Off The Record: వసంత కృష్ణప్రసాద్. ఉమ్మడి కృష్ణాజిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే. ఇక ఈయనేమో వసంత నాగేశ్వరరావు. రాజకీయాల్లో కురువృద్ధుడైన వసంత నాగేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోంశాఖ మంత్రిగా చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వసంత ఫ్యామిలీ 2019 ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టింది. అందులోనూ అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఓడించడం.. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో వసంత కృష్ణప్రసాద్ పెద్ద పదవే ఆశించారు. తండ్రిలా తాను కూడా మంత్రి కావొచ్చని కలలు కన్నారు. కానీ.. అది నెరవేర లేదు. మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలోనైనా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని.. మినిస్టర్ అనిపించుకోవచ్చునని లెక్కలేసుకున్నారు కృష్ణ ప్రసాద్. మళ్లీ నిరాశ తప్పలేదు. అప్పటి నుంచి సందర్భం ఏదైనా అధికారపార్టీలో చర్చగా మారిపోయారు ఈ మైలవరం ఎమ్మెల్యే.
Read Also: Off The Record: లోకల్-నాన్‌లోకల్ రగడ.. మల్కాజ్‌గిరి బీజేపీలో కుంపట్లు..!
మైలవరంలో కృష్ణ ప్రసాద్‌కు ఇంటిపోరు ఎక్కువైంది. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ కదలికలు ఎమ్మెల్యేకు అస్సలు రుచించడంలేదు. ఆ మధ్య బహిరంగంగానే ఓపెన్ అయ్యారు. వైసీపీ అధిష్ఠానం కృష్ణ ప్రసాద్‌ను పిలిచి మాట్లాడింది. మంత్రి జోగి రమేష్ కూడా పార్టీకి వివరణ ఇచ్చారు. ఆ ఎపిసోడ్ తర్వాత అధికారపార్టీలో తన మాట నెగ్గడం లేదన్న ఫీలింగో ఏమో వసంత చేస్తున్న వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయి. దీనితోడు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో కృష్ణ ప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ అధికారపార్టీలో కలకలం సృష్టించాయి. కేబినెట్‌లో కమ్మ సామాజికవర్గానికి చెందిన మంత్రి లేకపోవడం ఏంటని కూడా నాగేశ్వరరావు ప్రశ్నించారు. తండ్రి చేసిన వ్యాఖ్యలతో ఇరకాటంలోపడ్డ కృష్ణప్రసాద్.. ఆయనతో ఏకీభవించడం లేదని చెప్పుకొచ్చారు.
ఇటీవల మరో సమస్య తెరమీదకు వచ్చింది. వసంత నాగేశ్వరరావు టీడీపీ ఎంపీ కేశినేని నానితో భేటీ అయిన ఫొటోలు బయటకొచ్చాయి. ఆ సందర్భానికీ కృష్ణ ప్రసాద్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కేశినేని నాని కుమార్తె పెళ్లికి వెళ్లకపోవడంతో ప్రత్యేకంగా కలిసి తన తండ్రి అభినందించారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రాజకీయాలపై.. ఎమ్మెల్యేల వెంట ఉండేవారిపై కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. రాజకీయాల్లోకి వచ్చాక చేయాల్సినవి చేయలేకపోయానని తనలోని అసంతృప్తిని బయట పెడుతూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అంతకుముందు గుంటూరు తొక్కిసలాటపై వైసీపీ లైన్‌కు భిన్నంగా NRI ఉయ్యూరు శ్రీనివాసరావును సమర్ధించారు ఎమ్మెల్యే వసంత. ఇలా తండ్రీ కొడుకుల పలుకులు.. కదలికలు వివాదాస్పదం అవుతున్నాయి.
విలువల గురించి మాట్లాడటం.. కుల ప్రస్తావన చేయడం.. చూస్తుంటే… తండ్రీ కొడుకులకు ఏమైంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎవరిన ఉద్దేశించిన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనేది ప్రశ్న. అధికారపార్టీలో వసంత కృష్ణ ప్రసాద్, వసంత నాగేశ్వరరావు ఉక్కపోత ఫీలవుతున్నారా అనే డౌట్ కూడా ఉంది. మనసులో ఏదో ఉండబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేవారూ ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో.. ఏం మాట్లాడకూడదో.. ఎంత పొదుపుగా మాట్లాడాలో వసంత ఫ్యామిలీకి తెలియంది కాదు. కానీ.. వారి మాటలు చూస్తుంటే గీతదాటుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి.. వారి లోగుట్టు ఏంటో కాలమే చెప్పాలి.