Off The Record: కైకలూరుకు చెందిన నాయకుడు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ వ్యవహారాన్ని అనుమానాస్పదంగా చూస్తున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ వర్గాలు. ఆయన మనసులో ఏముంది? అడుగులు ఎటువైపు పడుతున్నాయని గుసగుసలాడుకుంటున్నారు. ఉన్నట్టుండి సైలెంట్ అవడం వెనక ప్రత్యేక కారణాలు ఉన్నాయా అంటూ ఆరాలు తీస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న వెంకటరమణ వైసీపీలో చేరాక ఆ పార్టీ ఎమెల్సీ పదవి ఇచ్చింది. దానికి రాజీనామా చేసి ప్రస్తుతం జనసేనలో చేరారాయన. రాజీనామా ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. కైకలూరు మండల జడ్పీటీసీగా 2001 నుంచి 2006 వరకు పనిచేశారాయన. ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఇక 2009లో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటంతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014లో బీజేపీతో పొత్తు కారణంగా జయమంగళకు టికెట్ దక్కలేదు. అయితే… అప్పుడు టీడీపీ అధికారంలోకి రావటంతో 2014 నుంచి 2019 వరకు పార్టీ ఇన్ఛార్జ్‌గా పనిచేశారు వెంకట రమణ.
Read Also: Payal Raj put : టాప్ బటన్లు విప్పేసి పాయల్ అందాల రచ్చ..
2019లో టీడీపీ టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావటంతో.. కొన్నాళ్ళు ఆగి… 2023లో YCPలో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీ అయ్యారు జయమంగళ. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పని చేసినా వర్కౌట్ అవలేదు. దీంతో ఎన్నికల తర్వాత మళ్ళీ పార్టీ మారిపోయారు ఎమ్మెల్సీ. వైసీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకున్నారు. కైకలూరు జనసేన ఇన్ఛార్జ్ 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. దీంతో ఇప్పుడు ఎన్నికల తరువాత పార్టీ అధికారంలోకి వచ్చినా… కైకలూరులో ఇన్ఛార్జ్‌లేని పరిస్థితి. అదే సమయంలో జయమంగళ వెంకటరమణ నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నా… ఎందుకు యాక్టివ్ అవడం లేదని ఆరాలు తీసేస్తున్నాయి రాజకీయ వర్గాలు. గత డిసెంబర్ లోనే జనసేనలో కండువా కప్పుకున్నా… ఇప్పటికీ ఉన్నారా లేదా అన్నట్టుగానే నడుస్తోందట. అటు జనసేన కూడా ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీగా ఉన్నా…. ఇప్పటిదాకా జయమంగళకు కేటాయించలేదు. పదవి విషయంలో పార్టీ క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే ఆయన నిరాసక్తంగా ఉన్నారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట.
Read Also: HONOR X70: 8300mAh భారీ బ్యాటరీ, బుల్లెట్‌ప్రూఫ్ వెస్ట్ స్ట్రక్చర్ తో హానర్ X70 గ్లోబల్ లాంచ్..!
నియోజకవర్గంలో ఉన్న టీడీపీ శ్రేణులు కూడా… ముందు వైసీపీలో, ఇప్పుడు జనసేనలో చేరిన జయమంగళను గతంలో మాదిరిగా ఓన్ చేసుకోలేకపోతున్నాయన్నది లోకల్ టాక్. అటు జనసేనలో పార్టీ పదవి ఏదీ లేకపోవడం మైనస్‌గా మారిందట. వరుసగా పార్టీలు మారిపోయి ఎమ్మెల్సీ సెల్ఫ్‌గోల్ వేసుకున్నారని, దాని ఫలితమే ఈ పరిస్థితి అంటున్నారు విశ్లేషకులు. అధికారంలో ఉన్న పార్టీలోకి జంపై పోవడం అలవాటుగా చేసుకుంటే… ఇలాగే ఉంటుందన్న సెటైర్స్ సైతం వినిపిస్తున్నాయి. అందుకు ఆయన కూడా గడుసుగానే సమాధానం చెబుతున్నారట. అధికార పక్షం వైపు ఉంటేనే ప్రజలకి ఏమైనా సేవ లేదా ఏమైనా పనులు చేయగలం అన్నది ఆయన వాదన. జనసేనలో చేరిన తర్వాత పదవి దక్కక పోవటం మాత్రం ఎమ్మెల్సీ వర్గానికి మింగుడు పడటం లేదట.