టీ కొట్లు.. రచ్చబండల మీద జరిగే చర్చలు యమ రంజుగా ఉంటాయి. రాజకీయాలపై చాలా ఆసక్తిగా చర్చలు అక్కడ జరుగుతుంటాయి. ఒక మాజీ మంత్రిపై ఆ నియోజకవర్గంలో అలాంటి చర్చే నడుస్తోందట. చర్చకు కారణం ఆయనపై వచ్చిన ఒక కరపత్రం. ఆ కరపత్రాల టాక్స్ టీకొట్ల వరకు ఆగితే ఓకే.. పార్టీ అధినేత వరకు వెళ్తే ఏంటన్నదే ప్రశ్నగా మారింది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..!
కాల్వ చుట్టూ టీడీపీలో విమర్శలు..!
గతంలో అనంతపురం జిల్లా టీడీపీలో ఎంతో క్రమశిక్షణ కనిపించేది. ఇప్పుడంతా వర్గ విబేధాలు.. గొడవలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుపైనా విమర్శలు, ఆరోపణలు తప్పడం లేదు. జిల్లా టీడీపీలో కాల్వ కీలకం. చంద్రబాబు నమ్మే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఇప్పుడు ఆయన చుట్టూనే విమర్శలు తిరుగుతున్నాయి. తాజాగా శింగనమల నియోజకవర్గం మొత్తం ఈ మాజీ మంత్రి పేరే వినిపిస్తోంది.
కాల్వ టార్గెట్‌గా శింగనమలలో కరపత్రం చక్కర్లు..!
కాల్వపై ఒక కరపత్రం శింగనమల నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. ఆ కరపత్రంలో మాజీ మంత్రి పేరు ప్రస్తావిస్తూనే శింగనమలలో టూమెన్ కమిటీ.. టీడీపీ ఇంఛార్జ్ బండారు శ్రావణి మధ్య ఉన్న వర్గ విబేధాలలోకి లాగారు. శింగనమల ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గం. ఇక్కడ పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రావణిని కాదని.. అగ్రవర్ణాలకు చెందిన నాయకులతో టూమెన్ కమిటీని వేసింది టీడీపీ అధిష్ఠానం. ఆ టూమెన్ కమిటీ కర్త కర్మ క్రియ అన్నీ కాల్వ శ్రీనివాసులే అని ఆ కరపత్రంలో ఆరోపించారు.
కరపత్రంలోని అంశాలపై ఆసక్తికర చర్చ..!
ఇప్పటికే శ్రావణి వర్గీయులు టూమెన్ కమిటీని వ్యతిరేకిస్తూ జిల్లా టీడీపీ ఆఫీస్‌లో కాల్వతో గొడవపడ్డారు. తరచూ రోడ్డెక్కుతున్నారు స్థానిక నాయకులు. ప్రస్తుతం శింగనమల నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ కరపత్రాలే కనిపిస్తున్నాయి. అందులోని అంశాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ కరపత్రాలు రావడానికి కారణం మీరంటే మీరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉద్యమానికి సిద్ధమనేలా కరపత్రంలోని అంశాలు..!
గత ఎన్నికల్లో శింగనమలలో టీడీపీ ఓటమికి కారణాలంటూ కొన్ని అంశాలను ఆ కరపత్రంలో ప్రస్తావించారు. గడిచిన రెండేళ్లుగా ఎలాంటి కార్యక్రమం చేపట్టని వారిని కమిటీలో వేశారని విమర్శించారు. దళితులకు అన్యాయం చేస్తున్నారని.. అణగదొక్కుతున్నారని.. దానికి వ్యతిరేకంగా దళిత నాయకుల యునైటెడ్ ఫ్రంట్, ఏపీ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం.. ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేర్లతో ఉద్యమానికి సిద్ధమన్న సంకేతాలు సూచించేలా ఆ కరపత్రం ఉంది.
కాల్వను టార్గెట్ చేసిన ఒక సామాజికవర్గం..!
ఇన్నాళ్లూ ఎటువంటి విభేదాలు లేకుండా ఉన్న కాల్వ తనదికాని నియోజకవర్గం విషయంలో చిక్కుకుని వివాదాస్పదం అయ్యారు. ఒక సామాజికవర్గం అంతా కాల్వను టార్గెట్ చేసింది. అది ఎక్కడ తన నియోజకవర్గంలో తన కొంపముంచుతుందనే ఆందోళనతోపాటు.. అధినేతకు ఆ కరపత్రం చేరితే వచ్చే సమస్యలు ఏంటో అర్థంకాక తల పట్టుకున్నారట కాల్వ.