Off The Record: హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ నుంచి పార్టీ తరపున ముఖ్య నాయకుడు ఎవరైనా జిల్లాకు వస్తున్నారంటే… సాధారణంగా లోకల్ లీడర్స్ హడావిడి చేస్తుంటారు. అందునా… పార్టీ జిల్లా అధ్యక్షుడి సంగతైతే చెప్పేపనేలేదు. అది ఆ పొజిషన్‌లో ఉన్న నాయకుడి బాధ్యత కూడా. కానీ… ఖమ్మం జిల్లా విషయమై బీఆర్‌ఎస్‌లో పరిస్థితులు కాస్త తేడాగా కనిపిస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల టూర్‌కు వచ్చినప్పుడల్లా జిల్లా అధ్యక్షుడు తాతా మధు కనిపించడం లేదు. దాన్ని మధు కనిపించడంలేదనేకంటే…. సరిగ్గా ఆయన లేని టైం చూసి మరో వర్గం కేటీఆర్ టూర్‌కు ప్లాన్ చేస్తోందన్న అభిప్రాయం బలంగా ఉంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కేటీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన మాట ప్రకారమే అంతా జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్న పువ్వాడ సరిగ్గా తాతా మధు విదేశాల్లో ఉన్న టైం చూసి కేటీఆర్ జిల్లా పర్యటనకు ప్లాన్ చేస్తున్నారని, అటు కేటీఆర్ కూడా జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారా లేరా అన్న సంగతి పట్టించుకోకుండా పువ్వాడ ప్లాన్ ప్రకారం వచ్చేస్తున్నారన్నది లోకల్ కేడర్ మాట. దీంతో… ఒకరకంగా తాతా మధును పక్కకు పెట్టేస్తున్నారన్న చర్చ పెరుగుతోంది జిల్లాలో. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా…ప్రస్తుతం అపోజిషన్‌లో ఉండి, అందర్నీ కలుపుకుని పోవాల్సిన టైంలో కూడా.. కేటీఆర్ పువ్వాడ అజయ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ చెవులు కొరుక్కుంటోంది గులాబీ కేడర్. ఆ మధ్య ఓ మీటింగ్‌కు అజయ్‌ను కూడా పిలవండని కేటీఆర్ సూచించారని చెప్పుకుంటున్నారు. దాన్నిబట్టే పువ్వాడకు కేటీఆర్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు.
ఇక అటు చూస్తే…. ఎమ్మెల్సీ కమ్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుకు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కు మధ్య చాలా రోజుల నుంచి గ్యాప్ ఉంది. మధు జిల్లా ప్రెసిడెంట్ అయ్యాక అది ఇంకా పెరిగిందట. అధికారం పోయాక కూడా ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదరలేదు. ఈ క్రమంలో… ఇప్పటికి మూడు సార్లు కేటీఆర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు తాతా మధు విదేశీ పర్యటనల్లో ఉన్నారు. తాను ఖమ్మంలో లేనని, పర్యటన వాయుదా వేసుకోవాలని పదే పదే తాతా మధు విజ్ఞప్తి చేసినా…. పార్టీ నాయకత్వం అస్సలు పట్టించుకోలేదంటున్నారు. దీంతో…పువ్వాడకు పెద్దపీట వేసి జిల్లా అధ్యక్షుడు అయినా సరే… తాతా మధుకు టాటా చెబుతున్నట్టేనన్న విశ్లేషణలు బయలుదేరాయి. ఇక ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో తాతా మధు కాలికి బలపం కట్టుకుని తిరిగారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ గెలుపు కోసం పనిచేశారని, భద్రాచలం మేజర్ పంచాయతీలో మంత్రి పొంగులేటి వర్గంతో ఢీకొట్టి మరీ… గెలిపించే ప్రయత్నం చేశారని గుర్తు చేస్తున్నారు. ఫైనల్‌గా ఓడిపోయినా… ఢీ అంటే ఢీ అన్నట్టు పోటీ ఇచ్చామన్నది గులాబీ కేడర్ చెబుతున్న మాట. అసెంబ్లీ ఎన్నికల నుంచి నిన్నటి పంచాయతీ దాకా… అన్ని ఎలక్షన్స్‌లో పార్టీ కోసం మేం పని చేసినా… అధినాయకత్వం మాత్రం పువ్వాడ వైపు మొగ్గుతోందంటూ…. ఎమ్మెల్సీ వర్గం అసహనంగా ఉన్నట్టు తెలిసింది. పార్టీ కోసం ఇంతలా పని చేస్తుంటే…వెంట్రుకతో సమానంగా తీసేస్తున్నారని, ఇలాగే ఉంటే ఇక రాజకీయ మనుగడ కష్టం అన్న టాక్ నడుస్తోంది తాతా మధు వర్గంలో. తాజా సభలో కూడా పంచాయతీ ఎన్నికల్ని పట్టించుకోని వారే మొత్తం కబ్జా చేసేశారని, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీకి ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. చివరకు కేటీఆర్ సభ పుల్ సక్సెస్ అయినా… ఆ విషయాన్ని పదిమందితో పంచుకునేవాళ్ళు లేకుండా పోయారని, ఈ వర్గ రాజకీయాల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ పోతే… అంతిమంగా పార్టీకే డ్యామేజ్ అన్న చర్చ జరుగుతోంది బీఆర్‌ఎస్ సర్కిల్స్‌లో.