Off The Record: 2024 ఎన్నికల ఓటమికి కారణాలను విశ్లేషించుకున్న వైసీపీ అధినేత జగన్…. అప్పుడు దూరమైన వర్గాలను తిరిగి దరి చేర్చుకునే పనిలో సీరియస్‌గా ఉన్నారు. వన్ బై వన్ హర్డిల్స్‌ను దాటుకుంటూ వస్తున్న క్రమంలో… ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీద గట్టిగా ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఎప్పుడు మీడియా ముందు మాట్లాడినా…. ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తుండటం అందులో భాగమేనని అంటున్నారు పరిశీలకులు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంప్లాయిస్ కోసం ఏమేం చేశామో గుర్తు చేయడంతోపాటు కూటమి సర్కార్ ఉద్యోగులకు వెన్నుపోటు పొడుస్తోందని చెప్పే ప్రయత్నంలో ఉన్నారాయన. సీఎం చంద్రబాబు ఎన్నికల టైంలో చాలా హామీలు ఇచ్చారని, ఇప్పుడు వాటి గురించి కనీసం ఆలోచించడం కూడా లేదంటూ… ఉద్యోగులను తిరిగి తనవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేసినట్టు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నెలనెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని ఇచ్చిన హామీ కూడా ఇప్పుడు సక్రమంగా నెరవేరడం లేదన్నది వైసీపీ వాదన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల మాత్రమే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించి ఆ తర్వాత విడతల వారీగా వేర్వేరు తేదీల్లో చెల్లిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు జగన్.
అలాగే…. జనవరి వస్తే మొత్తం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంటాయని, ప్రభుత్వం మాత్రం ఒక డీఏ మాత్రమే మంజూరు చేసి దాన్ని కూడా మూడు వాయిదాల్లో చెల్లిస్తామనడం కరెక్ట్ కాదని విమర్శించడం వెనక గట్టి కారణాలే ఉండి ఉండవచ్చన్న అంచనాలున్నాయి.గత ఎన్నికల్లో తమకు దూరమైన ఉద్యోగులను తిరిగి దగ్గర చేసుకునేందుకే జగన్ ఈ తరహాలో ముందుకు వెళ్తున్నట్టు భావిస్తున్నారు. అప్పట్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు జగన్.. తాము ఉద్యోగులకు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అప్పట్లో ఏర్పడ్డ గ్యాప్ పార్టీకి నష్టం చేసిందని నిర్ధారణకు వచ్చిన జగన్… తిరిగి ఉద్యోగులకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల మీడియా సమావేశాలు పెట్టిన దాదాపు ప్రతి సందర్భంలో జగన్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో తామేం చేశామో చెప్పడంతో పాటు ఇప్పుడు కూటమి సర్కార్ ఏం చేయడం లేదో గుర్తు చేస్తూ… బలమైన ఆ వర్గాన్ని తమవైపునకు ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారట. గత ఎన్నికల్లో ఉద్యోగుల వల్ల కచ్చితంగా ఎంతోకొంత డ్యామేజ్ అయిందని పక్కాగా లెక్కలు వేసుకునే.. వైసీపీ అధ్యక్షుడు వాయిస్ మార్చినట్టు భావిస్తున్నారు పొలిటికల్ పండిట్స్.
2019 ఎన్నికల్లో ఉద్యోగుల సపోర్ట్ ఉండటంతోనే తమకు భారీ విజయం సాధ్యమైందని, ఇక అధికారంలోకి వచ్చాక ఎంత చేసినా వాళ్ళలో ఏదో తెలియని అసంతృప్తి పెరిగి గ్యాప్ ఏర్పడటం వల్ల కొంత పర్సంటేజ్ అయినా తేడా వచ్చిందని.. అందుకే ఈసారి ఆ గ్యాప్‌ను పూడ్చుకోవాలని అనుకుంటున్నారట జగన్. తమ ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్దంగా ఉద్యోగులను దూరం చేసేందుకు పనిగట్టుకుని కొందరు పనిచేశారని, గోరంత విషయాలను కొండంతలా చూపించి లేనిపోని భయాలను సృష్టించి దూరం చేశారనే అభిప్రాయంలో వైసీపీ పెద్దలు ఉన్నట్టు తెలిసింది. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయిస్‌కు మద్దతుగా వాళ్ళ సమస్యలపై తమ వైపు నుంచి గట్టిగా వాయిస్ వినిపించాలని డిసైడైనట్టు సమాచారం. ఉద్యోగ వర్గాలు కోరుకుంటే… ఆయా సమస్యల మీద ప్రత్యక్ష ఆందోళనలకు కూడా సిద్ధమవ్వాలన్న ఆలోచనలో ఉందట వైసీపీ. మరి ఒకసారి దూరమైన ఉద్యోగులు మళ్లీ దగ్గరికి వస్తారా? వాళ్ళను దరి చేర్చుకోవడానికి జగన్ స్కెచ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్నది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ.