Off The Record: నేతలందు చిత్తూరోళ్ళు వేరయా అన్నట్టుగా ఉందట టీడీపీలో పరిస్థితి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లకుగాను 12 స్థానాలు గెలిచింది కూటమి.దీంతో పార్టీ కోసం పని చేసిన ముఖ్య నేతలంతా… మంత్రి పదవులు కోసం, మిగిలిన వారు నామినేటెడ్ పదవుల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. ఈ క్రమంలో తాజాగా భర్తీ చేసిన 20 నామినేటెడ్ పోస్టుల్లో జిల్లాకే నాలుగు కీలకమైన పదవులు లభించాయి. అందులోనూ… తిరుపతికి చెందిన కూటమి నాయకుల్ని మూడు కార్పొరేషన్ పదవులు వరించాయి. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా సుగుణమ్మ, ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ఛైర్మన్‌గా డాలర్ దివాకర్ రెడ్డికి ముఖ్యమైన పదవులు దక్కగా కుప్పం నేతకు మరో పోస్ట్ వచ్చింది. అయితే… ఆ పదవులపై సదరునేతలు సంతృప్తిగా లేరట. ఆశించినంత స్థాయిలో పదవి రాలేదంటూ మాజీఎమ్మెల్యే సుగుణమ్మ అనుచరులు.. టిడిపి అధిష్టానం మీద సోషల్ మీడియా పోస్ట్‌లతో దండెత్తుతున్నారు.
Read Also: Off The Record: పోగొట్టుకున్న చోటే సాధించే పనిలో గులాబీ దళం
ఇక ఇదే పరిస్థితి జనసేన నేత హరిప్రసాద్ విషయంలోనూ ఉందట. మేం అనుకున్నది ఒకటైతే మీరు ఇచ్చిన పదవి మరోటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోందట హరిప్రసాద్ వర్గం. మీరిద్దరు రెండు పార్టీలకు రాజీనామాలు చేసేయండని అంటూ… అనుచరులు వత్తిడి చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పదవులు వచ్చిన వారి సంగతి అలా ఉంటే… అసలు అది కూడా రాని వాళ్ళు ఇంకా రగిలిపోతున్నారట. ముఖ్యంగా పుంగనూరు తమ్ముళ్ల ఆవేదన మామూలుగా లేదంటున్నారు. వైసీపీ హయాంలో… రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కేసులతో వందల మందిమి జైళ్ళ పాలయ్యాం….. అయినాసరే…. ఈ నియోజకవర్గాన్ని గుర్తించకపోవడం అన్యాయం అంటూ… మధనపడిపోతున్నట్టు సమాచారం. అప్పట్లో అన్యాయంగా పెట్టిన కేసుల్ని ఇప్పటిదాకా కొట్టేయలేదని, అదిపోగా… ఆ మధ్య ఓ టిడిపి కార్యకర్తను వైసీపీ నేతలు చంపేశారని, పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా…. టీడీపీ అధిష్టానం కనీసం పుంగనూరు నాయకుల్ని పట్టించుకోలేదన్నది వారి ఆవేదనగా చెప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా… భయపడుతున్న కేడర్‌కు ధైర్యం రావాలంటే… ఇక్కడ పదవులు ఇస్తేనే కదా అన్నది వారి వాదన. ఇన్ఛార్జ్ చల్లా బాబుకు రాష్ట్ర స్థాయి పదవి కావాలన్నది వాళ్ల డిమాండ్‌గా తెలుస్తోంది.
Read Also: PM Modi: ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం
అటు కాళహస్తి, చిత్తూరు ,మదనపల్లె నేతలు కూడా చాలా మంది అప్పట్లో నానా ఇబ్బందులు పడ్డారని వాళ్ళలో ఏ ఒక్కర్నీ పట్టించుకోలేదన్న బాధ పెరుగుతోందట. పుంగనూరులో టీడీపీని బలోపేతం చేయడం కోసం ఇన్ఛార్జ్ చల్లా బాబుకు కీలక పదవి ఇస్తామని గతంలోనే పార్టీ పెద్దలు హామీ ఇచ్చిన సంగతిని కేడర్ గుర్తు చేస్తుండగా… ఆయన మాత్రం పదవి సంగతి తర్వాత, ముందు కేసులు ఎత్తేయించండని మొత్తుకుంటున్నారట. ఆ కేసుల కారణంగా చాలామంది యువకులు అన్యాయమైపోతున్నారని, కొందరికి ఉద్యోగాలు రాకపోగా… అప్పటికే ఉన్నవాళ్ళని కూడా పంపేశారని, కొందరికి పాస్‌పోర్ట్ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు చల్లా. అటు కేసుల బాధ తొలిగిపోలేదు, ఇటు పదవులు రాలేదు… ఇక పార్టీ కోసం మేమెందుకు తెగించి కొట్లాడాలని ఘాటుగా రియాక్ట్ అవుతున్న కార్యకర్తల సంఖ్య పెరుగుతోందట పుంగనూరులో. అయితే… ఇప్పటికి ఏడాదేకదా గడిచింది. రాబోయే రోజుల్లో అందరికీ న్యాయం చేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నట్టు సమాచారం. మొత్తానికి నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఉమ్మడి చిత్తూరు జిల్లా టిడిపిలో పెద్ద చిచ్చే రేపిందని టాక్ నడుస్తోంది. సొంత జిల్లాను సీఎం చంద్రబాబు మరోసారి నిర్లక్ష్యం చేశారంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పార్టీ పెద్దలు వీళ్ళని ఎలా బుజ్జగిస్తారో చూడాలి మరి.