Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూప్ వార్ అంతకంతకు పెరుగుతోందట. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ల మధ్య గ్యాప్ ఎక్కువ అవుతోందంటున్నారు. జిల్లాలో పార్టీకి అయ్యా అవ్వా లేరంటూ ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. మరో మాజీ మంత్రి సైతం అధికార పార్టీలో ఉండి అధికారులపైనే విమర్శలు చేశారు. ముఖ్యంగా… సిర్పూర్, ముథోల్ ,మంచిర్యాల నియోజకవర్గాల్లో గ్రూప్ లొల్లి తారా స్థాయికి చేరిందట. దేవాపూర్ సిమెంట్ పరిశ్రమలో గుర్తింపు సంఘం ఎన్నిక వ్యవహారం ఈ విషయాన్ని పతాక స్థాయికి తీసుకు వెళ్ళిందని చెప్పుకుంటున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే సోదరుడు పోటీచేసేందుకు ఉవ్విళ్ళూరుతున్న టైంలోనే… ఆయనతో సంబంధం లేకుండా మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు అభ్యర్థిని ప్రకటించడం వివాదాస్పదమైంది. మరోవైపు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప పార్టీలో ఉంటూనే… కాంగ్రెస్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, ఇంచార్జ్ మంత్రే కాదు.. అదిష్టానం సైతం జిల్లా పార్టీని పట్టించుకోవడం లేదని ఆరోపించడం అంతర్గత చర్చకు దారితీసింది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
దీనికంటే ముందే సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ రావి శ్రీనివాస్, ఎమ్మెల్సీ దండే విఠల్ మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కింది. దానికి అధిష్టానం కాస్త బ్రేక్ వేసినా తాజాగా కోనప్ప ఎపిసోడ్ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతోందని అంటున్నారు పరిశీలకులు. ఇక ఖానాపూర్ ,నిర్మల్ ,ముథోల్ నియోజకవర్గాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. ముథోల్‌లో మూడు వర్గాలుగా విడిపోయింది పార్టీ. ఎవరికి వారు ఆధిపత్యం కోసం పోరాడుతూ… కేడర్‌ని గందరగోళంలో పడేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఆదిలాబాద్ ,బోథ్ నియోజకవర్గాల్లోనామినేటెడ్ పదవుల కోసం లొల్లి ముదురుతోందంటున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు… రాష్ట్ర పార్టీ పెద్దలు కూడా ఫోకస్ చేయకపోవడం వల్లే…. ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయన్నది ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ముఖ్యుల అభిప్రాయం. ఇటీవల నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్వహించిన రివ్యూలో ఇలాంటి చాలా అంశాలు చర్చకు వచ్చాయట. ఆమె ఒక్కొక్కరితో పది నిమిషాల పాటు విడివిడిగా మాట్లాడటంతో…పార్టీకి జరుగుతున్న నష్టాన్ని విపులంగా చెప్పారట జిల్లా ముఖ్య నాయకులు. పార్టీ అధికారంలోకి రాగానే జంపైపోయి వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళకు మధ్య మనస్పర్ధలే అసలు సమస్యగా తెలుస్తోంది.
Read Also: PM Modi On Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. మృతులకు ప్రధాని మోడీ సంతాపం
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవికోసం పోటీ పెరుగుతోంది. నాయకులు ఎవరికి వారుగా…. గాడ్‌ఫాదర్స్‌ని సంప్రదిస్తూ ప్రయత్నాల్లో మునిగితేలడంతో…. జిల్లా పార్టీ ఆగమాగం అవుతోందంటున్నారు. వీళ్ళ గోలలో వీళ్ళు మునిగి తేలుతూ… ప్రభుత్వం మీద ప్రతిపక్షాల విమర్శలను అస్సలు పట్టించుకోవడం లేదని, తిప్పికొట్టే ప్రయత్నం అస్సలు జరక్కపోవడంతో… అబద్దాలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఈ పరిస్థితుల్లో…. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎలా డీల్ చేస్తారోనన్న ఆందోళనలు సైతం ఉన్నాయట. వీళ్ళింతేనా? ఎప్పటికీ మారరా ? పార్టీ పెద్దలు పట్టించుకోరా అంటూ నిట్టూరుస్తోంది ఆదిలాబాద్ కాంగ్రెస్ కేడర్.