Off The Record: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు కీలకం. గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం మొత్తం వన్ సైడ్‌గా కూటమికి పట్టం కట్టింది.. ఫలితాలలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. రెండు జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.. గత ఎన్నికల్లో టిడిపి 22, జనసేన 11 స్థానాల్లో, బిజెపి ఒక చోట పోటీ చేసి గెలిచాయి. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 21 సీట్లలో పోటీ చేస్తే అందులో 11 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. వీటిలో మూడు రిజర్వుడు స్థానాలు కాగా… మిగతా ఎనిమిదిలో ఆరు చోట్ల కాపులు పోటీ చేశారు … టిడిపి పోటీ చేసిన 22 స్థానాల్లో ఆరుగురు కాపు అభ్యర్థులు ఉన్నారు… ప్రస్తుతం కేబినెట్‌లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి మంత్రులుగా నలుగురు ఉన్నారు… అందులో ముగ్గురు కాపులైతే… రెండు జనసేన ఖాతాలోనే ఉన్నాయి.. దీంతో కాపు తమ్ముళ్లు కంఫర్ట్ గా ఉండలేకపోతున్నారట.. అసలు పార్టీ విధానాలు ఏంటో తమకు అర్థం కావడం లేదని మాట్లాడుకుంటున్నారు.
Read Also: Off The Record: ఆ మాజీ మంత్రి వ్యవహారం వైసీపీలో బూమ్ రాంగ్ అయ్యిందా..?
ఔట్‌రైట్‌గా కాపు సామాజిక వర్గం అంటే జనసేనేనని టీడీపీ పెద్దలు భావిస్తున్నారా అని చర్చించుకుంటున్నారట.. ఇలా అయితే తమ సామాజిక వర్గం టీడీపీలో ఉండి మాత్రం ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అంతేనా… ఒక అడుగు ముందుకు వేసి ఎవరి నిష్పత్తిలో వాళ్లకు పదవులు ఎందుకు పంపకం చేయలేకపోతున్నారని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.. పొత్తుల వల్ల గతంలో వామపక్షాలు ఏ విధంగా నష్టపోయాయో ఇప్పుడు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీకి అదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని వార్నింగ్‌లు సైతం ఇస్తున్నారట తమ్ముళ్ళు. టిడిపి ఆవిర్భావం తర్వాత చాలా పార్టీలతో పొత్తులు పెట్టుకుంది.. బయటకు వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయని, అలాంటి పార్టీ అధిష్టానం ఇప్పుడు జనసేన విషయంలో ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తోందో… తన ఉనికినే పణంగా పెడుతోందో అర్ధం కావడం లేదని ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. సొంత ఇంటిని తాకట్టుపెట్టి అద్దె ఇంటిని రిపేర్ చేయిస్తున్నారని, ఆ విషయాన్ని పార్టీ పెద్దలు ఎందుకు గుర్తించడం లేదన్నది గోదావరి తమ్ముళ్ల బాధ. ఎన్నికలు ముగిసి ఏడాది గడిచిందిగానీ… ఇక్కడ పార్టీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని టీడీపీ కాపు నేతలు భావిస్తున్నారట.. అంతకంతకు కాపు సామాజిక వర్గం అంటే జనసేన అనేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంటోందని ఇది పార్టీ భవిష్యత్‌కు అంత మంచిది కాదని మాట్లాడుకుంటున్నారు. పొత్తులు ఎప్పటికీ శాశ్వతం కాదని, అలాంటప్పుడు నిలదొక్కుకోవాలంటే… మన పార్టీలో కూడా కాపు నేతలను గుర్తించాలి కదా అన్నది వాళ్ళ క్వశ్చన్.
Read Also: Off The Record: ఆ మాజీ మంత్రి వ్యవహారం వైసీపీలో బూమ్ రాంగ్ అయ్యిందా..?
పొత్తులో భాగంగా వచ్చే నామినేటెడ్ పదవులలో జనసేన ఎక్కువ భాగాన్ని ఈ రెండు జిల్లాల్లో జనసేన కాపు నేతలకే ఇస్తున్నారని, దానివల్ల టిడిపి కాపు నేతలు నైతికంగా దెబ్బ తింటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు టిడిపికి జనసేన అవసరం ఎంత ఉందో జనసేనకు టిడిపి అవసరం కూడా అంతకు మించి ఉందని, ఆ విషయంలో జనసేన అగ్రనాయకత్వాన్ని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారట గోదావరి తమ్ముళ్ళు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా ఆ పార్టీ పదవులు తీసుకునేలా ఎందుకు చెప్పలేకపోతున్నారన్నది వాళ్ళ బాధ. ప్రభుత్వం అంటే ఒక ప్రాంతంలో పార్టీ తరపున ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కనపెట్టి పాలించడమా అని ప్రశ్నిస్తున్నారట.. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో తాము బలి పశువులు అవుతున్నామని గుర్తు చేస్తున్నారు. పార్టీలో కాపు నేతలకు విలువ లేకపోతే ముఖ్యంగా గోదావరి జిల్లాలలో వ్యవహారం మారిపోతుందని గుర్తు చేస్తున్నారట టీడీపీ లీడర్స్. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని సీరియస్ కామెంట్ చేస్తున్నారట తమ్ముళ్ళు… రెండు జిల్లాలలో కాపులతో టీడీపీకి అవసరం లేకపోతే ప్రత్యామ్నాయ ఆలోచనలు వస్తాయంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు.. కొందరు కాపు నేతలు అయితే సమావేశాలు పెట్టుకుని మరీ చర్చించుకుంటున్నారట. మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాలలో పసుపు కాపు తమ్ముళ్లు మండిపోతున్నారు.. మిగతా ప్రాంతాలలో టిడిపి ఎమ్మెల్యేలు నిధులు అభివృద్ధి గురించి చర్చించుకుంటుంటే ఇక్కడ మాత్రం అసలు ప్రభుత్వంలో ఉన్నామన్న కిక్ లేదని గగ్గోలు పెడుతున్నారు.. ఏడాదికే వ్యవహారం తారస్థాయికి చేరింది. ఈ లోపాన్ని టీడీపీ అధిష్టానం సరిచేసుకోకపోతే తర్వాత సర్దుబాట్లు చేయడం తన వల్ల కాదని ఫ్యూచర్ పిక్చర్ చూపిస్తున్నారట గోదావరి టీడీపీ కాపు నాయకులు.