Off The Record: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గుమ్మనూరు జయరాం. వైసీపీ హయాంలో ఐదేళ్లు మంత్రిగా వున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీ కండువా కప్పుకుని గుంతకల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారాయన. దాంతో ఇప్పుడు ఆలూరు మీద పట్టు తగ్గుతోందని అంటున్నారు. జయరాం మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇద్దరు సోదరులతోపాటు కజిన్ గుమ్మనూరు నారాయణ స్థానికంగా వ్యవహారాలు నడిపించేవారు. ఇంకా చెప్పాలంటే…అందరికంటే ఎక్కువగా నారాయణే కథ నడిపేవారట. అలాగే ఎక్కువ వివాదాలకు కూడా ఆయనే కేంద్ర బిందువు అయ్యారు. జయరాం మంత్రిగా వున్నప్పుడే… సొంతూరులో భారీ పేకాట క్లబ్ పై మహిళా ఏ ఎస్పీ దాడి చేయడం, గుమ్మనూరు నారాయణపై కేసు బుక్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అటు వైసీపీ కార్యకర్తల మీద నారాయణ దాడిచేయడం, చేయించడం..అప్పటి చిప్పగిరి జడ్పిటిసి విరుపాక్షితో ఘర్షణ వాతావరణం లాంటివివాదాలకు నారాయణే కేంద్రబిందువని చెబుతుంటారు. ఇక జయరాం ఆలూరు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి గుంతకల్లు ఎమ్మెల్యే అయ్యాక నారాయణకు గుత్తి మండల బాధ్యతలు అప్పగించారట. అక్కడ కూడా ఆయన వ్యవహారశైలి వివాదాస్పదం అయిందని చెబుతున్నారు.
అదే సమయంలో పాణ్యం మండల ఇన్చార్జిగా ఉన్న జయరాం కుమారుడు ఈశ్వర్‌కు, నారాయణకు మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. ఓ టీడీపీ కార్యకర్తపై నారాయణ చేయి చేసుకున్నారట. ఆ వివాదంతో పాటు జయరాం సొంత సోదరులతో కూడా కజిన్ నారాయణకు గ్యాప్ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో గుమ్మనూరు నారాయణ హోమ్ మంత్రి అనితను కలవడం, వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రచారం చేసుకోవడం లాంటివి విభేదాలను తీవ్రతరం చేశాయని అంటున్నారు. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా వారి మధ్య విబేధాలకు కారణమయ్యాయట. దీంతో నారాయణను గుత్తి మండల ఇన్చార్జిగా తొలగించారు జయరామ్. ఇద్దరి మధ్య ఇక పూడ్చలేనంత గ్యాప్ వచ్చిందని, అందుకే నారాయణ జనసేన కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే గుమ్మనూరు నారాయణ జనసేనలో చేరి ఆలూరు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకుని… వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా నిలబడాలని భావిస్తున్నారట. గుమ్మనూరు జయరాం మంత్రి అయ్యాక కజిన్ నారాయణ కూడా ఆర్థికంగా బాగా బలపడ్డారన్నది లోకల్ టాక్. ఆయన వెంట వుండే వాహన శ్రేణి, మంది, మార్బలం చూస్తేనే ఆర్థికంగా ఏ స్థాయికి చేరుకున్నారో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే జనసేన జిల్లా కన్వీనర్‌ని కలిసిన నారాయణ పార్టీ పెద్దలతో కూడా మాట్లాడారని, త్వరలో జనసేన కండువా కప్పుకునే అంశాన్ని చర్చించారని తెలుస్తోంది.
ఈ మొత్తం పరిణామాల్ని గమనిస్తున్న కొందరు కజిన్స్ ఇద్దరికీ చెడిందని అంటుంటే….మరికొందరు మాత్రం అంతా మన పిచ్చిగానీ…. వాళ్ళెందుకు కొట్టుకుంటారు, అదంతా రాజకీయ వ్యూహంలో భాగం అని అంటున్నారట. ఆలూరుపై కోల్పోయిన పట్టు సాధించాలన్న వ్యూహంలో భాగంగానే గుమ్మనూరు నారాయణ జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో గుమ్మనూరు జయరాం టీడీపీ నుంచి ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోవడం, ఆ తరువాత వైసీపీ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలవడం వంటి పరిణామాలను గుర్తు చేస్తున్నారు. ఇపుడు జనసేనలో చేరి తన సామాజికవర్గం బలంతో… ఆలూరు మీద పట్టు సాధించే వ్యూహం ఉందని కూడా అంటున్నారు. తాను జనసేనలో చేరుతున్నానని, మీ సహకారం కావాలంటూ… ఇప్పటికే ఆలూరు నియోజకవర్గ ప్రముఖుల్ని, పాత్రికేయుల్ని కలిసి కోరారట నారాయణ. నారాయణ త్వరలో గ్లాస్ కండువా కప్పుకోవడం ఖాయమైనా…. అది అన్నతో వచ్చిన గొడవా? లేక ఇద్దరూ కలిసి ఆడుతున్న పొలిటికల్ గేమా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.