Off The Record: వైసీపీ ప్రభుత్వ హయాంలో… 2022లో జిల్లాల పునర్విభజన జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల ప్రకారం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి, అమలాపురం కేంద్రంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, మూడోది కాకినాడ జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో…అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉన్న రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు వాసంశెట్టి సుభాష్. ఆయన సొంత నియోజకవర్గం అమలాపురం అయినా… అది ఎస్సీ రిజర్వుడు కావడంతో రామచంద్రపురానికి షిఫ్ట్ అయ్యారాయన. అయితే… కొత్త జిల్లాలకు సంబంధించి రకరకాల అభ్యంతరాలు వ్యక్తం కావడంతో… పునస్సమీక్ష కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఇబ్బందులు ఉన్నచోట్ల పారదర్శకంగా మార్పులకు సూచనలు చేయమంది. ఇక రామచంద్రపురం విషయానికి వస్తే… ఇది కాకినాడకు 25 కిలోమీటర్ల దూరం ఉంటే.. అమలాపురానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే తమను కోనసీమ నుంచి తప్పించి కాకినాడ జిల్లాలో కలపమంటూ రకరకాలుగా ఆందోళనలు చేస్తున్నారు స్థానికులు.
Read Also: Tollywood: చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. కానీ లవర్స్ అని ఒప్పుకోరు!
భౌగోళికంగా దగ్గరగా ఉండటంతోపాటు తమ రోజువారీ కార్యకలాపాలు కూడా కాకినాడతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాలో కలిపితేనే సౌలభ్యం ఉంటుందన్నది లోకల్ వాయిస్. అలా నియోజకవర్గం మొత్తం ఒక్కటై తమను కాకినాడ జిల్లాలో కలపమని ఆందోళన చేస్తుంటే… ఈ వ్యవహారంలో ముందుండాల్సిన మంత్రి సుభాష్ మాత్రం పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదట. అసలా విషయంతో తనకు సంబంధం లేదన్న వైఖరితో ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అలా… నియోజకవర్గ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారయ్యా… అంటే, పొలిటికల్ కేలిక్యులేషన్స్ అన్నది విశ్లేషకుల సమాధానం. రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలోకి వెళితే తన మార్క్ ఉండదని తెగ ఫీలైపోతున్నారట మినిస్టర్. ఈ విషయంలో ప్రాధమికంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా… మంత్రిగా మాత్రం తన పరపతి కోణంలో కామ్‌గా ఉన్నట్టు సమాచారం. మరోవైపు కేబినెట్‌లో సుభాష్ పనితీరు చాలా పూర్‌గా ఉందట. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఎప్పుడు జరిగితే అప్పుడు ఆయన్ని సాగనంపడం ఖాయమన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం ఆయన కోనసీమ జిల్లా కోటాలో మంత్రిగా ఉన్నారు. రేపు కాకినాడలో కలిపేస్తే… అక్కడి లెక్కల దృష్ట్యా… సుభాష్‌ని పరిగణనలోకి తీసుకునే అవకాశంఉండదు.
మరోవైపు తన సొంత నియోజకవర్గం ఒక జిల్లాలో, తాను గెలిచిన నియోజకవర్గం మరో జిల్లాలో ఉంటే… మంత్రి పదవి లేకున్నా… ఇతరత్రా పెత్తనాల కోసమైనా… తన మాట చెల్లుబాటు కాదన్నది సుభాష్ అభిప్రాయంగా తెలుస్తోంది. ఇలాంటి రకరకాల లెక్కలేసుకుని, వ్యక్తిగత స్వార్ధం కోసం… నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి పట్టించుకోవడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి రామచంద్రపురంలో. జేఏసీ నేతలు సుభాష్ ను కలిసి మద్దతు తెలపాలని కోరినప్పటికీ… సరే, చూద్దాంలే అంటున్నారు తప్ప నిర్దిష్ట హామీ ఇవ్వడం లేదట.రామచంద్రపురం నియోజకవర్గంలో కె. గంగవరం, కాజులూరు, రామచంద్రపురం మండలాలు, రామచంద్రాపురం మున్సిపాలిటీ ఉన్నాయి. కాజులూరు మండలం ఇప్పటికే కాకినాడ జిల్లాలో ఉంది. మిగతా రెండు మండలాలు, మున్సిపాలిటీని కూడా కలపాలన్నది స్థానికుల డిమాండ్. ఆ విషయాన్ని పట్టించుకోకుండా… ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఈ కొత్త పంచాయతీ ఏంటి అంటూ అనుచరుల దగ్గర రుసరుసలాడుతున్నారట మంత్రివర్యులు. మొత్తం మీద మంత్రి సుభాష్‌కు తన సొంత నియోజకవర్గం వేరే జిల్లాలోకి వెళ్లడం ఇష్టంలేదు. అయినాసరే… ప్రభుత్వం మాత్రం దానికి సంబంధించి ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.