Off The Record: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజం. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మళ్లీ సన్నద్ధం అవుతుంటారు నాయకులు. కానీ… ఆ విషయంలో మర్చిపోయి.. నమ్ముకున్న క్యాడర్‌కు వెన్నుదన్నుగా ఉండాలన్న ప్రాధమిక విషయాన్ని కూడా పట్టించుకోకుండా… కల్వకుర్తికి గెస్ట్ ఆర్టిస్ట్ అయ్యారట జైపాల్ యాదవ్. స్థానిక విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదని గులాబీ కేడరే చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే… ఇదే వైఖరి కొందరు స్థానిక నాయకులకు వరంగా మారినట్టు చెప్పుకుంటున్నారు. మంచి తరుణం మించిన దొరకదని అనుకుంటూ…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ కోసం ఇప్పటి నుంచే ట్రయల్స్ మొదలుపెట్టేశారట ఒకరిద్దరు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా పనిచేసిన తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేశ్ , కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఈసారి టిక్కెట్ నాకంటే నాకేనని ప్రచారం చేసుకుంటున్నారు.
Read Also: Off The Record: వందల కోట్లకు బినామీ..! ఈఎన్సీ హరిరామ్ వెనుక ఉన్న అసలు నేత ఎవరు..?
ఎవరేం చేసినా టిక్కెట్ మాత్రం మనకే… పెద్దోళ్ళు హామీ ఇచ్చేశారంటూ… అనుచరుల్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అటు బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక కార్యక్రమాలకు సంబంధించిన వాల్ రైటింగ్స్‌ని సైతం వేర్వేరుగా రాయించి పర్సనల్ ప్రమోషన్స్ చేసుకున్నారట. ఈ పరిస్థితుల్లో… నియోజక వర్గ గులాబీ దళం మూడుగా చీలినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఎవరికి వారు ఇప్పటి నుంచే పావులు కదుపుతుండటంతో… కల్వకుర్తి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముందుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి దక్కించుకుని, ఆ తరువాత టికెట్ ఎగరేసుకుపోవాలని లక్ష్యంతో ఉప్పల వెంకటేష్ వ్యూహాలు పన్నుతున్నారట. గులాబీ పార్టీ పెద్దల కార్యక్రమాలు ఉన్నప్పుడు వారి ఫోటోలతో ఫ్లెక్సీలు, భారీ కటౌట్ల ఏర్పాటు చేస్తూ ద్రుష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారాయన. అటు కల్వకుర్తి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం కూడా ఈ సారి టికెట్ నాదేనని అంటున్నారట. గత ఎన్నికల్లో జైపాల్ యాదవ్ కు అవకాశం ఇచ్చిన అధిష్టానం …. వచ్చేసారి నీకేనంటూ హామీ ఇచ్చేసిందని ప్రచారం చేసుకుంటున్నారట ఆయన. ఉద్యమ కాలం నుంచి పార్టీ వెన్నంటి ఉండటం తో పాటు విజయవంతంగా మున్సిపల్ చైర్మన్ పదవి నిర్వహించానన్నది సత్యం వాదన.
Read Also: Suspicious Death: వివాహిత అనుమానాస్పద మృతి.. తిరువూరులో ఉద్రిక్తత..
అయితే…. జైపాల్ యాదవ్ కు గెలుపోటములు కొత్తకాదని , అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి అని , మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు టికెట్ ఆశావహులే కోవర్టుల్లా వ్యవహరించి ఆయన్ని
ఓడించారని మండిపడుతోంది మాజీ ఎమ్మెల్యే అనుచరగణం. తమ నేతపై దుష్ప్ర చారం చేసి లబ్ది పొందాలని కొందరు భావిస్తున్నారని, కల్వకుర్తి బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న సెగ్మెంట్ అని , ఎవరెన్ని కుయుక్తులు పన్నినా మళ్లీ టికెట్ తమ నేతకేనని ధీమాగా చెబుతున్నారు వాళ్ళు. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా మారుతాయో, ఏ ఈక్వేషన్ ఎలా వర్కౌట్ అవుతాయో చూడాలంటున్నారు పరిశీలకులు.