కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల అసంతృప్త స్వరాలు పెరిగాయి. అంతకుముందు ఒకరో ఇద్దరూ ఆ విధంగా బయటపడినా.. పిలిచి మాట్లాడటమో.. వార్నింగ్ ఇవ్వడమో చేసేవారు పార్టీ పెద్దలు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిల విషయంలో ఏ జరిగిందో పార్టీ వర్గాలు చూశాయి. కానీ.. కేబినెట్‌లో చోటు కోల్పోయిన నాయకులు.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలు.. ఆధిపత్యపోరుతో నిత్యం వర్గపోరు రాజేస్తున్న ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఏదో ఒక రూపంలో సడెన్‌గా భగ్గుమంటున్నారు. అసంతృప్త నాయకులు చేస్తున్న కామెంట్స్ లేదా వార్నింగ్‌ల చుట్టూనే రాజకీయ చర్చలు వేడెక్కతున్నాయి.
ఈ అసంతృప్త ఎపిసోడ్‌లో తాజాగా టాప్‌లో నిలిచారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వైఎస్ ఫ్యామిలీకి బంధువు కూడా కావడంతో ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తనని టార్గెట్ చేసిన వాళ్లు తీరు మార్చుకోకుంటే కచ్చితంగా వాళ్ల పేరు.. వారి ఏమి చేశారో బయట పెడతానని సొంత పార్టీ శిబిరంలోనే కలకలం రేపారు బాలినేని. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసిన వారిలో టీడీపీ వాళ్లతోపాటు వైసీపీ నేతలు కూడా ఉన్నారని మాజీ మంత్రి చెప్పడంతో ఆయన సొంతపార్టీలో ఎవరిని గురిపెట్టారు అనేది ప్రశ్నగా మారింది. కేబినెట్‌లో చోటు కోల్పోతున్న సమయంలోనూ బాలినేని విషయంలో పెద్ద హైడ్రామా నడిచింది. కొద్దిరోజులు ఎవరికీ అందుబాటులో లేరు. ఫోన్ కూడా సిచాఫ్ చేశారు. చివరకు ఆయన్ని పట్టుకుని బుజ్జగించి.. సీఎం జగన్‌తో భేటీ అయ్యేలా చూశారు. ఆ తర్వాత పార్టీ పదవి కట్టబెట్టినా.. బాలినేని ఏదో కోల్పోయినట్టు ఫీలవుతున్నారట. దానికితోడు పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. పాత అంశాలను తవ్విపోశారు.
బాలినేని ఇలా అన్నారో లేదో.. వెంటనే కోరస్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. తన విషయంలోనూ ఇలాగే జరిగిందని.. కొందరు వైసీపీ నేతల తీరుతో తానూ ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో గంటల వ్యవధిలో ఇలా ఇద్దరు అధికార పార్టీ నాయకులు మీడియాకు ఎక్కడం చర్చగా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కొన్నాళ్లుగా పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ మధ్య పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులతో ముచ్చటించారు. అప్పుడే పార్టీ పెద్దలు తలంటినట్టు ప్రచారం జరిగింది. మధ్యలో నెల్లూరు జిల్లాలోని కొందరు నాయకులతో పడక చర్చల్లో నలిగారు కోటంరెడ్డి. ఇప్పుడు బాలినేనికి మద్దతుగా నిలుస్తూ.. తనదైన శైలిలో కొన్ని కామెంట్స్ పాస్ చేసేశారు. వాటిని కోటంరెడ్డి తేలికగా భావించినా.. పార్టీ వాటిని లైట్‌గా తీసుకునే అవకాశం లేదన్నది అధికారపార్టీ నేతల వాదన.
ఆ మధ్య శ్రీకాకుళంలోనూ ఇలాంటి పంచాయితీనే చర్చల్లో నలిగింది. మంత్రిగా ఉన్న తమ్ముడు ధర్మాన ప్రసాదరావు పేరును ప్రస్తావించకపోయినా.. పరోక్షంగా ఆయనపై నిప్పులు చెరిగారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. హద్దు మీరితే సీఎం జగన్‌కు కంప్లయింట్ చేస్తానని అన్న వార్నింగ్ ఇచ్చేశారు. చిన్నా చితకా నేతలపై పార్టీ అధినేతకు ఫిర్యాదు చేయాల్సిన పనిలేదని కృష్ణదాస్ అనడంతో.. ఆయన గురిపెట్టింది తమ్ముడు ప్రసాదరావుపైనే అనేది అందరికీ అర్థమైపోయింది.
వీరే కాదు.. మంత్రి పదవి కోల్పోయిన…అనిల్ కుమార్ యాదవ్.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సైతం అధికారపార్టీకి ఒక పట్టాన మింగుడు పడటం లేదు. మంత్రి కాకాణిపై ఇప్పటికీ కాలుదువ్వుతున్నారు అనిల్. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టలేదు నల్లపురెడ్డి. అనిల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఈ విషయంలో జీరో ఫెర్ఫార్మెన్స్ ఉన్న నేతలుగా వీరిని సీఎం జగన్ నేరుగా ప్రస్తావించి.. పద్ధతి మార్చుకోవాలని చెప్పినా .. వారిద్దరికీ చీమ కుట్టినట్టు అయినా లేదన్నది వైసీపీ వర్గాల మాట.
ఆ మధ్య కృష్ణాజిల్లాలో మాజీ మంత్రి పేర్నినాని.. ఎంపీ బాలశౌరిల మధ్య వీధిపోరాటం రచ్చ రచ్చ అయింది. సొంత పార్టీ ఎంపీ వస్తుంటే పేర్ని నాని వర్గం అడ్డుకోవడం దుమారమే రేపింది. రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు.. ఆరోపణలు నడిచాయి. స్వపక్షంలోనే విపక్షంగా మారి తిట్టేసుకున్నారు నేతలు. ఇలా అనేక జిల్లాలో అసంతృప్తితో ఉన్న వైసీపీ సీనియర్లు.. జూనియర్ నాయకులు అసంతృప్తితో రగిలిపోతూ రచ్చకెక్కుతున్నారు. తమ ఆవేదనను వ్యక్తం చేయడానికి అంతా ఒకే మార్గాన్ని ఎంచుకోవడం చర్చకు దారితీస్తోంది. మరి.. ఈ అసంతృప్తులు ఇంకా శ్రుతి మించకుండా పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.