మాది కూడా ఒక పార్టీ అన్నట్టుగా ఉన్నారు ఆ శిబిరంలోని నాయకులు. పెద్దగా ప్రజల్లోకి వెళ్లిందీ లేదు. ఇంతలో పార్టీ అధ్యక్షుడే గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. చెక్‌పోస్టు పడకుండానే లోడ్ ఎత్తేయడానికి రెడీగా ఉన్నారు. మరి.. ఆయన స్థానంలో వచ్చేవారు ఎవరు? ఆ దిశగా కసరత్తు మొదలైందా లేదా?
తెలంగాణలో టీడీపీ బలంగా నిలబడే అవకాశం చిక్కలేదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన పార్టీ తెలుగుదేశం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోయింది. ఇప్పటికే పార్టీలో పెద్ద పెద్ద నాయకులంతా తలోదారి చూసుకున్నారు. ఉన్నవారిలో బెటర్ ఆప్షన్ అని ఎంపిక చేసి.. L రమణకు తెలంగాణ టీడీపీ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే అధ్యక్షుడు. రాష్ట్రంలోని ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా బలంగా ప్రజల్లో నిలబడే అవకాశం టీడీపీకి చిక్కలేదు. ఎన్నిక ఏదైనా జనం మద్దతు కరువైంది.
సైకిల్ దిగి కారెక్కేందుకు రమణ సిద్ధం?
తెలంగాణ టీడీపీ నుంచి ఎంత మంది వెళ్లిపోయినా.. పార్టీలో నేనొక్కడినే అని ఎన్నోసార్లు ప్రకటించారు రమణ. ఇప్పుడు ఆయన వంతు కూడా వచ్చేసింది. సైకిల్ దిగి కారెక్కేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. రమణ నోటి నుంచి పార్టీ మార్పుపై స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పక్కాగా వినిపిస్తోంది. మరి.. రమణ వెళ్లిపోతే.. కొత్త సారథి ఎవరనే చర్చ తెలుగుదేశంతోపాటు.. రాజకీయవర్గాల్లోనూ మొదలైంది.
రమణ ప్లేస్‌లో టీడీపీ బాధ్యతలు ఎవరికి?
తెలంగాణలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీడీపీని నడిపించటం అంత సులువైన పని కాదు. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే క్యాడర్ కావాలి. నాయకులతోపాటు కేడర్ కూడా ఎక్కికక్కడ సర్దుకుంది. కొంతమంది నాయకులు మాత్రం మొదట్నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. అలా ఉన్నవారిలో రమణ స్థానంలో పార్టీ బాధ్యతలు చేపడతారన్నది ప్రశ్నగా ఉంది.
అంతుచిక్కని చంద్రబాబు నిర్ణయం
పదవిని అడ్డం పెట్టుకుని ఇంకెవరైనా జంప్ చేస్తే?
ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఉన్నవారిలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డిలు మాత్రమే గతంలో చట్ట సభల్లో పనిచేశారు. పార్టీలో సీనియర్ నాయకులుగా అరవింద్ కుమార్ గౌడ్, బక్క నర్సింహులు ఉన్నారు. టీ టీడీపీలో ఉన్న నేతల గురించి బూతద్దం పెట్టి చూస్తే వీళ్లే కనిపిస్తున్నారట. అయితే చంద్రబాబు నిర్ణయం ఏంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ నలుగురిలో ఒకరిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని చేస్తారా లేక.. నాన్చి నాన్చి మరో కొత్త వ్యక్తిని తెరపైకి వస్తారా అన్నది ఒక ప్రశ్న. గతంలో టీడీపీలో నువ్వా నేనా అనుకున్న నాయకులంతా వెళ్లిపోయారు. ఉన్నకొద్దిమందీ అంటీముట్టనట్టు ఉంటున్నారు. సారథిగా బాధ్యతలు చేపట్టేవారికి పదవి అలంకార ప్రాయమే అనే ఒక అభిప్రాయం ఉంది. ఒకవేళ ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఇంకెవరైనా జంప్ చేస్తే.. అది టీడీపీకి ఇంకా నష్టం చేకూరుస్తుంది.
ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం జంప్
తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా.. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. టీడీపీ సోదిలో కూడా ఉండటం లేదు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా ఎల్ రమణ పోటీ చేశారు. డిపాజిట్ కూడా దక్కలేదు. ఉన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కండువా మార్చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయాలని అంటే బ్రహ్మాండం బద్దలవ్వాల్సిందే. ఇప్పటికే ఏపీ పాలిటిక్స్‌తో సతమతం అవుతున్న చంద్రబాబు.. తెలంగాణపై ఫోకస్ పెడతారా అన్నది కూడా డౌటే.