుచ్చయ్య చౌదరికి.. అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఒకచోట వేగుళ్ల జోగేశ్వరరావుకు ఇచ్చారని.. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న పెద్దాపురం కూడా తమకు కేటాయించాలని కోరుతోందట. తాజా ఎపిసోడ్‌లో బొడ్డు వెంకటరమణ చౌదరి వెనక్కి తగ్గి.. చంద్రమౌళికి సీటు ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెబుతున్నారట.
Read Also: Off The Record: తెలంగాణ బీజేపీలో అలజడి..? ఆపరేషన్ వికర్ష్ వలలో బీజేపీ నేతలు?
బుజ్జగింపు చర్యల్లో భాగంగా.. టీడీపీ అధినేత పిలిచినా చంద్రమౌళి వెళ్లలేదట. దాంతో టీడీపీ జోనల్ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావుకు సమస్యను పరిష్కరించే బాధ్యత అప్పగించారట. అయితే తాజా సమస్య టీకప్పులో తుఫానుగా సమసిపోతే ఇబ్బంది లేదని.. తెగే వరకు లాగితే మాత్రం మాజీ డిప్యూటీ సీఎంకు పెద్దాపురంలో పెద్దకష్టం వచ్చినట్టేనని చెవులు కొరుక్కుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.