Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతానికి…పార్టీ హైకమాండ్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కమలం పార్టీకి వాస్తు సెట్ అవుతున్నట్టు లేదు. ఇతర పార్టీల్లో నుంచి ఏ నాయకుడు వచ్చినా ఎంత పెద్ద లీడర్ వచ్చినా.. లీడర్‌గా ఉంటున్నారే తప్పా…పార్టీని బలోపేతం చేసే దిశగా ఎలాంటి చర్యలు తీలుకోలేకపోతున్నారు. అదే సమయంలో పార్టీలో నేతల నుంచి అంతంత మాత్రమే సహకారం అందుతోందనే భావన వ్యక్తం అవుతోంది. కన్నా లక్ష్మినారాయణ లాంటి సీనియర్ నేత కూడా పార్టీని వీడి వెళ్లిపోయేలా చేశారని…ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ నేతల నుంచి.. పార్టీ ముఖ్యుల నుంచి సహకారం అందుతుందా..? లేదా..? అనే చర్చ జరుగుతోంది.
తమ ఉనికి కోసమైనా.. పార్టీని బలోపేతం చేసే దిశగా ఎవరైనా ముందుకు వస్తే.. వారి మీద ఏదోక బురద జల్లడం ఏపీలోని కొందరు కమలనాధులకు అలవాటైపోయిందని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో…కొంత ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే కాలం గడిచే కొద్దీ…కన్నా లక్ష్మినారాయణ మీద లేనిపోని ఆరోపణలు గుప్పించారు. పార్టీకి.. కన్నాకు గ్యాప్ పెంచేలా కొందరు నేతలు తెర వెనుక నుంచి ప్రయత్నించారనే వాదన వినిపిస్తోంది.
ఇప్పుడు ఏపీలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకొని…కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా ప్రయత్నించినా…దాన్ని కచ్చితంగా కొందరు అడ్డుకునే తీరుతారని అంటున్నారట పార్టీలోని నేతలు. ప్రస్తుతం అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న చాలా మంది నేతలతో…కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిపై కిరణ్ కొంత ఫోకస్ పెడితే వారు పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలకు ఏపీ కమలనాధుల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉందనే చర్చ జరుగుతోందట. కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు…కర్ణాటక, తెలంగాణల్లో ఏమైనా ఫలిస్తాయేమో కానీ.. ఏపీలో మాత్రం కిరణ్ నెగ్గుకు రావడం కష్టమనే చర్చ ఏపీ బీజేపీ వర్గాల్లో జరుగుతోందట.