Off The Record: రాష్ట్రంలో తాము భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక…. ఏపీ బీజేపీ నాయకుల్లో ఆశలు మోసులెత్తాయి. ఇక పదవుల జాతరేననుకుంటూ చాలా మంది మురిసిపోయారట. కానీ… టైం గడిచేకొద్దీ… తత్వం బోధపడుతూ… ఆ ఏముందిలే అనే స్థాయికి వస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. తమ కోటాలో పదవులు దక్కడం సంగతి అలా ఉంచితే… వచ్చిన వాటిని ఇస్తున్న తీరు చూసి కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది నోరు మెదపడం లేదని చెప్పుకుంటున్నారు. మాకో ఛాన్స్ అంటూ ఇన్నాళ్ళు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన వాళ్ళు కూడా… ఇప్పుడు ఎందుకు… ఫ్లైట్ టిక్కెట్ డబ్బులు దండగ అనుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Veeraiah Chowdary Incident: టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు.
గతంలో పదవులు అనుభవించిన జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు, రాష్ట్ర అధ్యక్ష పదవి రేస్‌లో మేము సైతం అంటూ ప్లకార్డులు పట్టుకుని తిరిగిన వాళ్ళంతా ఒక్కసారిగా మూగనోము పట్టడంతో… అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఎందుకలా అంటే…. ఏ పదవి ఎప్పుడు, ఎవర్ని వరిస్తుందో అర్ధంకాని పరిస్థితే అందుకు కారణం అన్నది మరో విశ్లేషణ. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ, పాకా సత్యనారాయణకు రాజ్యసభ సీటు ఇవ్వడం చూశాక ఇక ఎవ్వరూ నోరెత్తకూడదని డిసైడైనట్టు చెప్పుకుంటున్నారు. మనక్కూడా ఒక ఛాన్స్ రావాలంటే నోరు మూసుకుని కూర్చోవడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ బీజేపీ సీనియర్స్…. అదే మెయిన్‌టెయిన్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే… ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ…, ఆ షేర్ లెక్కలో లేనిది కావడమే ఈ సైలెన్స్‌కు మరో కారణం అన్న చర్చ కూడా ఉంది. మొత్తం మీద ఎప్పుడూ ఏదో ఒక స్టేట్‌మెంట్‌తో పొలిటికల్ హీట్ పెంచే నేతలు సైతం ఉన్నట్టుండి మౌన వ్రతం పాటించడం మాత్రం ఏపీ బీజేపీలో చర్చనీయాంశంగా ఉంది. ఈ సైలెన్స్‌కు తగిన ప్రతిఫలం దక్కుతుందో, లేక మనోళ్ళు కామ్‌గానే ఉన్నారు కదా… లెట్ దెమ్ ఎంజాయ్ అని పార్టీ పెద్దలు అనుకుంటారో చూడాలి మరి.