Off The Record: కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్… 665 పేజీల నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ దాన్ని పూర్తిగా స్టడీ చేసి 60 పేజీల సారాంశాన్ని క్యాబినెట్‌కు అందించింది. అయితే ఈ అరవై పేజీల నివేదికలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రమే ప్రస్తావించి వారు సక్రమంగా విధులు నిర్వర్తించ లేదని స్పష్టం చేసింది. మాజీ సీఎస్, ఇరిగేషన్ సెక్రటరీగా పని చేసిన ఎస్కే జోషి, మాజీ సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ పేర్లు ఆ 60 పేజీల రిపోర్ట్‌లో ఉన్నాయి. ఇప్పుడు దీని గురించే బ్యూరోక్రాట్స్ లో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోందట. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుమతుల స్థాయి నుంచి నిర్మాణం పూర్తి అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చినప్పటిదాకా…ఉన్న ఐఏఎస్ లను విచారించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.ఒక్కో ఐఏఎస్ ను 20 నుంచి 30 ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అయితే కమిషన్ పూర్తి నివేదికలో వారి ప్రస్తావన లేక పోవడంపై ఐఏఎస్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Off The Record: బీసీ రిజర్వేషన్ అంశం బీఆర్ఎస్‌కు ఇరకాటంగా మారిందా?
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టవద్దన్న నిపుణుల కమిటీ నివేదికను తొక్కి పెట్టడంలో ఎస్కే జోషి పాత్ర ఉందని.. అనుమతుల్లోనూ నిబంధనలు పాటించలేదని… ప్రాజెక్టు వైఫల్యంలో జోషి బాధ్యత ఉందని నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైళ్లను మంత్రివర్గం ముందు ఉంచకుండా నిబంధనల్ని ఉల్లంఘించారని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అశ్రద్ధ, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారంటూ స్మితా సబర్వాల్ ను తప్పుపట్టారు. వాళ్ళిద్దరు తప్ప ఆ టైంలో కీలకపాత్ర పోషించిన మిగతా వాళ్లని ఎందుకు వదిలేశారన్న అనుమానాలు పెరుగుతున్నాయట ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా 2016 జూన్ నుంచి 2019 మే వరకు వికాస్ రాజ్ కొనసాగారు. 2019లో 16 రోజుల పాటు సోమేష్ కుమార్ స్పెషల్ సీఎస్ గా వ్యహరించారు. 2021 ఫిబ్రవరి నుంచి 2023 నవంబర్ వరకు స్పెషల్ సీఎస్ ఇరిగేషన్ గా రజత్ కుమార్ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఆర్థిక శాఖలో ఒకరిద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు మారినా దాదాపు 10 సంవత్సరాల పాటు కీలక పదవుల్లో రామకృష్ణారావు కొనసాగారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన హైలెవల్ కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ప్రాజెక్టుకు నిధుల విడుదల ఆయన ద్వారానే జరిగింది. ఈ విషయాన్ని 2024 జనవరిలో పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ సందర్భంగా ఆయనే తెలిపారు.
Read Also: Anchor Ravi : బిగ్ బాస్ కు వెళ్తే నాశనమే.. యాంకర్ రవి సంచలనం..
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో అటవీశాఖ స్పెషల్ సీఎస్ గా శాంతికుమారి పని చేశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారామె. అయితే కమిషన్ నివేదికలో నాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్, ఆర్థిక శాఖల మంత్రులను తప్పుపట్టారు. ఇక్కడే అనుమానం వస్తోందట కొన్ని వర్గాల్లో. సీఎస్, స్పెషల్ సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీల ప్రమేయం లేకుండా మంత్రులను, ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి అడిషినల్ సెక్రటరీని ఏ విధంగా భాద్యులను చేస్తారన్న చర్చ జరుగుతోందట ఐఏఎస్ వర్గాల్లో. కాళేశ్వరం పనులతో తమకు సంబంధం లేదని అంటున్న అధికారులు పిసి ఘోష్ కమిషన్ కు అఫిడవిట్లు సమర్పించి… క్రాస్ ఎగ్జామిన్ కూడా హాజరయ్యారు. ప్రాజెక్టు నిధుల విడుదల మొత్తం రామకృష్ణారావే చూశారని.. వేల కోట్ల చెక్కులను, బిల్లులను ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సీఎస్ హోదాలో క్లియర్ చేశారని ఐఏఎస్ లు అంటున్నారు. కాళేశ్వరం నిర్మాణ సమయంలో అటవీశాఖ స్పెషల్ సీఎస్ గా శాంతకుమారి ఉన్నారు. అనుమతులు ఇవ్వడంలో ముఖ్య పాత్ర ఆమె పోషించారని బ్యూరోక్రాట్స్ అభిప్రాయ పడుతున్నారు. ఐదే ఇటీవల రామకృష్ణారావు ఛైర్మన్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. పిసి ఘోష్ కమిషన్ కు గత ప్రభుత్వ క్యాబినెట్ మినిట్స్ ఇవ్వడానికి ఈ కమిటీ వేశారు. కాళేశ్వరం పనుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న రామకృష్ణారావును కమిటీ చైర్మన్ గా నియమించడం… ఇప్పుడు కమిషన్ సమర్పించిన నివేదికలో ఆయన పేరు లేకపోవడంపై ఐఏఎస్ లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.