ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు.. చేసే సమీక్షల్లో కొన్ని రహస్యంగా ఉంటాయి.. మరికొన్ని బయటకు చెబుతారు. కానీ.. రహస్యంగా ఉంచాల్సిన అంశాలే ఏపీలో బయటకొచ్చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి చికాకులు తప్పడం లేదు. అందుకే కీలక నిర్ణయాలు తీసుకున్నారట. వాటిపైనే ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
లీకులపై విపక్షాలకు సమాధానాలు చెప్పడానికే టైమ్ సరిపోతోందా?
ఆర్థికపరమైన అంశాలు.. ప్రభుత్వం వేసుకున్న లెక్కలు.. అందులో తప్పిదాలు.. నిర్లక్ష్యాలు.. నిబంధనల ఉల్లంఘనలు అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు సమాధానం చెబుతున్నారు. కేంద్రం అడిగే ప్రశ్నలకు.. వేస్తున్న కొర్రీలకు వివరణ ఇస్తున్నారు. దీనివల్ల రాష్ట్రసర్కార్‌కు వచ్చే ఇబ్బంది కానీ.. రాజకీయంగా డ్యామేజ్ ఏదీ లేకున్నా.. ప్రభుత్వ ప్రయార్టీలను పక్కన పెట్టి యంత్రాంగం అంతా ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. తమకు లభించిన చిన్న డాక్యుమెంట్లను పట్టుకుని విపక్షాలు కోర్టులకు వెళ్తుండడం కూడా తలనొప్పిగా ఉంటోందని భావిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఈ క్రమంలో ఫైనాన్షియల్ మేటర్స్‌కు టాప్ సీక్రెట్ హోదా కల్పించాలని నిర్ణయించారట. అధికారులకు సమాచారం వెళ్లిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా చేసిన సూచనల్లో కొన్ని కీలకాంశాలు ఉన్నాయట.
ముఖ్యమైన అంశాలు సమీక్షల్లో కాకుండా విడిగా కలిసి చర్చించాలి!
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకుండా సమీక్షలకు ప్రాధాన్యం!
సీఎం జగన్ దగ్గర జరిగే సమీక్షల్లో ఆర్థిక అంశాల ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడాలని క్లియర్ మెసేజ్ వెళ్లిందట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల్లోని పెండింగ్ బిల్లుల గురించి సీఎంతో జరిగే సమీక్షలో కాకుండా.. విడిగా ముఖ్యమంత్రి లేదా సీఎం పేషీ అధికారులతో సదరు శాఖ ఉన్నతాధికారులు చర్చించాలని సూచించారట. సమీక్షల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల కాపీలు బయటకు వెళ్లిపోతున్నాయి. అక్కడి నుంచే అసలు సమస్య వస్తుందని ప్రభుత్వం గుర్తించిందట. పెండింగ్ బిల్లులు.. నిధుల లేమి కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాపీల రూపంలో లీకవుతున్నట్టు తెలుసుకున్నారట. దీంతో సమీక్షల్లో వీలైనంత తక్కువగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉండేలని ఆదేశించినట్టు తెలుస్తోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకుండానే సమీక్షలకు హాజరు కావాలనే ఆదేశాలు కూడా వెళ్లినట్టు సమాచారం. ఒకవేళ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ తప్పనిసరైతే.. వాటిని చూపించిన వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించారట.
ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా అధికారులను అప్రమత్తం చేశారా?
సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా ఈ సూచలను అధికారులకు అందించినట్టు చెబుతున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. రావాల్సిన అంశాలు బయటకు రాకుండా ఉంటాయా..? అనే చర్చ కూడా జరుగుతోంది. మరి.. ప్రభుత్వం చేపట్టిన చర్యలు పాలకులకు ఏ మేరకు ఉపశమనం కలిగిస్తాయో చూడాలి.