Off The Record: నా బంగారం… అసెంబ్లీలో కొరమీనంత మైకట్టుకోని అధ్యచ్చా…. అంటుంటే దాన్ని నేను టీవీలో చూసి మురిసిపోవాల. ఓ పాపులర్ సినిమాలో విలన్ డైలాగ్ ఇది. సినిమా కాబట్టి విలన్ నోట్లో నుంచి ఆ డైలాగ్ వచ్చినా… బయట చాలామంది పొలిటికల్ హీరోల డ్రీమ్ ఇది. సినిమాలో భార్యను ఉద్దేశించి విలన్ అన్నా… నిజ జీవితంలో మాత్రం ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలై పోవాలని కలలుగంటుంటారు. అధ్యక్షా అన్న మూడక్షరాలు పలకడానికి కొందరు నాయకులకు జీవితకాలం సరిపోదు… మరికొందరికి మాత్రం ఆయాచిత వరంలా దక్కుతూ ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే అసెంబ్లీ మెట్లెక్కేస్తారు. కానీ…తీరా ఎమ్మెల్యే అయ్యాక… చట్ట సభకు రావడం మానేస్తున్నారట చాలామంది. ఇందులో కొత్తవారు, పాత వాళ్ళు కలగలిసి ఉంటున్నారన్న చర్చ ఏపీలో హాట్ హాట్‌గా జరుగుతోంది. ఎమ్మెల్యేల అటెండెన్స్ మీద సాక్షాత్తు అసెంబ్లీ స్పీకరే ఆగ్రహం వ్యక్తం చేశారంటే… పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి.
Read Also: Hyderabad Rains : కుండపోత వర్షం.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
అసెంబ్లీకి రావడానికి మీకొచ్చిన ఇబ్బంది ఏంటని డైరెక్ట్‌గానే ప్రశ్నిస్తున్నారు స్పీకర్. జనం మిమ్మల్ని ఎన్నుకుంది, మీకు జీతాలిస్తోంది కూడా సభకు వచ్చి సమస్యల మీద మాట్లాడమనేకదా అన్నది ఆయన క్వశ్చన్. అంతే కాకుండా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకని అంటున్నారాయన….తిరుపతిలో జరిగిన పార్లమెంట్ మహిళా సాధికారత సమావేశంలోను, ఎన్టీఆర్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమలోనూ అవే వ్యాఖ్యల్ని రిపీట్ చేశారాయన. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం మనేశారు. జగన్‌కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే.. గేటుదాటి లోపలికి వస్తామన్నది వైసీపీ వెర్షన్. దీంతో స్పీకర్ ఎవర్ని ఉద్దేశించి పదేపదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్న గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఆయన కేవలం వైసీపీ ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకునే అలా మాట్లాడుతున్నారా? లేక సొంత కూటమిలోని శాసనసభ్యులను కూడా కలిపి చురకలంటిస్తున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. కేవలం వైసీపీ విషయంలోనే అయితే… దాని గురించి ఇప్పటికే రకరకలా విమర్శలు వచ్చాయి, వస్తున్నాయి. కనీసం ఒక్కసారి కూడా అటెండ్ అవకుంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారం నిర్ణయాలు ఉంటాయి, అది వేరే సంగతి. కానీ స్పీకర్ రిపీటెడ్‌గా అదే అంశాన్ని నొక్కి చెబుతుండటంతో… ఇది కూటమి ఎమ్మెల్యేలకు కూడా ఒక హెచ్చరికా అన్న అనుమానాలు కలుగుతున్నాయట పొలిటికల్ సర్కిల్స్‌లో. వైసీపీ ఎలాగూ అధికారికంగా ప్రకటించి మరీ… దూరంగా ఉంది.
కానీ… గత అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం శాసనసభ్యుల హాజరు కూడా… చాలా తక్కువగా ఉందట. రెండు రోజుల పాటు సగం మంది ఎమ్మెల్యేలు కూడా సభలో లేని పరిస్థితి. దీన్ని గమనించే… ఈసారన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సభకు హాజరవమంటూ స్పీకర్ పరోక్షంగా కూటమి నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు. సభకు రాని వాళ్ళకు జీతాలెందుకని వైసీపీతో పాటు కూటమి ఎమ్మెల్యేలను కూడా దృష్టిలో ఉంచుకునే అన్నారన్నదే విశ్లేషకుల అభిప్రాయం. కేవలం వైసీపీ విషయంలోనే అయితే… ఆయన అంత స్ట్రాంగ్‌గా చెప్పబోరని, మొత్తం సభను ఉద్దేశించే ఘాటు వ్యాఖ్యలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. గత సెషన్ క్వశ్చన్ అవర్‌లో వైసీపీ సభ్యులు ప్రశ్నల్ని లిఖిత పూర్వకంగా పంపేసి అసెంబ్లీకి రాలేదు. దీంతో… కనీసం ప్రశ్నలు అడగడానికైనా వాళ్ళు వచ్చి వెళ్ళాల్సిందని అభిప్రాయపడ్డారట అయ్యన్న పాత్రుడు. అదే విధంగా కూటమి సభ్యుల హాజరు శాతం బాగా తక్కువగా ఉండటాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ఆయన రిపీటెడ్ కామెంట్స్ చేస్తున్నట్టు సమాచారం. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయి. స్పీకర్ ఆవేదనను, వ్యాఖ్యల సీరియస్‌నెస్‌ను అర్ధం చేసుకుని ఈసారన్నా అంతా వస్తారా? సభ నిండుగా కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి.