Off The Record: ఆర్కే రోజా… ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్. ఎనీ సబ్జెక్ట్, ఎనీ సెంటర్… తెలిసినా, తెలియకున్నా సరే.. వాగ్ధాటితో అవతలోళ్ళ నోరు మూయించడంలో దిట్ట. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి…మంత్రిగా పనిచేసిన రోజా…. గత ఎన్నికలలో దారుణమైన ఓటమి తర్వాత దాదాపుగా పొలిటికల్ అజ్ఞాతంలో ఉన్నారు. పాలిటిక్స్‌లో నోరే నా ఆయుధం అనుకున్న మాజీ మంత్రికి గత ఎన్నికల్లో అదే రివర్స్ అయిందన్న అభిప్రాయం ఉంది. అప్పటి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు రోజా స్థాయిని దిగజార్చాయంటారు పొలిటికల్ పండిట్స్. అలాగే… సొంత పార్టీలో వ్యతిరేక కుంపటి, మంత్రి అయ్యాక హంగు ఆర్భాటం, విలాసవంతమైన జీవితం… అన్నీ కలగలిసి దాదాపు నలభై వేల తేడాతో నగరిలో ఓడిపోయారామె. చాలా మంది నాయకులు విలాస జీవితాలు గడుపుతున్నా… రోజా ఓవర్‌గా ఎక్స్‌పోజ్ అయ్యారన్నది విస్తృతాభిప్రాయం. ఓటమి తర్వాత పూర్తిగా చెన్నైకి మకాం మార్చారు మాజీ మంత్రి. అయినా గతం ఆమెను వెంటాడుతూనే ఉందట. సొంత నియోజక వర్గంలో వివాదాలు 2019 నుంచే ఉన్నాయి. జిల్లాలో రాజకీయంగా తనను అణగదొక్కడానికి కొందరు చూస్తున్నారని, ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పలు సందర్భాల్లో బహిరంగంగానే అన్నారు రోజా.
Read Also: Health Benefits Of Betel Leaves : తమల పాకుతో ఇన్ని లాభాలా?.. మీరూ ట్రై చేయండి
నగరి వైసీపీలో తనకు కొరకరాని కొయ్యలుగా మారిన వారిని బయటికి పంపేందుకు నేరుగా జగన్ దగ్గరే పంచాయితీ పెట్టినా వర్కౌట్ కాలేదు. అలాంటి స్థానిక నేతలందర్నీ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సహిస్తున్నారన్నది రోజా వర్గం అనుమానం అట. నగరి నియోజకవర్గంలో కీలక నేతలందరూ పెద్దిరెడ్డి అనుచరులేనని, ఆయన ఆదేశాలతోనే తనను ఓడించడానికి కుట్రలు జరుగుతున్నాయని, 2014 నుంచి వాళ్ళు అదేపనిలో ఉన్నారంటూ గతంలో ఓపెన్ స్టేట్ మెంట్సే ఇచ్చారు రోజా. పెద్దిరెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైతం తనకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారన్నది రోజా ఆరోపణ. చివరికి అంతా కలిసి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా సక్సెస్ అవలేకపోయారని కూడా చాలాసార్లు అన్నారామె. తాను మంత్రిగా ఉండి కూడా సొంత నియోజకవర్గంలో అసమ్మతులను తగ్గించలేకపోవడానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అన్న ఆవేదన రోజాకు ఉండేదని అంటారు ఆమె సన్నిహితులు. చివరికి పెద్దిరెడ్డి కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డికి రాఖీ కట్టి మరీ.. రాజీకి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని, తండ్రీ కొడుకులు ఇద్దరూ తమ అనుచరుల ద్వారా నగరిలో ఇబ్బందులు పెట్టారంటూ… సన్నిహితుల దగ్గర వాపోయేవారట రోజా.
Read Also: Varun Dhawan : స్టార్ హీరోయిన్లతో మిస్ బిహేవియర్‌పై వరుణ్ ధావన్ వివరణ
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు.. ఇలా అడపా దడపా అసంతృప్తి వెళ్ళగక్కడమే తప్ప… ఏం చేయలేకపోయారామె. కానీ… ఇప్పుడు రోజులు మారాయ్…. పరిస్థితులు తిరగబడ్డాయ్… తాను కూడా ఓడినా సరే… పార్టీ ఓటమి తర్వాత రోజా గేర్ మార్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. పాత పగను గుర్తు చేసుకుంటూ… తానేంటో నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ ఎక్కువ సీట్లు గెల్చుకోలేకపోవడానికి కారణాలను కార్యకర్తల సమావేశంలో వివరించారు రోజా. ఎప్పుడూ జిల్లాలో ఎక్కువ సీట్లు గెల్చుకునే పార్టీ… ఈసారి దారుణంగా దెబ్బ తినడానికి దిగజారుడు రాజకీయాలే కారణమని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారామె. ఇదే ఇప్పుడు చిత్తూరు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో పెద్దిరెడ్డిదే కీలక పాత్ర అని అంతా అంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని ఉద్దేశించే రోజా ఆ మాట అని ఉంటారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఉమ్మడి చిత్తూరులో. అంటే…ఇప్పుడిక ఆయనతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారా అన్న డౌట్స్ వస్తున్నాయట. పెద్దిరెడ్డిని ఢీ కొట్టడానికి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి… రోజా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారన్న టాక్ సైతం నడుస్తోంది. సొంత తప్పిదాల సంగతి ఎలా ఉన్నా… నియోజకవర్గంలో తనను జీరో చేసిన పెద్దిరెడ్డి అండ్ కోను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇప్పుడు అంటున్నారట రోజా. ఈ విషయంలో ఇకపై తగ్గేదేలే అంటున్నట్టు సమాచారం. ముందు ముందు చిత్తూరు వైసీపీ రాజకీయంలో ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి మరి.