Off The Record: తెలంగాణలో కమలం పార్టీకి మంచి వాతావరణం ఉందని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… అధికారం మాదేనంటూ ఢంకా బజాయిస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది. పవర్‌లోకి వస్తామన్న నమ్మకం ఉండటం ఏ పార్టీకైనా మంచిదే. కానీ… పనేమీ చేయకుండా అలా నమ్మేస్తే సరిపోతుందా? క్షేత్ర స్థాయిలో చేయాల్సిన పనులు చేయకుండా మాకు అధికారం వస్తుంది…. వస్తుంది అంటూ ప్రచారం చేసుకుంటే నిజంగా వచ్చేస్తుందా? ఈ ప్రశ్నలు వేస్తోంది ఎవరో బయటి వ్యక్తులు కాదు. స్వయంగా బీజేపీ కార్యకర్తలే. ఎప్పుడు చూసినా… జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేయడం, చేతులు దులుపుకోవడం తప్ప… రాష్ట్ర పార్టీ చేసిన పెద్ద కార్యక్రమం ఏది? ఇంతవరకు అస్సలు ఒక్క ప్రోగ్రామ్‌కైనా పిలుపునిచ్చారా? క్షేత్ర స్థాయిలో పారాడారా? జనాన్ని పోగేశారా? ఇవన్నీ చేయకుండా అధికారంలోకి వచ్చేస్తామని కలలుగంటూ కూర్చుంటే ఎలాగన్నది కేడర్ క్వశ్చన్. అయితే… అదే సమయంలో కొందరు నాయకుల ఆన్సర్ మరోలా ఉందట.
Read Also: CM Siddaramaiah: ఇంత మంది వస్తారని ఊహించలేదు.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
అసలు జాతీయ పార్టీనే… ఊపిరి సల్పనీయకుండా ప్రోగ్రామ్స్ ఇస్తోందని, ఒకటి పూర్తవక ముందే ఇంకో కార్యక్రమం ఇస్తుంటే… ఇక ఇక్కడ ఆలోచించడానికి టైం ఎక్కడుందన్నది వాళ్ల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇన్ని కార్యక్రమాలు ఇస్తే దేన్నీ ప్రభావవంతంగా చేయలేమని కూడా అంటున్నారట. ఈ మధ్య కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్, వక్ఫ్ సవరణ చట్టం, అహల్యాబాయి జయంతి , ఆటల్ శత జయంతి, ఇప్పుడు యోగా డే, ఎన్విరాన్ మెంట్ డే, ఎమర్జెన్సీ కి 50 ఏళ్ళు, ప్రధానిగా మోడీకి11 ఏళ్ళు పూర్తి…. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర పార్టీ ఇస్తున్న కార్యక్రమాలే చాలా ఉన్నాయని చెబుతున్నారు. అదే సమయంలో మరో వాదనా వినిపిస్తోంది. కేంద్ర పార్టీ కార్యక్రమాలు ఇస్తుంది సరే… వాటితోనే.. మనకు సరిపోదుకదా… లోకల్‌గా, రాష్ట్ర సమస్యలను తీసుకుని జనంలోకి వెళ్ళినప్పుడే అధికార పార్టీని ఢీ కొట్టగలుగుతామని, లేదంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతామని చర్చించుకుంటున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలు, ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం పై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నవి మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప… చేసిన దాఖలాలు ఎక్కడని ప్రశ్నిస్తోంది ఓ వర్గం.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఏదో.. నామమాత్రంగా చేశామంటే చేశామన్నట్టుగా మమ అనిపించి సర్దుకోవడం తప్ప రాష్ట్ర స్థాయి ఆందోళకు పిలుపునిచ్చిన కార్యక్రమం ఒక్కటి చూపండని కేడర్ అడుగుతున్న పరిస్థితి. జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని కాస్త తగ్గించి… తెలంగాణలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, అలా చేసినప్పుడే పార్టీ ప్రజల్లోకి వెళ్ళి అధికారం వస్తుంది తప్ప… మేం పవర్‌లోకి వస్తాం, వచ్చేస్తామని మాటలు చెప్పుకుంటూ తిరిగితే లాభం ఉండదన్నది కేడర్ వాయిస్. అలా లోకల్ ఇష్యూస్ తీసుకుంటే… స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కి ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. రాష్ట్ర పార్టీ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.