Off The Record: కోనసీమ జిల్లాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు జనసేన లీడర్స్‌ని కంగారు పెడుతున్నాయట. ముఖ్యంగా తమ అధినాయకుడి ఫ్యాన్స్ వ్యవహారశైలి గ్లాస్ లీడర్స్‌ని గందరగోళంలో పడేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళ తీరు ఇలాగే ఉంటే… డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పార్టీ ఇరుకున పడటం ఖాయమన్న చర్చ కూడా జరుగుతోంది జనసేన వర్గాల్లో. అ మధ్య పవన్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమైంది. కుల సమీకరణల పరంగా బాగా సున్నితమైన ఏరియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కారణంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పన్నపల్లి, ఈతకోట, ఆలమూరు, కొత్తపేట ప్రాంతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు పెట్టారు. మీరెంత… మీ స్థాయి ఎంత అంటూ ఒక వర్గాన్ని కించపరిచినట్టుగా ఆ రాతలున్నాయన్న ఆగ్రహం వ్యక్తం అయింది. ముఖ్యంగా… జిల్లా పేరును కళ్యాణ్ సీమ అంటూ ముద్రించడం పట్ల దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉన్న జిల్లాలో పవన్ కళ్యాణ్ అభిమానులు అలజడి రేపారంటూ మండిపడ్డారు దళిత నాయకులు. ఇదే భయం ఇప్పుడు జనసేన నాయకుల్లో కూడా పెరుగుతోందట. ఫ్యాన్స్ పేరుతో… యువ జనసైనికుల చర్యలు పార్టీకి ఎక్కడ నష్టం చేస్తాయోనని భపడుతున్నట్టు తెలుస్తోంది. కానీ… పార్టీ నాయకులు తమను తప్పుపట్టడాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. మహేష్‌బాబు అభిమానులు బాబు సీమ అంటూ ఫ్లెక్సీలు పెడితే లేని అభ్యంతరం… కళ్యాణ్ సీమ అంటూ మేం పెడితే వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. అసలీ విషయంలో సర్దిచెప్పడం మానేసి…. ఎక్కడ లేని కంగారు నెత్తినేసుకుని కోనసీమ జిల్లాలోని జనసేన పార్టీ నేతలే వ్యతిరేకంగా మాట్లాడం కరెక్ట్ కాదంటున్నారట ఫ్యాన్స్.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
కానీ… నాయకుల వాదన మరోలా ఉంది. రాజకీయాలతో సంబంధంలేని మహేష్‌బాబు లెక్క వేరు, మన పరిస్థితి వేరని అంటున్నట్టు సమాచారం. ఇది ముదిరి కుల వివాదానికి దారితీస్తే… రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరుగుతుందంటూ… పోటీకి సిద్ధమవుతున్న నాయకులు కంగారు పడుతున్నారట. వివాదాస్పద ఫ్లెక్సీ రగడతో పాటు పవన్ అభిమానులు తీసిన ర్యాలీలు జిల్లాలో టెన్షన్ వాతావరణం సృష్టించాయి. భారీ డీజే శబ్దాలు, సైలెన్సర్లు తీసివేసిన బైకులతో నిర్వహించిన ర్యాలీలు పలుచోట్ల గొడవలకు దారితీశాయి. సాధారణంగా కోనసీమ ప్రాంతంలో వివిధ కులాలు, సినిమా హీరోల అభిమానుల మధ్య సున్నితమైన పరిస్థితులు ఉంటాయి. అందుకే… పవన్ అభిమానులు కట్టు తప్పితే అంతిమంగా అది పార్టీకి నష్టం చేస్తుందని తలలు పట్టుకుంటున్నారు నాయకులు. ఒక దశలో కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పవన్ అభిమానుల మీద కేసులు పెట్టాలని పోలీసులను కోరడంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయి చేరుకున్నాయి. అలాగే… పలుచోట్ల జనసేన నేతలే స్వయంగా అభిమానులపై కేసులు పెట్టించడం రెండు వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచిందని అంటున్నారు. జనసేన ఆవిర్భావం నుంచి తమ అధినేత ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చానా కోనసీమ నుంచి వేలాది మంది అభిమానులు స్వచ్ఛందంగా తరలి వెళ్లే వారు. సాధారణ రాజకీయ పార్టీల కార్యకర్తలకు భిన్నంగా… వీళ్ళు నియోజకవర్గ ఇన్చార్జ్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సొంత ఖర్చులతోనే వెళ్ళి వచ్చేవారు. ఇదే ఇప్పుడు నాయకుల్ని కూడా కంగారు పెడుతోందట. వాళ్ళని వదిలేస్తే…. లేనిపోని వివాదాలతో పార్టీని ఇరుకున పెడుతున్నారు. అలాగని చూస్తూ చూస్తూ… అంత అభిమానం ఉన్నవాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి దూరం చేసుకోలేం కదా… హతవిధీ… అంటూ తలలు పట్టుకుంటున్నారట కోనసీమ జనసేన సీనియర్స్.
అందుకే కాలమే సమాధానం చెబుతుందంటూ… ఎక్కువ మంది చూస్తూ ఉండిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు తమకు గట్టి బలం ఉన్న కోనసీమ జిల్లాలో ఇతర పార్టీల తరహాలో జనసేన జిల్లా అధ్యక్షుడు, లేదా సమర్థవంతమైన నాయకుడు లేకపోవడం కూడా ఒక మైనస్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. పవన్ అభిమానుల వివాదాస్పద చర్యలకు అది కూడా ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. ఈ పరిణామ క్రమంలో… ఇప్పుడు పవన్ అభిమానులు నిర్వహించే కార్యక్రమాలకు జనసేన నేతలను పిలవడం లేదట. వాళ్ళకు బదులుగా… టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలను పిలుస్తుండటంతో… పుండు మీద కారం చల్లినట్టుందన్న టాక్ నడుస్తోంది కోనసీమ జనసేనలో. అటు టీడీపీ నాయకులు కూడా దొరికిందే ఛాన్స్ అనుకుంటూ… ఫ్యాన్స్‌ను దగ్గరికి తీస్తున్నట్టు తెలుస్తోంది. అలాగని తామేదో ఎగబడ్డట్టు కనిపించకుండా…. అభిమానాన్ని సక్రమంగా చాటి చెప్పి పవన్ కళ్యాణ్‌కు మంచి పేరు తీసుకురావాలని సముదాయిస్తూ… పెద్దరికం ప్రదర్శిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలను చూస్తున్న జనసేన నాయకులకు మాత్రం ముందు నుయ్యి వెనుక గొయ్యిలా కనిపిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏదేమైనా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీకి చేదు అనుభవాల పరంపర మాత్రం కొనసాగుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఫ్యాన్స్ కుల వివాదాలతో పార్టీని డ్యామేజ్ చేస్తారా? నేతలు తొందరపాటు చర్యలకు పోకుండా అభిమానుల్ని కలుపుకుని పోతారా? ఈ విషయంలో అధిష్టానం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.