2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిని చేయలేదని కినుక వహించారు. అడపా దడపా సొంత పార్టీపైనే సైటైర్లు వేసి కలకలం రేపారు. ఎదురు చూస్తున్న అమాత్య పదవి క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో దక్కింది. మినిస్టర్ గిరి చేపట్టాక.. తనకు ఎదురే లేదని అనుకున్నారో ఏమో.. తన వ్యాఖ్యలతో వేడి పుట్టిస్తున్నారు. ఆయన మాటలకు అర్ధాలే వేరన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి? ఏమా కథా?
నర్మగర్భ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు?
ధర్మాన ప్రసాదరావు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను శాసించారు. ప్రస్తుతం వైసీపీ సర్కార్‌లోనూ మంత్రి. ఆయన ప్రసంగాలు వినసొంపుగా ఉన్నా.. అందులో ఏదో మర్మం దాగి ఉంటుంది. సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తారు. లెక్కలన్నీ దగ్గర పెట్టుకున్నట్టుగా ప్రసాదరావు మాటలు ఉంటాయికానీ.. ఆ లెక్కల ఫలితం ఏంటన్నదే ఆసక్తికరం. ఈ మధ్య కాలంలో ఆయన శైలిలో వైరుధ్యం కనిపిస్తోంది. ధర్మాన ధర్మ సంకటంలో పడ్డారా అని సొంత పార్టీ శ్రేణులే సందేహిస్తున్నాయి. నర్మగర్భ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? వాటి వెనుక కథేంటి? అని వైసీపీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.
2019లో గెలిచాక మంత్రి కాలేదని సైలెంట్
2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన సీనియారిటీని గుర్తించి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ధర్మాన ప్రసాదరావు ఆశించారు. కానీ.. అధిష్ఠానం ప్రసాదరావు అన్న ధర్మాన కృష్ణదాస్‌కు కేబినెట్‌లో చోటు కల్పించింది. తర్వాతి కాలంలో ఉపముఖ్యమంత్రిగా కృష్ణదాస్‌కు పదోన్నతి కూడా కల్పించింది. తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో ధర్మాన ప్రసాదరావు అలిగారని.. అనుకున్నారు. దానికి తగ్గట్టుగా ఆయన యాక్టివ్‌గా కనిపించలేదు. పైపెచ్చు సందర్భం చిక్కితే సొంత ప్రభుత్వాన్ని.. సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇంతలో ఆయన ఎదురు చూస్తున్న మంత్రి పదవి రానే వచ్చింది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో అన్నపోయి తమ్ముడు కేబినెట్‌లోకి వచ్చారు. అంతే ప్రసాదరావు తీరు మారిపోయింది. మునుపటి ప్రసాదరావు బయటకొచ్చారు. విపక్షాలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. కాకపోతే ధర్మాన స్టయిల్లో ఏదో తేడా ఉందన్నదే హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ధర్మాన ధర్మసంకటంలో పడ్డారా?
మూడు రాజధానులకు మద్దతుగా ప్రసాదరావు చేసిన కామెంట్స్ కానీ.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖకు మద్దతుగా రాజీనామా చేస్తానన్న ప్రకటన కానీ.. రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. మన ధర్మానేనా..ఈ స్టేట్‌మెంట్ ఇచ్చింది అని ఆశ్చర్యపోయిన వాళ్లూ ఉన్నారు. అయితే ధర్మాన ధర్మ సంకటంలో పడ్డారు అనేవాళ్లూ ఉన్నారు. తాను మంత్రి పదవి కావాలని అనుకోలేదని.. సీఎం జగన్ పిలవడంతోనే ఒప్పుకొన్నారని చెప్పుకొచ్చారు ధర్మాన ప్రసాదరావు. తర్వాత విశాఖ కోసం చేస్తానన్న రాజీనామా విషయాన్ని ప్రస్తావిస్తే.. సీఎం జగన్ చెప్పవల్లే మినిస్టర్ పదవికి రిజైన్ చేయలేదని తెలిపారు. ఇప్పుడేమో అమరావతి రాజధాని అయితే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని బాంబు పేల్చారు ప్రసాదరావు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు ఈ కామెంట్స్ చేయలేదని ధర్మాన ప్రసాదరావును ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు. అప్పుడు సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడు ఎందుకు గొంతు చించుకుంటున్నారు అని కొందరు నిలదీస్తున్నారు.
రెస్ట్ తీసుకునే సమయం వచ్చిందన్న ధర్మాన
గడప గడపకు మన ప్రభుత్వం సభలో ధర్మాన ప్రసాదరావు చేసిన మరికొన్ని వ్యాఖ్యలు సైతం ప్రస్తుతం చర్చగా మారాయి. తనకు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని.. అదే విషయాన్ని సీఎం జగన్‌కు చెప్పేశానని.. భవిష్యత్ తరానికి నాయకుల్ని తయారు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ధర్మాన ఉపదేశించారు. ఆయన చెప్పడం వరకు బాగానే ఉన్నా.. ఆ భవిష్యత్ తరం నేతలు ఎవరన్నదే ప్రస్తుతం ప్రశ్న. ఇన్నాళ్లూ నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు కోసం కష్టపడిన ఆయన తనయుడు రామ్ మనోహర్ నాయుడే ఆ భవిష్యత్ తరం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కుమారుడి కోసం లైన్ క్లియర్ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. అయితే వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని వైసీపీ అధిష్ఠానం చెప్పిందని.. ఆ క్రమంలోనే ప్రసాదరావు వైరాగ్యంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ ప్రకటనల్లోనూ పార్టీపై ఒత్తిడి తెచ్చే పన్నాగం ఉందనేది ఇంకొందరి విశ్లేషణ. మంత్రిగారివి వైరాగ్యపు మాటలు అనేవారూ లేకపోలేదు. మంత్రి ధర్మాన ప్రతి మాట వెనక వ్యూహం ఉంటుందని.. జనాలను చూసి రెచ్చిపోరని.. ఆయన గురించి తెలిసినవారు చెప్పేమాట. మరి.. అమాత్యులవారి లోగుట్టు ఏంటో కాలమే చెప్పాలి.