వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించాలనే పట్టుదలతో ఉంది టీడీపీ. గుడివాడలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటి నుంచే రకరకాలుగా కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థి బరిలో ఉంటే.. మిషన్ సక్సెస్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ క్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమ అయితే ఈక్వేషన్ సరిపోతుందని భావిస్తున్నారట.
వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించడం టీడీపీ నేతల ముందున్న ప్రధాన టార్గెట్. ఇదే సమయంలో గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించాలనేది కృష్ణా జిల్లా నేతలకే కాకుండా.. యావత్ పార్టీకి సవాల్‌గా మారింది. పార్టీ అధినాయకత్వాన్ని.. పార్టీ పెద్దలపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీలోని ముఖ్యులు ఇప్పటి నుంచే కార్యాచరణపై ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఈ క్రమంలో పార్టీలో కీలక చర్చ జరుగుతోంది. గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు ప్రస్తుత ఇంఛార్జ్ రావి వెంకటేశ్వరరావు సరిపోతారా..? లేక మరో సీనియర్ నేతను అక్కడి నుంచి బరిలో దించాలా అనే చర్చ సాగుతోంది.
గుడివాడ టీడీపీ ఇంఛార్జ్ రావి వెంకటేశ్వరరావు గతంతో పోల్చుకుంటే కొద్దిగా యాక్టీవ్ అయినా.. ఆ స్పీడ్ ఎన్నికల్లో కొడాలి నానిని తట్టుకోవడానికి సరిపోదనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో ఉందట. టీడీపీని, పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌తో కొడాలి నాని ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని.. అయితే ఎన్నికల్లో ఓడించడానికి అదొక్కటే సరిపోదని అభిప్రాయ పడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని గెలవడం ఖాయమనే రీతిలో గుడివాడలో చర్చ జరుగుతున్న అంశాన్ని గుర్తు చేస్తున్నారట. గుడివాడ టీడీపీ ఇంఛార్జ్‌గా సరైన నాయకుడు లేకపోవడం వల్లే ఆ ప్రచారం జరుగుతుందనేది పార్టీలో కొందరి వాదన. బలమైన అభ్యర్థి బరిలో ఉంటే తమ ప్రయత్నాలకు కొంత ప్లస్ అవుతుందని అనుకుంటున్నారట.
ఈ క్రమంలో కొడాలి నానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సరైన అభ్యర్థి అనే అభిప్రాయం చాలా మంది నేతల్లో కనిపిస్తోందట. ప్రత్యేకించి కృష్ణా జిల్లాలోని చాలామంది కార్యకర్తలు.. ముఖ్యులు.. దేవినేని ఉమ పేరును సూచిస్తున్నారట. ప్రస్తుతం దేవినేని ఉమా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ.. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు టీడీపీ అధ్యక్షునిగా పని చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాతో.. ప్రత్యేకించి గుడివాడ సెగ్మెంటులోని చాలామంది నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాటికితోడు ఇటీవల ఉమ్మడి కృష్ణాజిల్లా విస్తృతస్థాయి సమావేశంలో దేవినేని ఉమా చేసిన ప్రసంగం.. తొడగొట్టడం వంటి సంఘటనలపై గుడివాడ నేతల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోందట. ఈ పరిణామాలన్నీ విశ్లేషించుకున్న తర్వాత గుడివాడలో మాజీ మంత్రి అయితేనే లెక్క సరిపోతుందని చర్చకు పెడుతున్నారట.
దేవినేని ఉమామహేశ్వరరావుది మైలవరం. అంతకుముందు నందిగామ ఆయన అడ్డా. నియోజకవర్గాల పునర్విభజనలో నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో మైలవరానికి షిప్ట్ అయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో వరసగా గెలిచి.. 2019లో హ్యాట్రిక్ నమోదు చేయాలని చూశారు. కానీ.. కుదరలేదు. మారిన పరిస్థితుల్లో.. పార్టీ పెద్దలు కోరితే మైలవరం వదిలి గుడివాడకు వెళ్తారా? అనేది ప్రశ్న. పైగా వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ అధినేత కసరత్తు చేస్తున్నారు. ఇదే ఊపులో గుడివాడలో ఉమాను అభ్యర్థిగా ప్రకటిస్తే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టొచ్చని అభిప్రాయ పడుతున్నారట. మరి.. టీడీపీ ఏం చేస్తుందో.. ఉమా గుడివాడలో సై అంటారో లేదో చూడాలి.