Off The Record: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఫ్యామిలీ టీడీపీతో టచ్‌లో ఉందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే నెల్లూరు వైసీపీ రాజకీయాలపై రాష్ట్రంలో వాడీవేడీ చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె చేసిన కామెంట్స్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో నంద్యాల రాజకీయాలు కూడా హీటెక్కాయి. మాజీ మంత్రి వ్యాఖ్యలు టీడీపీ, వైసీపీ శిబిరాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశాయనే చెప్పాలి. నిజంగానే శిల్పా కుటుంబం టీడీపీతో టచ్‌లో ఉందా? లేక ఇంకేదైనా రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాజీ మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారా అని రెండు పార్టీల శ్రేణులు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది.
Read Also: Off The Record: కోటంరెడ్డి ఎపిసోడ్‌లో తెలుగు తమ్ముళ్లు ఎందుకు సైలెంట్..?
వైసీపీలో శిల్పా కుటుంబం పరిస్థితి బాగోలేదని.. అధికార పార్టీతో బంధం చెడిందనేది భూమా అఖిల ఆరోపణ. అయితే కొద్దిరోజుల క్రితం భూమా కుటుంబంపై ఎమ్మెల్యే శిల్పా రవి పదునైన విమర్శలు చేశారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కొత్త పొలిటికల్ డ్రామాకు అఖిల తెరతీశారని కొందరు అభిప్రాయ పడుతున్నారట. టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తూనే టీడీపీ నేతలను విమర్శిస్తే ఎలా అని అఖిల వ్యాఖ్యానించడాన్ని ఈ సందర్భంగా వాళ్లు ప్రస్తావిస్తున్నారు. శిల్పా కుటుంబం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించిన ఆమె.. ఆధారాలతో సహా చర్చకు సిద్ధమని వేదిక సమయం ప్రకటించేశారు. దాంతో నంద్యాల రాజకీయంలో ఎప్పుడెలాంటి మలుపులు ఉంటాయో అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు జనం. ఆస్తుల్ని ఆక్రమించి.. భూదందాలు చేస్తోంది.. సెటిల్మెంట్లు నిర్వహిస్తోంది ఎవరో తెలుసని ఇటీవల భూమా ఫ్యామిలీని ఉద్దేశించి MLA పరోక్ష విమర్శలు చేశారు. తమను రెచ్చగొడితే మొత్తం చిట్టా విప్పుతామని రవి చెప్పారు. ఆ తర్వాతే మీడియా ముందుకొచ్చిన అఖిలప్రియ ఎమ్మెల్యే విమర్శలకు కౌంటర్ ఇస్తూనే శిల్పా కుటుంబం టీడీపీతో టచ్‌లో ఉందని బాంబు పేల్చారు. దాంతో మాజీ మంత్రి కామెంట్స్‌కు ఎమ్మెల్యే రవి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Read ALso: Off The Record: కాంగ్రెస్ పార్టీలో వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్యపోరు పీక్స్‌కు..?
మాజీ మంత్రి అఖిల చెప్పినట్టుగా తాము టీడీపీలోకి వెళ్లాల్సిన అవసరం ఏంటనేది ఎమ్మెల్యే శిల్పా రవి ప్రశ్నిస్తున్నారు. నంద్యాల కేంద్రంగా ఇటీవల రాజకీయ కార్యకలాపాలు పెంచిన అఖిలప్రియ.. ప్రజల అటెన్షన్ తనపై తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనేది మరో ఆరోపణ. నంద్యాల సీటుపై కన్నేసిన మాజీ మంత్రి వ్యూహాత్మకంగానే శిల్పా రవిని టార్గెట్ చేశారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డలో పోటీ చేసి అఖిల ప్రియ ఓడిపోయారు. నంద్యాలలో కూడా భూమా ఫ్యామిలీకి పట్టు ఉండటంతో.. కేడర్‌ను గేరప్ చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. అందుకే ప్రైవేట్ సంభాషణల్లోనూ శిల్పా రవి ఫ్యామిలీ టీడీపీలో చేరేందుకు మంతనాలు చేస్తున్నట్టు ఆమె వ్యాఖ్యానిస్తున్నారట. శిల్పా రవి తండ్రి మోహన్‌రెడ్డి 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని.. తిరిగి పసుపు కండువా కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అఖిల చెబుతున్నారట. ప్రస్తుతం నంద్యాలలో ఎవరిని కదిలించినా ఈ అంశంపైనే ప్రశ్నలు వేస్తున్నారు.