ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనగానే రెక్కలు కట్టుకుని హస్తినలో వాలిపోయారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్లు. వరస మీటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన వారంతా.. తిరిగి వెళ్తూనే బోల్డన్ని కలలు కంటున్నారు. అందులో ప్రధానమైన స్వప్నం అసెంబ్లీలో అడుగుపెట్టడం. ఈ విషయంలో ఎవరికివారు ఊహాలోకంలో విహరించేస్తున్నారు. మీటింగ్స్‌లో పార్టీ పెద్దలు ఏం చెప్పారో.. వారి మాటలకు అర్థాలేంటో లోతైన అధ్యయనం చేయకుండానే కొత్త లెక్కలతో కుస్తీ పడుతున్నారట బీజేపీ కార్పొరేటర్లు. ప్రస్తుతం దానిచుట్టూనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్నను కలిసేందుకు GHMCలోని బీజేపీ కార్పొరేటర్లకు ఛాన్స్ దక్కలేదు. దాంతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. కార్పొరేటర్ల కోసమే ఢిల్లీలో ప్రత్యేకంగా ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. మోడీ ఓకే చెప్పడంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేశారు పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు. కార్పొరేటర్లు ప్రజలతో మమేకం కావాలని.. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు. మోడీతో సమావేశం ఆశాజనకంగా సాగినట్టు మీటింగ్ నుంచి బయటకొచ్చిన అందరి ముఖాలు చెప్పకనే చెప్పాయి. కాకపోతే కొందరి ముఖాలు మతాబుల్లా వెలిగిపోవడంతో ఆరాలు… రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి.
హైదరాబాద్‌లో ఒకసారి కార్పొరేటర్ అయితే చాలు.. తర్వాత అందరి లక్ష్యం ఎమ్మెల్యే అనుకుంటారు. గతంలో కార్పొరేటర్లుగా గెలిచిన చాలా మంది తర్వాతి కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నా రాజాసింగ్ ఒకప్పుడు కార్పొరేటరే. ఇలా పార్టీలో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం GHMCలో కార్పొరేటర్ అంటే.. మినీ ఎమ్మెల్యేగా భావిస్తుంటారు నేతలు. దీంతో కొందరు కార్పొరేటర్లు అప్పుడే ఎమ్మెల్యే అయిపోయినంత ఫీలింగ్‌లో ఉన్నారట. బీజేపీ పెద్దలు ప్రాధాన్యం ఇవ్వడం చూశాక వారి ఆశలు మరింత రెట్టింపు అయ్యాయట. ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రితో సమావేశం తర్వాత కార్పొరేటర్లు ఇదే లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలు.. అక్కడ గతంలో పోటీ చేసిన వాళ్లు.. ఓడిన వాళ్లు.. వచ్చే ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న నాయకులు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ.. GHMC ఎన్నికల్లో సత్తా చాటడంతో తప్పకుండా పదోన్నతి లభిస్తుందని నలుగురైదుగురు కార్పొరేటర్లు ధీమాతో ఉన్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని సంబర పడుతున్నారట. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గతంలో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చాలా మంది బీజేపీ కార్పొరేటర్లు లాబీయింగ్ మొదలుపెట్టేశారట. అలాగే ముషీరాబాద్ నుంచి గతంలో పోటీ చేసిన లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లడంతో.. ఆ సీటును ఆశించే బీజేపీ కార్పొరేటర్లు పెరిగిపోయారట. ఇదే విధంగా శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మహేశ్వరం సీట్ల గురించి కొందరు కార్పొరేటర్లు కర్చీఫ్ వేసే పనిలో పడ్డారట. తమను కాదని పార్టీ కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వబోదని భావిస్తూ.. ఇప్పటి నుంచే గ్రౌండ్‌వర్క్ మొదలుపెట్టేయాలని చూస్తున్నారట కార్పొరేటర్లు. ఢిల్లీలో ప్రధాని, ఇతర పార్టీ పెద్దలతో భేటీ తర్వాత అలాంటి ఆశావహుల అంచనాలు మరింత పెరిగినట్టు చెబుతున్నారు. ఇదంతా చూస్తున్న పార్టీ నేతలు.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెతను గుర్తు చేసుకుంటున్నారట.