Off The Record: 2024లో మరోసారి అధికారంలోకి వచ్చిన 9 నెలలకు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ వ్యవహారాలపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఇన్నాళ్ళు ప్రభుత్వ పరంగా పాలనా వ్యవహారాల్లో మునిగితేలిన బాబు… ఇప్పుడిప్పుడే పార్టీ మీద దృష్టిపెట్టినట్టు కనిపిస్తోందని అంటున్నారు. అదే సమయంలో.. ఇంతకు ముందులా స్వీట్ వార్నింగ్స్ కాకుండా… ఘాటు హెచ్చరికలు వెళ్ళడంతో…ఒక్కసారిగా టాప్ టు బాటమ్ పార్టీ అటెన్షన్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ మీటింగ్‌లో ఎమ్మెల్యేలకు వార్నింగ్స్, ఏపీ ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ జీవీరెడ్డి ఎపిసోడ్‌లో రియాక్షన్స్ చూసి ఆ… ఏముందిలే అనుకున్నవాళ్ళు సైతం తాజాగా…గంగాధర నెల్లూరు కార్యకర్తల మీటింగ్‌లో రియాక్షన్ చూసి షాకయ్యారట. ఏముంది… అంతా రొటీన్ అనుకుంటున్న టైంలో… స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో పాటు ఇతర నేతలకు ఝలక్ ఇచ్చారట టీడీపీ అధ్యక్షుడు. ఎమ్మెల్యే థామస్ పనితీరు ఓవరాల్ గా ఓకేగానీ… ఇంకా బాగా పనిచేయాలని, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరవ్వాలని సాదాసీదాగా చెప్పకుండా… లెక్కలతో సహా కార్యకర్తల ముందు పెట్టడంతో అంతా అవాక్కయ్యారట. ఎమ్మెల్యే కొన్ని కార్యక్రమాలకు డుమ్మా కొట్టారని, పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం లేదని, సొంత పనులు కాస్త తగ్గించుకుని ఎక్కువగా నియోజకవర్గంలో ఉండాలని చెప్పడంతో పాటు ఆఖరికి సోషల్ మీడియా వాడకంలో సైతం ఆయన వెనకబడ్డారంటూ… ఫేస్‌బుక్ పోస్ట్‌ల డేటాను సైతం చెప్పేసరికి షాకవడం ఎమ్మెల్యే వంతయిందని అంటున్నారు.
గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల్ని హెచ్చరించినా… ఈసారి మాత్రం మేటర్ అందుకు భిన్నంగా ఉందనే చర్చ టిడిపిలో గట్టిగానే జరుగుతోందట. ఎమ్మెల్యే పనితీరు నుండి బూత్ స్థాయిలో పనిచేసే కమిటీల వరకు అందరి డేటా తీసి ఇదీ… మీ పనితీరు అని చెప్పడంతో పాటు నేను గౌరవిస్తాను, అవసరమైతే కొరడా ఝళిపిస్తానని చెప్పారు బాబు.ఇక వైసీపీకి ఏ స్థాయిలోనూ సహాయ సహకారాలు అందించొద్దని వార్నింగ్ ఇవ్వడానికి కూడా ప్రత్యేక కారణం ఉందని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే ధామస్ గత కొంతకాలంగా వైసిపి నేతలకు సహకరిస్తున్నారన్న ప్రచారమే కారణం అయిఉండవచ్చన్నది పార్టీ ఇన్నర్ టాక్.చాలామంది ఎమ్మెల్యేలకు వైసీపీ నేతలతో చీకటి ఒప్పందాలున్నాయని కేడర్ మొత్తుకుంటోంది. ఇక మీదట అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే జీడీ నెల్లూరును ఉదాహరణగా చూపిస్తూ చంద్రబాబు రాష్ట్రం మొత్తానికి ఒక మెసేజ్ పంపి ఉంటారని అనుకుంటున్నారట తమ్ముళ్ళు. చంద్రబాబు మాటలతో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు సమాచారం. జిల్లాలో చాలామంది వైసిపి మాజీ ఎమ్మెల్యేలతో కలసి వ్యాపారాలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి.
ఆ సమాచారాన్ని ముందే తెప్పించుకున్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న చర్చ నడుస్తోంది. తప్పులన్నీ చిత్రగుప్తుడి లెక్కల తరహాలో ఉన్నాయని… నా చుట్టూ పదవుల కోసం సీట్లు కోసం తిరిగితే ఎలాంటి ప్రయోజనం ఉండదని కుండబద్దలు కొట్టడంతో… ఇక నుంచి చంద్రబాబు కఠినంగా ఉంటారా అని మాట్లాడుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. జీడీ నెల్లూరులో జరిగింది ఒక నియోజకవర్గస్థాయి సమావేశమైనప్పటికీ రాష్ట్ర స్థాయిలో తెలిసేలాగా కావాలనే ఆయన బహిరంగంగా ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారని, అందరికీ ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పకనే చెప్పారని అంటున్నారు పార్టీ నాయకులు. ఇకపై ఒత్తిడితోనో మొహమాటానికో ఎవరికి పదవులు ఇవ్వబోమని, పనితీరు, ప్రజాబలం ఉన్న వారికే పార్టీ టిక్కెట్స్ అన్న సందేశాన్ని గట్టిగా పంపేలా చంద్రబాబు ఒక స్టాండ్ తీసుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. పార్టీ ఎమ్మెల్యేలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.