గ్రాఫ్ పడిపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్ అని సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్పేయడంతో.. గోదావరి జిల్లాల్లో ఆ అంశం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు టికెట్ వస్తుంది? ఎవరికి రాదు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఏ నలుగురు వైసీపీ శ్రేణులు కలిసినా ఇదే చర్చ. దీనిని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యేలపై కొందరు వ్యతిరేక ప్రచారాలు మొదలు పెట్టేస్తున్నారట.
జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు కష్టమే అనే ప్రచారం జోరుగా ఉంది. కాకినాడ జిల్లాలో ముగ్గురు వైసీపీ శాసనసభ్యులకు, కోనసీమ జిల్లాలో ఒక ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని వారి వైరివర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీకి పార్టీ కోఆర్డినేటర్ లేరు. రాజమండ్రి రూరల్ ఇంఛార్జ్‌ను పనితీరు మెరుగు పర్చుకోవాలనే సంకేతాలు ఇచ్చారట.
నియోజకవర్గాల్లో తమకు బలం తగ్గలేదని, బాగా పనిచేస్తున్నామని భుజాలు చర్చుకుంటున్న ఎమ్మెల్యేలకు.. సీఎం జగన్ చెప్పిన గ్రాఫ్‌ల విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఉలిక్కి పడుతున్నారట. ఆ జాబితాలో తాము ఉన్నామా? లేమా అని ఆందోళనలో ఉన్నారట. తొమ్మిది నెలల్లో గ్రాఫ్ పెంచుకోకపోతే టికెట్ కష్టమని స్పష్టం చేయడంతో రోజులు లెక్క పెడుతున్నారట. సర్వే ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని, ఫలితం బాగోకపోతే టిక్కెట్ రాదని చెప్పడంతో.. ఆ సాకుతో ఎవరికి ఎసరు పడుతుందో అనే చర్చ జరుగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసి బలంగా ఉన్నామని భావిస్తున్న ఎమ్మెల్యేలకు.. అధినేత ప్రకటన గాలి తీసేసినట్టు అయిందట. గడచిన మూడేళ్ల పనితీరు నిరూపించుకోవడానికి తమ చేతుల్లో ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పథకాల పేరుతో నగదు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా పడుతోందని.. సమస్య వస్తే జనం సచివాలయ సిబ్బంది దగ్గరకు వెళ్తున్నారని.. ఇక తమ గ్రాఫ్ ఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారట. టికెట్ వచ్చే ఛాన్స్ లేని నియోజకవర్గాల్లో ఇంత వరకు తటస్థంగా ఉన్న సీనియర్లు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. జగ్గంపేటలో మాజీ మంత్రి తోట నరసింహం, ప్రత్తిపాడులో వరుపుల సుబ్బారావు చురుకుగా ఉన్నారు.
మే 10 నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటా తిరగాలి. ఆ డేట్ సమీపించే కొద్దీ తల పట్టుకుంటున్నారట. దాంతో గ్రాఫ్ పెరగకపోతే ఎలా అనే ప్రశ్నలు ఉన్నాయట. మరి.. పార్టీ జాబితాలో ఉండేదెవరో? పోయేదెవరో? కాలమే చెప్పాలి.