Off The Record: ఆళ్లగడ్డ. హాట్ హాట్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ప్రత్యర్థుల మధ్య ఆళ్లగడ్డ పొలిటికల్ సీన్ రసవత్తరంగా ఉంటుంది. అలాంటిది ప్రస్తుతం టీడీపీలోనే రాజకీయ సెగలు కనిపిస్తున్నాయి. నువ్వా నేనా అనేట్లు రెండు వర్గాలు కత్తులు దూసుకోవడం కేడర్‌ను ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ పంచాయితీ పసుపు పార్టీలో శ్రుతిమించే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఓడిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అయితే ఇదే సీటుపై భూమా కుటుంబ సన్నిహితుడు, మాజీ RIC ఛైర్మన్ AV సుబ్బారెడ్డి కూడా కర్చీఫ్ వేయడం పొలిటికల్ హీట్ పెంచాయి. ఆళ్లగడ్డలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారెడ్డి.. టీడీపీ అధిష్ఠానం ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. సుబ్బారెడ్డి ఉన్నట్టుండి ఇలా ఎందుకు మాట్లాడారనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. టీడీపీ హైకమాండ్ నుంచి ఆయనకు ఏవైనా సంకేతాలు ఉన్నాయా? లేక భూమా అఖిలప్రియను ఇరుకున పెట్టేందుకు అలా మాట్లాడారా అని ఆరా తీస్తున్నారట.
Read Also: Off The Record: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు? ముగ్గురులో రెన్యువల్ ఎవరికి?
టీడీపీ అధిష్ఠానంతో AV సుబ్బారెడ్డి మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీకి ఛాన్స్ ఇస్తే.. భారీ మెజారిటీతో గెలుస్తానని.. ఆళ్లగడ్డ రాజకీయాలలో తనకు 35 ఏళ్ల అనుభవం ఉందని.. ప్రతిగ్రామంలో నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారట. దీంతో ఆళ్లగడ్డ టీడీపీలో ఏం జరుగుతోంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి భూమా, ఏవీ కుటుంబాలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి ఒక మాటపై నడిచేవారు. నాగిరెడ్డి మరణం తర్వాత.. దూరం వచ్చేంది. ప్రస్తుతం అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సుబ్బారెడ్డి హత్యకు అఖిల ఆమె భర్త భార్గవ్ రాముడు కుట్ర పన్నారనే కేసు అప్పట్లో సంచలనంగా మారింది. పైగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలపై వివాదాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అందుకే ఆళ్లగడ్డ టీడీపీలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు టికెట్‌పై సుబ్బారెడ్డి ఫోకస్ పెట్టారనే టాక్ నడుస్తోంది. ఆళ్లగడ్డలో అఖిలకు అనుకూల పరిస్థితులు లేవని టీడీపీ పెద్దలతో సుబ్బారెడ్డి చెప్పారట. ఆళ్లగడ్డలో తాను, నంద్యాలలో తన కుమార్తె జస్వంతి పోటీ చేస్తారని ఆయన వెల్లడించారట. సుబ్బారెడ్డి, అఖిల మధ్య ఈ పొలిటికల్ పంచాయితీ ఎటు మలుపు తిరుగుతుందో ఏమో.. ఆళ్లగడ్డలో మరో చర్చ జరుగుతోంది. ఆళ్లగడ్డ బీజేపీ ఇంఛార్జ్, అఖిల పెదనాన్న కుమారుడు భూమా కిశోర్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. మొత్తానికి ఆళ్లగడ్డలో అఖిల టికెట్‌కు ఓవైపు ఏవీ సుబ్బారెడ్డి మరోవైపు భూమా కిశోర్‌రెడ్డి ఎర్త్ పెడుతున్నారా అనే చర్చ సాగుతోంది. మరి.. ఈ ఎపిసోడ్ రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.