Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో కులం కుంపటి పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కమ్మ వర్సెస్ కాపుగా మారడం ఆందోళనకరమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే పార్టీ పాత నాయకులు, మారి వచ్చిన వాళ్ళు అన్న లెక్కలు కూడా ఉన్నాయట. చివరికి మేటర్ ముదిరి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసేదాకా వెళ్ళిందట. ఎమ్మెల్సీ దండే విఠల్ లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరారు. సొంత నియోజకవర్గం సిర్పూర్‌గా చెప్పుకోవడం, ఇక్కడే ఫోకస్ పెంచడంతో వివాదం ముదిరినట్టు చెప్పుకుంటున్నారు. విఠల్ తన వర్గాన్ని తయారు చేసుకునే క్రమంలో… బీఆర్‌ఎస్, బీఎస్పీ నుంచి వచ్చిన వాళ్ళని ప్రోత్సహిస్తూ… ఇన్నాళ్ళు కాంగ్రెస్ కోసం పనిచేసిన వారిని విస్మరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు ప్రోటోకాల్ పోస్ట్ ఉందన్న కారణంతో… జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఆయన చెప్పిన మాటలే వినడం, ఆయనకే నిధులు, ఇతర పనులను చేసే బాధ్యతలు అప్పగిస్తుండటంపై నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ వర్గం గుర్రుగా ఉందంట.
ఎమ్మెల్సీ దంటే విఠల్‌ను మంత్రి తోపాటు మరో నేత ఎక్కువగా ప్రోత్సహిస్తూ తన ప్రాధాన్యం తగ్గిస్తున్నారంటూ.. రావి శ్రీనివాస్ ఏకంగా రోడ్డెక్కారు. క్యాడర్‌కు పనులు చేయాలంటూ డైరెక్ట్‌గా ఎమ్మెల్సీ ఇంటికెళ్ళారాయన. అక్కడ విఠల్ అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి నేతలకు పెత్తనం ఇవ్వడమే తప్పు అంటూ… ఏకంగా జిల్లా ఇంచార్జ్ మంత్రిని మార్చాలని పట్టుబడుతున్నారట. ఇలా చుట్టపు చూపుగా వచ్చేవాళ్లకు పెత్తనం ఇస్తే పార్టీకి నష్టం జరగుతుందంటూ మీడియా ముందు విమర్శలు చేశారు రావి. ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నిక తెల్లదంటూ… నిర్మల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కోర్టులో కేసు వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరితే పదవికి ఎలాంటి గండం ఉండదని భావించి జంప్ చేశారన్న ప్రచారం కూడా ఉంది నియోజకవర్గంలో. పదవి కాపాడుకోవడం కోసం వచ్చిన నేతను అందలం ఎక్కించి గ్రూపులకు ఆజ్యం పోస్తూ… సిసలైన కాంగ్రెస్ వాదుల్ని పక్కన పెడుతున్నారంటూ సిర్పూర్ కేడరే ఫైరవుతోందట. అదంతా ఒక ఎత్తయితే…. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు.
నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్, కోనప్ప వరుసకు మామ అల్లుళ్లు. ఇద్దరిదీ కమ్మ సామాజికవర్గం. దాంతో ఇద్దర్నీ దృష్టిలో ఉంచుకుని… సిర్పూర్ నియోజకవర్గంలో కమ్మ నేతల ఆటకట్టించాలని ఎమ్మెల్సీ విఠల్ వర్గం అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక్కడే అగ్గి పూర్తి స్థాయిలో అంటుకుంది. ఇన్నేళ్ళలో లేనిది విఠల్ వచ్చాక కులాల పేరుతో నియోజకవర్గంలో పార్టీని సర్వ నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు ఇన్ఛార్జ్ రావి. జిల్లా ఇంచార్జ్‌గా చెప్పుకునే మరో కాపు సామాజికవర్గం నేత కూడా కమ్మ నాయకుల్ని తొక్కాలన్న ఉద్దేశ్యంతో పని చేస్తున్నారంటూ…. పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్ళారట ఆయన. ఈ పరిస్థితుల్లో రావి శ్రీనివాస్‌ని పార్టీ నుంచి బహిష్కరించమంటూ… డీసీసీ అధ్యక్షుడు పార్టీ క్రమశిక్షణా కమిటీకి లేఖ రాయడం ఇందులో ఇంకో ట్విస్ట్. ఈ గొడవలు, కులాల కుంపట్లతో… సిర్పూర్ కాంగ్రెస్ చీలికలు పేలికలవుతోందని అంటున్నారు. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని గొడవల్ని పరిష్కరించకుంటే… మొదటికే మోసం వస్తుందన్న భయం పెరుగుతోందట కేడర్‌లో.