తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ లక్ష్యంగా ఏఐసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి.. ఇంకా వెళ్తూనే ఉన్నాయి. కాంగ్రెస్‌లో ఇది సహజమైన చర్యే. దీనికితోడు వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో అధిష్ఠానం కూడా దిద్దుబాటు చర్యలకు దిగాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు.. కార్యదర్శుల నియామకం జరగాల్సి ఉంది. గుజరాత్ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తారని భావించారు. ఇంతలో ఆంధ్రప్రదేశ్‌కి పూర్తిస్థాయిలో పీసీసీ కమిటీని ప్రకటించింది. ఇటీవల కర్ణాటకకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లోనూ ప్రక్షాళన ఉంటుందని చర్చ నడుస్తోంది.
Read Also: Off The Record: దెందులూరులో పొలిటికల్ హీట్.. కాలు దువ్వుతున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
తెలంగాణలో కాంగ్రెస్‌కి బలమైన కేడర్ ఉంది. నాయకులు కూడా బలమైన వాళ్లే. కానీ వారి మధ్య సమన్వయం లేకపోవడం పెద్ద సమస్య. వాటన్నిటినీ సెట్ చేయాల్సిన రాష్ట్ర ఇంచార్జ్ ఠాగూర్ ఆ విషయంలో సక్సెస్ కాలేదనే అభిప్రాయం ఉంది. పీసీపీని వ్యతిరేకించే చాలామంది నేతలు ఇదే అంశాన్ని ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఆ తర్వాతైనా ఠాగూర్ తన వ్యవహార శైలిని మార్చుకోలేదని టాక్. పార్టీలో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతూ ఉంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదనేది ప్రధానమైన ఆరోపణ. పైగా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారనేది సీనియర్ల ఆగ్రహం. వీటన్నింటినీ పరిశీలించిన అధిష్ఠానం.. రాష్ట్ర కాంగ్రెస్ ని ప్రక్షాళన చేయాలని భావించిందట.
Read Also: Off The Record: వైసీపీ ఓపెన్ ఆఫర్..! ముద్రగడ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తారా?
ప్రక్షాళన చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ ని మార్చేస్తారని టాక్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఠాగూర్.. తెలంగాణని లీడ్ చేయలేరనే అభిప్రాయానికి ఏఐసీసీ వచ్చినట్టు సమాచారం. అందుకే ఇంచార్జిని మార్చేస్తున్నట్టు సమాచారం. పనిలో పనిగా ఏఐసీసీ కార్యదర్శి బోసురాజును కూడా మార్చేస్తారనే టాక్ నడుస్తోంది. కర్ణాటక ఎన్నికలు ఉండటంతో ఆయన్ని తప్పిస్తారని చెబుతున్నారు. వీరు కాకుండా తెలంగాణలో AICC కార్యదర్శులుగా రోహిత్ చౌధురి, నదీం జావెద్ ఉన్నారు. వీరిని కదపరని సమాచారం. ఇద్దరూ ప్రియాంకాగాంధీ టీమ్ సభ్యులు. అందుకే ఒకరికి పార్టీ పదవుల పరంగా ప్రమోషన్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తనికి తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రక్షాళన మొదలైందనే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. అది ఎంత త్వరగా చేపడతారనేదే ప్రస్తుతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.