ఆ జిల్లాలో ఉన్నది మూడే నియోజకవర్గాలు. మూడింటికి మూడు కీలక సెగ్మెంట్లే. ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ప్రధానపార్టీలు గేర్ మార్చడంతో రాజకీయ వేడి రాజుకుంది. జిల్లా నాదా.. నీదా అన్నట్టు కార్యక్రమాలు జోరు పెంచారు నాయకులు. ఇంతకీ ఏంటా జిల్లా? అక్కడ రాజకీయ ప్రత్యేకత ఏంటి?
ఓటర్లు ఎప్పుడెలా స్పందిస్తారో అంతుబట్టదు..!
నారాయణపేట జిల్లా. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పునర్విభజన తర్వాత మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ కొత్త జిల్లా పరిధిలోకి వచ్చాయి. అవే మక్తల్, నారాయణపేట, కొడంగల్. ఈ మూడు నియోజకవర్గాల్లో ఓటర్లు ఎప్పుడెలా స్పందిస్తారో పార్టీలకు ఇప్పటికీ అంతుబట్టని అంశం. రాజకీయం అంతా భిన్నంగానే ఉంటుంది. తెలంగాణ ఏర్పాటయ్యాక 2014లో జరిగిన ఎన్నికల్లో నారాయణ పేట, కొడంగల్ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. మక్తల్ ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. మక్తల్‌లో గెలిచిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట నుంచి గెలిచిన రాజేందర్ రెడ్డి తర్వాత గులాబీ గూటికి చేరారు. కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
జిల్లాపై పట్టుసాధించే పనిలో విపక్షపార్టీలు..!
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు నియోజకవర్గాల్లోనూ టిఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. నారాయణపేట నుంచి రాజేందర్ రెడ్డి , మక్తల్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డి మరోసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టగా.. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఓడించారు పట్నం నరేందర్ రెడ్డి. గెలుపోటములు ఎలా ఉన్నా కాంగ్రెస్, బీజేపీలు తమ సాంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా స్పందించే నారాయణ పేట జిల్లాలో మూడు ప్రధాన పార్టీలకు పట్టుంది. బలమైన ఓటు బ్యాంక్ ఉంది.
గ్రామాల బాటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!
జిల్లాలో పాగా వేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ప్రతిపక్షాల వ్యూహంతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉంటున్న గులాబీ నేతలు, తాజాగా పార్టీ గర్జన సన్నాహక సమావేశాలతో మరో మారు గ్రామాల బాట పట్టారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ అన్నివర్గాల్లో పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నారట ఎమ్మెల్యేలు. ఈ నెలాఖరును టీఆర్ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో జనాల్ని తరలించే పనిలో ఉన్నారట.
జన జాగరణ పేరుతో కాంగ్రెస్ పాదయాత్ర..!
ఇదే సమయంలో జన జాగరణ పేరుతో పాదయాత్రకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. నవంబర్ 14 నుంచి 21వరకు పాదయాత్ర రూట్ మ్యాప్‌లో బీజీ అయ్యాయి నారాయణపేట జిల్లా కాంగ్రెస్ శ్రేణులు. సంప్రదాయ ఓటు బ్యాంకుతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును క్యాచ్ చేసే పనిలో ఉంది కాంగ్రెస్. గతంలో కొడంగల్‌లో గెలిచిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయన కొడంగల్ నుంచి పోటీ చేస్తే.. ఆ ప్రభావం.. మక్తల్, నారాయణపేటలపై ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి.
కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరుతో బీజేపీ యాత్రలు..!
బీజేపీ కూడా నారాయణపేట జిల్లాపై ఫోకస్ పెట్టింది. కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రస్థాయి నేతల యాత్రలు, సభలు నిర్వహించి క్యాడర్‌లో చురుకు పుట్టించే పనిలో ఉంది. ఇప్పటికే మక్తల్ మున్సిపాలిటీలో పాగావేసిన కమలదళం సార్వత్రిక ఎన్నికల్లో తమ ఎంపీ అభ్యర్థికి వచ్చిన ఓటు బ్యాంక్‌ను మరింత విస్తరించే ఆలోచనలో ఉంది. ఇలా పార్టీల నాయకుల పోటాపోటీ సభలు, సమావేశాలు, యాత్రలు, ఉద్యమాలు చూస్తుంటే.. నారాయణపేట జిల్లాలో ఎన్నికలు వచ్చాయనే వాతావరణం కనిపిస్తోంది. మరి.. ఈ ప్రభావం ఓటర్లపై ఉంటుందా.. భిన్నమైన తీర్పు ఇస్తారా అన్నది కాలమే చెప్పాలి.