Off The Record: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విబేధాలు కాక రేపుతున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తీవ్రంగా పోటీపడ్డారు. అప్పట్లో తీవ్ర ఉత్కంఠ రేపిన ఆ వ్యవహారం చాలా రోజులు నడిచింది. ఫైనల్‌గా జనసేన కోటాలోకి వెళ్ళడం, నాదెండ్ల మనోహర్ గెలిచి మంత్రి అవడం వరుస పరిణామాలు. అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఆలపాటి రాజాను ఎమ్మెల్సీ చేసింది టీడీపీ అధిష్టానం. ఇద్దరూ రాజ్యాంగ పదవుల్లోకి వచ్చాక కూడా కీచులాటలు ఇంకా నడుస్తూనే ఉన్నాయట. రెండు పార్టీలు పొత్తులో ఉన్నా… తెనాలి మీద పట్టు కోసం ఇద్దరూ ప్రయత్నిస్తుండటం ఎప్పటికప్పుడు హీట్ పెంచుతోంది. ఎలాంటి విబేధాలు లేవన్నట్టు పైకి బిల్డప్‌లు ఇస్తూనే…. లోలోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారట. రెగ్యులర్‌గా ఎవరికి వారే తెనాలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ… కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చినప్పుడు మాత్రమే కలిసి కనిపిస్తున్నారు. గతంలో స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి ట్రస్టు బోర్డు కమిటీ వ్యవహారంలో ఇద్దరు నేతల మధ్య పోరు నడిచింది. చెరో వర్గానికి సపోర్ట్ చేయడం అప్పుడు తీవ్ర వివాదానికి కారణం అయింది.
వైసీపీ హయాంలో టీడీపీ మహిళా నేతలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు కొంతమంది. దీనిపై అప్పట్లో టీడీపీ మహిళా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మరోసారి కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. మహిళా నేతలు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే… పోలీసులు పట్టించుకోకపోవడానికి మంత్రి నాదెండ్ల మనోహరే కారణమన్న అనుమానాలు ఉన్నాయట టీడీపీ లీడర్స్‌కు. తాజాగా తెనాలి వహాబ్ సెంటర్ లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫ్లెక్సీలను డివైడర్ మధ్యలో ఏర్పాటు చేశారు. సడన్‌గా మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి వాటిని తొలగించేందుకు ప్రయత్నించడం వివాదానికి కారణం అయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు, మున్సిపల్ అధికారులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఫ్లెక్సీలను తొలగించాలని ప్రయత్నించడం వెనుక మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారన్నది టీడీపీ నేతల అభియోగం. ఎన్నికల్లో ఎన్నో కష్టాలు పడి కూటమి అభ్యర్దిని గెలిపించడానికి కృషి చేశామని తీరా… ఇప్పుడిలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు తెనాలి తమ్ముళ్ళు. టీడీపీని చులకన చేసే పనులు మానుకోవాలని అంటున్నారు.ఇలా ఇద్దరి నేతల మధ్య విబేధాలు మరోసారి ఫ్లెక్సీల తొలగింపుతో బయటపడ్డాయి. ఇద్దరూ ఆయా పార్టీల్లో కీలకమైన వాళ్ళే కావడంతో విబేధాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది తెనాలి కూటమి కేడర్‌లో.