మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఆ జిల్లా మంత్రులు ఒక్కటై తిరుగుబాటు చేయడం బీఆర్‌ఎస్‌లో కలకలం రేపింది. ముందెన్నడూ లేనివిధంగా బహిరంగంగా ఓ మంత్రిపై జిల్లా ఎమ్మెల్యేలంతా తిరగబడటం ఆ పార్టీలో సంచలనంగా మారింది. మార్కెట్ కమిటీ నియామకం వివాదంలో.. మంత్రి మల్లారెడ్డితో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి ఏమాత్రం సంబంధం లేకున్నా.. ఆ రహస్య సమావేశానికి హాజరయ్యారు. ఆ మరుసటి రోజే శంకుస్థాపనకు వచ్చిన మేయర్ గద్వాల విజయలక్ష్మీకి అవమానం జరగడం.. పార్టీలో తీవ్ర చర్చగా మారింది. సొంత పార్టీ మేయర్ నియోజకవర్గంలో శంకుస్థాపనకు వస్తే ఎమ్మెల్యే దూరంగా ఉండటం.. కార్యకర్తలతో గోబ్యాక్ అంటూ నినాదాలు చేయించడం ఎవరికీ మింగుడుపడటం లేదు.
గ్రేటర్ బీఆర్‌ఎస్‌లో వరుసగా రెండు రోజులు పార్టీకి నష్టం చేసే ఎపిసోడ్‌లు జరగడంతో అధిష్ఠానం ఆరా తీసింది. ఉప్పల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఏం జరిగిందని సమాచారం తెప్పించుకుంది. వాస్తవానికి ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ముందే డేట్ ఫిక్స్ అయింది. ఈ సమాచారం హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఇచ్చారు. ఆ తర్వాత కార్యక్రమం మంగళవారానికి వాయిదా పడిందని చెప్పారట. ఎమ్మెల్యే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే మేయర్ .. ఉప్పల్ నియోజకవర్గ శంకుస్థాపనకు హాజరయ్యారు. అక్కడికి మేయర్ చేరుకున్నా ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అడ్రస్ లేరు. అన్ని ఏర్పాట్లు చేశారు.. జిహెచ్‌ఎంసీ నిధులతో పనులు చేస్తుండటంతో ప్రారంభించేందుకు గద్వాల విజయలక్ష్మి రెడీ అయ్యారు. ఇంతలోనే సొంత పార్టీ కార్యకర్తలు మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కలకలం రేగింది. ఎమ్మెల్యే లేకుండా ఎలా శంకుస్థాపన చేస్తారని విజయలక్ష్మిని నిలదీశారు సుభాష్‌రెడ్డి అనుచరులు.
ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సొంతపార్టీ మహిళా మేయర్‌ను అడ్డగించడానికి అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. ఉప్పల్ ప్రోగ్రామ్‌కు మంత్రి మల్లారెడ్డి కూడా వస్తున్నారని ఊహించిన ఎమ్మెల్యే బేతి ఆకస్మాత్తుగా వాయిదా వేశారు. ముందురోజే మంత్రిపై తిరుగుబాటు చేసి.. ఆ మరుసటి రోజు అదే మంత్రితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం ఎందుకు అనుకున్నారో ఏమో.. రాలేదు. అయితే ఎమ్మెల్యే బేతి చేసిన పనికి మాత్రం పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. వరుస ఘటనలతో పార్టీని బలహీనపరిచేందుకు కుట్ర జరగుతుందన్న అనుమానం వ్యక్తం చేస్తోంది హైకమాండ్. ఇప్పటికే ముగ్గురు ఆశావహులు ఉప్పల్ నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే వ్యవహార శైలిపై పార్టీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది.